Ravi Vanarasi……….
సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ లో కొన్ని పాత్రల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ముఖ్యంగా త్రిపాఠీ కుటుంబాన్ని అంతర్గతంగా కదిలించిన ఒక కీలక పాత్ర – అదేనండి, కాలీన్ భయ్యా (Kaleen Bhaiya) భార్య, బీనా త్రిపాఠి (Bina Tripathi) పాత్ర! రసికా దుగల్ (Rasika Dugal) ఈ పాత్రకు ప్రాణం పోశారు.
మనం చూసే సాధారణ కోడళ్ల పాత్రలకు ఈ బీనా త్రిపాఠి పూర్తిగా భిన్నం. బయటికి పితృస్వామ్య కుటుంబంలో పద్ధతిగా, భర్తకు విధేయురాలిగా కనిపించినా, లోపల ఆమె రగులుతున్న అగ్నిపర్వతం. ఆమె పాత్ర ప్రయాణం మొదటి సీజన్ నుండి చాలా సంక్లిష్టంగా సాగింది.
కేవలం వంటగదికే పరిమితమా?
మొదట్లో ఆమె పాత్రను పరిచయం చేసినప్పుడు, ఆమె కేవలం కాలీన్ భయ్యా యవ్వనంలో ఉన్న రెండో భార్యగానే చూపించారు. తన భర్త కు తన పట్ల శారీరక ఆసక్తి లేకపోవడం, ఇంట్లో మామగారైన సత్యానంద్ త్రిపాఠి (Satyanaand Tripathi) మానసిక, శారీరక వేధింపులు… ఈ అంతర్గత సంఘర్షణే బీనా పాత్ర పునాది. కేవలం ఒక సన్నివేశంలో ఒక పాత్ర కాఫీ కప్పు తీసుకునే విధానం చూసి, బీనా భావోద్వేగ స్థితిని అర్థం చేసుకోవచ్చు.
నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న ప్రతీకారం!
క్రమంగా ఆమె పాత్ర స్థాయి పెరిగింది. తనపై జరిగిన అఘాయిత్యాల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం… అదో గొప్ప మలుపు. తనపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని (మామగారితో పాటు ఆ పనిలో పాల్గొన్న సేవకుడు) అంతం చేయడానికి పరోక్షంగా సహాయం చేయడం! ఇక్కడ రసికా దుగల్ నటన అద్భుతంగా ఉంటుంది.
ఆమె కళ్ళల్లో నిస్సత్తువ, కోపం, ప్రతీకారం వంటి భావాలను గొప్పగా ప్రదర్శించింది. నిజం చెప్పాలంటే, బీనా తన వేధింపుల గురించి ఎవరితోనూ మాట్లాడకపోవడం అనేదే ఆమె పాత్రను మరింత లోతైన అధ్యయనంగా మార్చింది. ఆమె తన నొప్పులను తనలోనే దాచుకుంది.
బీనా – ఒక ఫెమినిస్ట్ చిహ్నమా?
కొందరు బీనా పాత్రను ప్రతీకారం తీర్చుకునే స్త్రీగా చూస్తే, మరికొందరు ఆమెను “పితృస్వామ్యానికి లొంగిపోయి, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడిన” వ్యక్తిగా చూస్తారు. నిజానికి, ఆమె చర్యలు నైతికంగా సరైనవో కాదో చెప్పడం కష్టం. కానీ, ఆమె తన జీవితాన్ని తనే నియంత్రించుకోవడానికి ప్రయత్నించింది. “నేను ఈ ఇంటికి వారసుడిని ఇస్తాను” అని ఆమె చెప్పే డైలాగ్… అదొక శక్తివంతమైన ప్రకటన! ఆ ప్రకటనలో ఆమె ఆధిపత్యం, రాజకీయ చతురత రెండూ కనిపిస్తాయి.
రసికా దుగల్… పాత్రలో ఒదిగిపోయింది. ఆమె కేవలం అందమైన నటి మాత్రమే కాదు, భావోద్వేగాలను సూక్ష్మంగా చూపించే నటి.ఆమె కళ్ళల్లో పలికే వేదన, భయం, నిర్లిప్తత… ఇవన్నీ ఆమె పాత్రకు మరింత బలాన్నిచ్చాయి. ఆమె గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా తన మామగారి ముందు ