త్రిమూర్తులు సూర్యుడి నుంచే ఆవిర్భవించారా ?

Sharing is Caring...

 Dr.V.Ramakrishna …………………………  Aditya is the infinite, divine universe

ఆయన అందరూ చూడగలిగే దైవం… చర్మచక్షువులు అనుభూతి చెందే తేజం… సకల జీవరాశిలోని చైతన్యం… ‘‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’’. జీవన వ్యాపారాలను జాగృతం చేసి ఆరోగ్యాన్నిచ్చేవాడు సూర్యుడు. ఆయన సర్వసాక్షి,‘లోకసాక్షి’, ప్రత్యక్ష నారాయణుడు. నమస్కారప్రియుడు, సర్వవ్యాపకుడు, ప్రచండ వేగ స్వరూపుడు.

అనంత తేజో విలాసుడు. తనకు జవాన్ని, జీవాన్ని అందించే సూర్యుడిని మనిషి ఓ భౌతిక పదార్థంగానో, వెలుగులీనే నక్షత్రంగానో భావించలేదు. ప్రత్యక్ష దైవంగా పూజించాడు.వేద, పురాణ, ఇతిహాస, కావ్య వాజ్ఞ్మయమంతా సూర్యుడి విశిష్టతను ప్రకటిస్తోంది. ఆ వెలుగు తానేనన్నాడు శ్రీకృష్ణుడు.

జగత్తులోని అణువణువులో నిండి నిబిడీకృతమైన అనంతశక్తి అదేనన్నారు మహర్షులు… చూడగలిగితే ఆదిత్యుడిది అనంతమైన, దివ్యమైన విశ్వరూపమని వివరించారు.సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతూ అన్ని గ్రహాలను ఒకదానికొకటి గుద్దుకోకుండా ఆకర్షణశక్తి తో నిలిపి ఉంచుతాడు అని చెబుతోంది ఋగ్వేదం. 

ఈ రథానికి ఒక చక్రం, ఐదు ఆకులు, మూడు నాభులు, ఎనిమిది బంధాలు, ఒక కమ్మీ ఉంటాయి. రథమంతా బంగారు మయం. అద్భుతమైన కాంతి ఈ రథం నుంచి ప్రసరిస్తుంటుంది. దీనికి అమర్చిన బంగారు కాడికి వాయువేగంతో పరిగెత్తగలిగే గుర్రాలు కట్టి ఉంటాయి. గాయత్రి, త్రిష్టుప్‌, జగతి, అనుష్టుప్‌, పంక్తి, బృహతి, ఉష్ణిక్‌ అనే ఛందస్సులు ఈ గుర్రాల రూపంలో ఉంటాయి. వీటికి ఆకలిదప్పులు ఉండవు. ఎప్పటికీ అలిసిపోవు.

సూర్యరథం వలయాకారంలో తిరుగుతుంటే సూర్యబింబం అన్ని దిశల్లో కుమ్మరిచక్రం తిరిగినట్లు తిరుగుతుంటుంది. . రెండు కాష్టల కాలంలో సూర్యరథం 180 సార్లు వలయాకారంలో పరిభ్రమిస్తుంటుంది. 18 రెప్పపాట్ల కాలాన్నికాష్ట అంటారు. సూర్యుడు చంద్రభాగ నదీతీరంలో ‘మిత్ర’ రూపంలో చాలాకాలం తపస్సుచేశాడు.

ఆ సమయంలో మొదట ప్రజాపతులను, ఆ తర్వాత ఇతర ప్రాణుల్ని సృష్టించాడు. ఆయన ముఖం నుంచి బ్రహ్మదేవుడు, హృదయం నుంచి విష్ణుమూర్తి, ఫాలభాగం నుంచి శివుడు వచ్చారు. పాదతలం నుంచి దేవతల్ని సృష్టించాడు.ఆ తర్వాత సూర్యుడు తనను తాను 12 భాగాలుగా ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, పూష, త్వష్ట, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, విష్ణువు, వరుణుడు, మిత్రుడు గా అంటే  ద్వాదశాదిత్యుడిగా ఆవిర్భవించాడు.

వీటిలో మొదటివాడైన ఇంద్రుడు దేవతల రాజు. ధాత ప్రజాపతిగా ప్రాణుల్ని సృష్టిస్తుంటాడు. పర్జన్యుడు సూర్యకిరణాల రూపంలో అమృతాన్ని వర్షిస్తుంటాడు. పూషుడు మంత్రాల్లో ఉండి ప్రజల్ని పోషిస్తుంటాడు.

