ప్రముఖులెందరికో చదువు చెప్పిన ‘డాన్ బాస్కో’ !

Sharing is Caring...

Ramana Kontikarla ………..

డాన్ బాస్కో… ముంబైలోని ఈ పాఠశాల అన్ని స్కూల్స్ లోకీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే,ఎందరో వివిధ రంగాలకు చెందిన ఐకానిక్ పర్సనాలిటీస్ ఈ స్కూల్ నుంచే ఎదిగారు. ముఖ్యంగా స్పోర్ట్స్ నుంచి ఎదిగినవారెందరో చదివిన స్కూల్ గా డాన్ బాస్కో ఓ గుర్తింపు దక్కించుకుంది.

ఈ పాఠశాలను సేలేషియన్ సొసైటీ స్థాపించింది. సొసైటీ ని స్థాపించిన వ్యక్తి సెయింట్ జాన్ బాస్కో ఆయన పేరు మీదనే డాన్ బాస్కో వెలసింది. సేలేషియన్ సొసైటీ, డాటర్స్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ (Daughters of Mary Help of Christians) సంస్థలు 130కి పైగా దేశాలలో పాఠశాలలు, కళాశాలలు, వృత్తి శిక్షణ కేంద్రాలు, యువజన హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. సెయింట్ జాన్ బాస్కో వారసత్వం ముంబై వంటి నగరాలలో డాన్ బాస్కో సంస్థల రూపంలో కొనసాగుతోంది..ఇవి యువతకు ఆశాకిరణంగా నిలుస్తున్నాయి.

ఓవైపు చదువులున్నా… పిల్లలను వారికిష్టమైన రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పుడు ప్రోత్సహించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఎంత ఉందో.. ఆ అవసరాన్ని గుర్తించిన స్కూల్ డాన్ బాస్కో.ఇక్కడి నుంచి ఇప్పుడు ఇండియన్ టాప్ మోస్ట్ క్రికెట్ ప్లేయర్ అయిన శ్రేయాస్ అయ్యర్ నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ వరకూ ఎందరో  చదివినవాళ్లు కనిపిస్తారు.

ఆ జాబితా ఓ చాంతాడంత కనిపించినా మనమూ కొన్ని పేర్లు చెప్పుకోవాల్సి వస్తే.. ఫారూఖ్ ఇంజనీర్, రవిశాస్త్రి, షామ్స్ ములానీ, జతిన్ పరంజంపే వంటివారెందరో కనిపిస్తారు. విద్యాప్రాతిపదికన శిక్షణ పొందుతూనే.. ఈ స్కూల్ నుంచి వీరంతా వివిధ రంగాల్లో ఎదిగారు.

క్రీడల్లోనూ ఒక్క క్రికెట్ కు మాత్రమే పరిమితం కాలేదు ఇక్కడి విద్యార్థుల ఎదుగుదల. స్నూకర్ లో ఒక ఆదిత్య మీహ్తా, హాకీలో మరో మిర్ రంజన్ నేగి, ఫుట్ బాల్ లో రాయిస్టన్ డిసౌజా వంటివారెందరో తారసపడుతారు.

ముంబై మాటూంగాలో 1942, జనవరి 31న ప్రారంభమైన ఈ డాన్ బాస్కో పాఠశాలది సరిగ్గా 83 ఏళ్ల చరిత్ర. రోమన్ క్యాథలిక్ బాయ్స్ స్కూల్ అయిన ఈ డాన్ బాస్కో స్కూల్ మరో బ్రాంచ్ ని ఆ తర్వాత బోరివెల్లిలోనూ ప్రారంభించారు.

ఈ పాఠశాల నుంచి బయటకొచ్చి ఎదిగిన క్రీడాకారులు, బాలీవుడ్ నటులు, రచయితలు, వైద్యరంగంలో ప్రసిద్ధి చెందినవారు, సంగీతకారులు ఇలా భిన్నరంగాల ప్రముఖుల జాబితా కనిపిస్తుంది.మరికొందరు అలాంటి పూర్వ విద్యార్థుల లిస్టులో.. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, వైద్యరంగంలో ప్రముఖుడైన డాక్టర్ ఎడ్మండ్ ఫెర్నాండెజ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వంటి వారున్నారు.   

ఇంకా జాజ్ సంగీతకారుడు, పర్క్యూషనిస్ట్ త్రిలోక్ గుర్తు, ఇండియన్ పాప్యులర్ ప్లే బ్యాక్ అండ్ గజల్ సింగర్ హరిహరన్, బాలీవుడ్ నటుడు శశికపూర్,  బాలీవుడ్ దర్శకులు అనంత మహదేవన్, మహేష్ మంజ్రేకర్, నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, కార్డియాక్ స్పెషలిస్ట్ శరద్ పాండే, టీవీ, బాలీవుడ్ నటుడు విశాల్ కొటియన్ వంటి ప్రముఖుల మొదటి అడుగులు ఇదిగో ఈ డాన్ బాస్కో నుంచే ఆరంభమయ్యాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!