ఫహాద్ ఫాజిల్ నటనా పటిమకు మరో గీటురాయి !

Sharing is Caring...

రమణ కొంటికర్ల………………………………….. 

బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. కానీ వెంటనే కుప్పకూలుతాడు.

కుట్టప్పన్ ను ఆసుపత్రికి తరలించేందుకు కారు కీస్ తీసుకుని పరిగెత్తే క్రమంలో చిన్న కొడుకైన జోజిలో తండ్రి కిందపడిపోయాడే… ఏమైందోనన్న ఆందోళన కన్నా… తను ఇక కారు నడుపొచ్చన్న ఆనందపు తాలూకు సన్నివేశం… సింబాలిక్ గా కథెలా ఉండబోతుందో చెప్పే ఘట్టం.

అంతేనా… అన్నకొడుకు పాపి ఆన్ లైన్ లో తెప్పించుకున్న ఎయిర్ గన్ ను గుంజుకుని… తెల్ల గుర్రంతో కలిసి ఎయిర్ గన్ పట్టుకుని సెల్ఫీ దిగే సీన్… జోజి మనస్తత్వాన్నీ పట్టిచూపించేలా మౌల్డ్ చేసిన… రచయిత శ్యాంపుష్కరన్… దర్శకుడు దిలీష్ పోతన్ ల మనో నేత్రాలకు.. షైజూ ఖలీజ్ థర్డ్ ఐ కూడా జత కలిసిన క్రైమ్ డ్రామా మళయాళ జోజి.

ప్రాశ్చాత్య సినిమాల తరహాలో సాగే జస్టిన్ వర్ఘీస్ మళయాళ సినీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… కథ, కథనం, క్యారెక్టర్స్ తో మిళితమయ్యే తీరు.. మరింతగా స్టోరీలోకి ఇనాల్వ్ చేస్తే మరో మ్యాజిక్. విలక్షణమైన నటులను వేళ్లమీద లెక్కించే రోజుల్లో… ఫహద్ ఫాజిల్ ను ఓ పెద్దనవేలనుకోవాలేమో అనిపిస్తుంటుంది.. అతడి గత సినిమాల నుంచీ కనబరుస్తున్న అభినయాన్ని చూస్తూ వచ్చినప్పుడు! కళ్లతోనే భావాలు పలికిస్తాడు… నటిస్తాడు.. మైమరిపిస్తాడు.

సినిమాకు ఫహద్ ఒక ఎస్సెట్టైతే… ప్రఖ్యాత ఆంగ్ల రచయిత షేక్ స్పియర్ మ్యాక్ బెత్ నాటకం స్ఫూర్తితో తీసిని జోజి… కథ, కథనం సాగే తీరు, దర్శకత్వ ప్రతిభ… జోజి క్యారెక్టర్ తో పోటీపడుతున్న పద్ధతి.. అంత స్లో మోషన్ పిక్చర్ లోనూ మారథాన్ కాంప్టీషన్ ను గుర్తుకు తెచ్చేవే.తోటలు, పొలాలు కల్గిన బాగా ధనవంతుడైన తండ్రి కుట్టప్పన్ అలా ఆసుపత్రి పాలయ్యాడో, లేడో… ముగ్గురు కొడుకులు ఆస్తికోసం తపన పడే క్రమంలో.. కుటుంబంలో కనిపించే కలహాలు, ఏర్పడే అనుమానాల నడుమ జోజి సినిమా ఆఫ్ బీట్ మూవీ శైలిలో నడుస్తుంటుంది.

చిన్న కొడుకైన జోజి పాత్రలో ఫహాద్ ఫాజిల్ ది సినిమాలో కీలకపాత్ర కాగా… పెద్దకొడుకు జోమోన్ గా బాబూరాజ్, రెండో కొడుకు జైసన్ గా జోజి ముండకాయం, జైసన్ భార్య బిన్సీగా ఉన్నిమయ ప్రసాద్, జోమోన్ టీనేజ్ కొడుకుగా ఒంటరితనపు ఛాయలతో పాపిగా కనిపించే అలిస్టెయిర్ అలెక్స్ పాత్రల చుట్టే ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా సాగుతుంటుంది.అయితే జోజిలో తండ్రి కుట్టప్పన్ ను మట్టుబెట్టే క్రమంలో… తిలాపాపం తలా పిడికెడన్నట్టు ఇంట్లో అందరి పాత్రలకు భాగస్వామ్యముండటమే ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాలో ప్రధానాంశం.