త్వష్ట వనస్పతుల్లో, ఓషధుల్లో ఉండి శక్తినిస్తాడు. అర్యముడు జనపదాలలో ఉంటాడు. సమూహాలు నివసించే ప్రాంతాల్లో, భగుడు పర్వత ప్రాంతాల్లో నివాసం ఉండి రక్షణ కల్పిస్తుంటారు. వివస్వంతుడు అగ్నిలో ఉండి ప్రజలకు అవసరమైన ఆహారాన్ని పచనం చేస్తాడు. అంశుమంతుడు చంద్రుని ఆవహించి చల్లని కిరణాలుగా మారి ప్రజలకు ఆహ్లాదం కలిగిస్తుంటాడు.

విష్ణువు రాక్షస సంహారం చేస్తుంటాడు. వరుణుడు ప్రాణులకు అవసరమైన జలాన్ని అందిస్తాడు. మిత్రుడు చంద్రభాగా నదీ తీరంలో నివాసం ఉండి లోక క్షేమం కలుగజేస్తుంటాడు. భవిష్య పురాణం ప్రకారం “సూర్యుడు తన రథంపై అఖండ వేగంతో ప్రయాణిస్తూ జీవులకు కావాల్సిన శక్తినిస్తుంటాడు. ఒక ద్వీపంలో సూర్యుడి వెలుగు మండుటెండవుతుంది.

అదే వెలుగు మరో ద్వీపంలో పండువెన్నెల కాస్తుంది. కానీ అన్ని వెలుగులూ ఆయనవే. ఇంద్రుడి పట్టణమైన అమరావతి మధ్య భాగానికి సూర్యుడు చేరుకునే సమయానికి యముడి పట్టణమైన సంయమిలో ఉషోదయకాలం అవుతుంది. అదే సమయంలో చంద్రుడి రాజధాని విభా పట్టణంలో అస్తమయ సమయం అవుతుంది.

వరుణుడి రాజధాని సుఖా పట్టణంలో అర్ధరాత్రి అవుతుంది. సూర్యరథం యముడి పట్టణం సంయమ మధ్యభాగానికి చేరుకునే సరికి వరుణుడి సుఖా పట్టణంలో ఉదయం, అమరావతిలో అర్ధరాత్రి అవుతుంది. ఈవిధంగా సూర్యుడు ఒక ముహూర్తకాలంలో మనం చూసే ఆకాశంలో 30 భాగాలు తిరుగుతాడు.

ఇదే పురాణం సూర్యుడు 1000 కిరణాలతో ప్రకాశిస్తుంటాడని చెప్పింది. వీటిలో చందన, మంద, కుతు, అమృత అనే పేర్లతో నాలుగు విభాగాలుగా 400 కిరణాలు ప్రసరిస్తుంటాయి. ఇవి వర్షాలకు కారణం. 300 కిరణాలు పసుపు వర్ణంతో ప్రకాశిస్తూ మంచుతో కప్పబడి ఉన్నట్లుగా కనిపిస్తాయి.

వీటిని చంద్రకిరణాలు అంటారు. మరొక 300 కిరణాలు మానవులకు ఓషధుల్ని అందిస్తాయి. సూర్యుడు వర్ష, శరదృతువుల్లో 300 కిరణాలతో ప్రకాశిస్తూ వర్షాలు కురిపిస్తాడు. హేమంత, శిశిర రుతువుల్లో 300 కిరణాలతో వెలుగుతూ మంచు కురిపిస్తాడు.

సూర్యునికి వివస్వంతుడనే పేరు కూడా ఉంది. వివస్వంతుని కుమారుడే వైవస్వంతుడు.ఇతడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి మొదటి తిథి రథ సప్తమియే. ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వంత మన్వంతరమే.

ఆధ్యాత్మిక చింతన అరుదైపోతున్న ఈ రోజులలో ఆదిత్యుని హృదయానికి తన హృదయం జోడించి పరిపూర్ణమైన స్వేచ్ఛతో “ఆదిత్యహృదయం” తెలుగులో రచించిన రచయిత్రికి అభినందనలు. అభిరుచిగల సాహితీప్రియులు ఆస్వాదించుదురుగాక!నమో నభో నారాయణాయ..

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!