Sheik Sadiq Ali ………………………………………….
మారిషస్ దేశంలో తెలుగు వారిని కోరంగిలంటారు.. అలాగే బర్మా (మయాన్మార్)లో కూడా తెలుగువారిని కోరంగీలుగానే పిలుస్తారు.. ఎందుకలా? శతాబ్దాలుగా కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల ప్రజలు వారు ఉపాధి కోసం చైనా, బర్మా, మలేషియా తదితర తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లారు.
అందుకే వారికి కోరంగీలనే పేరు వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో ఉన్న గ్రామమే కోరంగి.. అయితే ఇప్పుడున్న కోరంగి, ఒకనాటి కోరంగి వేరు..కోరంగి ఒకప్పుడు అతి కీలకమైన ఓడ రేవు.. అంతే కాదు ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం నుండే దీని ఆనవాళ్లు ఉన్నాయి..
ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చిన తర్వాత కూడా కోరంగి నౌకాయాన పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదిగా పేరు తెచ్చుకుంది.. లండన్ రేవులో లంగరు వేసిన కోరంగి మేడ్ నౌకలను చూసి బ్రిటిష్ వారికి కన్ను కుట్టింది.. నౌకా వ్యాపారంపై పట్టు సాధించిన బ్రిటిష్ వారు కోరంగి నౌకా పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు పన్నుల భారాన్ని మోపారు.. అయినా తట్టుకొని నిలబడింది ఇక్కడి పరిశ్రమ.
కోరంగి ఓడ రేవు అతి పెద్ద వ్యాపార కేంద్రంగా వర్ధిల్లింది.రెండు అతి పెద్ద తుఫాన్లు కోరంగిని కాల గర్భంలో కలిపేశాయి.. 1789, 1839 సంవత్సరాలు కోరంగికి మరణ శాసనాలుగా మారాయి.. 1789 డిసెంబర్ మాసంలో వచ్చిన మహా తుఫాను ధాటికి కోరంగి అల్లకల్లోలం అయిపోయింది.. దాదాపు 20 వేల మంది మరణించారు.. ఇక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు.
అయినా క్రమంగా కలుకొని మళ్లీ నౌకా నిర్మాణ పరిశ్రమను కొనసాగించారు.. కానీ 1839లో నవంబర్ 25 తేదీ కోరంగి ఉనికిని కాలగర్భంలో కలిపేసింది.. 40 అడుగుల ఎత్తున లేచిన మహా అలలు ఊరంతటినీ ఇసుక సమాధి చేసేసాయి. దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు పోయాయి.. ఇళ్లూ, గిడ్డంగులు, నౌకా పరిశ్రమ మాయమైపోయాయి.. ప్రపంచ తుఫానుల చరిత్రలో మూడో అతిపెద్ద విషాదంగా నమోదైంది ఈ ఘటన.. అసలు cyclone అనే పదాన్ని ఇంగ్లీషు వారు ఈ విషాదం తర్వాతే ఉనికిలోకి తెచ్చారంటారు..