బిన్సీ ఎలా చెబితే అలా నడుచుకునే జైసన్.. తన తండ్రిని పట్టణంలో కొత్త ఇల్లు కొనడానికి డబ్బు అడుగుతాడు. కానీ కుట్టప్పన్ దాన్ని తిరస్కరిస్తాడు. సినిమా మొత్తం వంటిల్లే తన అడ్డా అన్నట్టుగా కనిపించే బిన్సీ.. తన నిరాశను జోజీతో పంచుకుంటుంది. జోజీ కూడా తండ్రి గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఉండటంతో పాటు.. కుటుంబ బాధ్యతల నుంచి తండ్రిని తప్పుకోవాలని కోరడం.. అంత పక్షవాతం వచ్చిన పరిస్థితుల్లోనూ బలాఢ్యుడైన కుట్టప్పన్ జోజీని తన ఎడమ చేత్తో ఉక్కిరిబిక్కిరి చేయడంతో.. ఇక తండ్రిని మట్టుబెట్టడమే పరమావధిగా జోజి స్కెచ్చులు సాగుతుంటాయి.

కుట్టప్పన్ రోజువారీ వాడే మందుల జాగాలో… అటువంటి ట్యాబ్లెట్లనే అనుమానం రాకుండా రహస్యంగా తీసుకొచ్చి భర్తీ చేసి… తండ్రి మరణానికి ప్రధాన కారణమైతాడు చిన్న కొడుకు జోజి. తాను నిత్యం వెళ్లే బావి దగ్గరే తన నేరపూరిత ఆలోచనలకు పని కల్పించే జోజిపై… పెద్దన్న జోమోన్ కు అనుమానం రావడం… ఆ బావి వద్దే తండ్రిని చంపడానికి వాడిన ట్యాబ్లెట్ల ప్రిస్క్రిప్షన్స్ వంటివాటిని సాక్ష్యాల్లేకుండా దగ్ధం చేసిన దాఖలాలు దొరకడంతో జోజి వ్యవహారం బట్టబయలైతుంది.

అయితే తండ్రి కుట్టప్పన్ ది సహజ మరణం కాదని.. జోమోన్ కు అనుమానం రావడంతో పాటే… వాళ్ల ఇంటివద్ద పనిచేసే తొట్టా సూధి బయట ఈ విషయం గురించి ప్రచారం చేస్తున్నాడన్న చర్చ కుటుంబలో వస్తుంది. దాంతో జోజి.. పెద్దన్న జోమోన్ తో కలిసి సుధీని వెతికే క్రమంలో.. నాటుబాంబులతో రాళ్లను పగులగొట్టే పనిచేసే చోట సూధీ కనిపించడం… సూధీతో తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నావంటూ జోజి వాగ్వివాదం.. సూధీ పారిపోవడం… జోజి వ్యవహారంపై పెద్దన్న జోమోన్ కు అప్పటికే ఉన్న అనుమానం బలపడటంతో.. జోమోన్ దాడి.. అందుకు ప్రతిగా జోమోన్ కొడుకు పాపి దగ్గర గుంజుకున్న ఎయిర్ గన్ తోనే పెద్దన్న జోమోన్ ను కాల్చి… ఆ తర్వాత నాటు బాంబును విసిరి తండ్రితో పాటు అన్నను కూడా చంపి జోజి తప్పు మీద తప్పు చేయడం వంటివి సినిమాలో ఒక కుటుంబంలో ఆస్తిపై పెంచుకున్న ప్రేమలు.. కుటుంబ బంధాలను చెరిపివేసి… నేరస్వభావాన్ని ఎలా పెంచిపోషిస్తాయో చూపెడుతాయి.

ఆ తర్వాత కొద్ది రోజుల్లో.. రెండో అన్న జైసన్ జోజి ప్రవర్తనలో విచిత్రమైన మార్పులను గమనించడం.. జోజీని తన వదిన బిన్సీ ప్రశ్నించడం… ఇందులో మీరూ పాత్రధారులేనన్నట్టుగా జోజి అన్న జైసన్ ను చేసే బ్లాక్ మెయిలింగ్.. అయినా అన్నా, వదిన, అన్నకొడుకైన పాపి తనకు వ్యతిరేకంగానే ఉన్నారు.. ఇక తప్పించుకోలేమనుకునే దశలో తన వద్దనున్న ఎయిర్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేయడం.. తన మొత్తం వ్యవహారానికి ఈ సమాజమే కారణమన్నట్టు ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టిన జోజి… ఆసుపత్రిలో కళ్లు తెరవడం.. పోలీసుల ప్రశ్నలకు కళ్లను జస్టలా బ్లింక్ చేస్తూ అవునని ఒప్పుకోవడంతో ముగిసే కథే జోజి.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!