గరం గరం … దూరం ..దూరం !!

Sharing is Caring...

త్రిదండి చినజీయర్‌ స్వామి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంకా గరం గరం గానే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు . సీఎం కేసీఆర్‌ను ఈ కార్యక్రమానికి రప్పించడానికి చినజీయర్‌ స్వామి..  మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావులు చేసిన ప్రయత్నలు ఫలించలేదు.

ముచ్చింతల్ వైపు కన్నెత్తి చూడటానికి కేసీఆర్ ఏమాత్రం ఆసక్తి గా లేరు.ప్రధాని మోడీ వచ్చినపుడు కేసీఆర్ అక్కడికి వెళ్ళలేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన సీఎం కేసీఆర్ ఆయన వెంట ముచ్చింతల్‌కు మాత్రం వెళ్ళలేదు. కారణాలు ఇతమిద్దంగా తెలియనప్పటికీ సీఎంకు చినజీయర్‌ స్వామికి మధ్య దూరం పెరిగిందని భావిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ని ఈ కార్యక్రమానికి పిలవడమే అసలు కారణమా ? లేక మరేదైనా కారణముందో ఎవరికి తెలియదు. అయితే రకరకాల ప్రచారాలు  మాత్రం జోరుగా సాగుతున్నాయి. మొత్తం మీద రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరిగిన తీరుతోపాటు చినజీయర్‌ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్ తాలూకూ వారు ఎవరూ కూడా ఆ వైపు తొంగి చూడలేదు.

శ్రీరామానుజ స్వామి మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరు లేకపోవడం ఒక కారణం కాగా తాను ప్రధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలోనే ఆయనను పిలవడం … పీఎం మోడీని చినజీయర్‌ స్వామి గొప్పగా పొగడటం కేసీఆర్ కోపానికి కారణమని కూడా అంటున్నారు.  

అలాగే మోడీ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ …మోడీ ని  శ్రీరామునితో పోల్చడం కూడా కేసీఆర్ కి నచ్చలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముచ్చింతల్ కి దూరంగా ఉండి పోయారు. అలాగే బీజేపీ వర్గాలు ఈ ప్రోగ్రాం మొత్తాన్ని హైజాక్ చేసి నడిపించాయని… చిన జీయర్ స్వామి .. రామేశ్వరరావు వారి కంట్రోల్ లోకి వెళ్లిపోయారని కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అంటేనే కస్సుమని లేస్తున్న కేసీఆర్ కి ఇదంతా ఏమాత్రం నచ్చకనే దూరంగా ఉండి పోయారని అంటున్నారు.

ఇపుడున్నపరిస్థితుల్లో కేసీఆర్ మనసు మారడం అంత సులభం కాదు. ఆయనే కాదు పార్టీ వారు కూడా అటు వైపు వెళ్లకపోవచ్చు.ఇక యాదాద్రి ఆలయ పునః ప్రారంభ కార్యక్రమం, 8-9 రోజుల ఉత్సవాలు చిన జీయర్‌ స్వామి పర్యవేక్షణలోనే జరుగుతాయి’’ అని గత ఏడాది అక్టోబరులో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే ఇపుడు మొత్తం ఈ కార్యాక్రమాలన్ని వాయిదా పడే సూచనలున్నాయి. 

సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న రుత్వికులే యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పూజా కార్యక్రమాలు, హోమాల్లో పాల్గొంటారని భావించారు. అలాగే సుదర్శన మహా యాగం, మహా కుంభ సంప్రోక్షణకు మార్చి 21న అంకురార్పణ చేయాలని నిర్ణయించారు. ఇపుడు ఈ షెడ్యూల్ ప్రకారం అన్ని జరుగుతాయా ? మొత్తం కార్యక్రమం వాయిదా వేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!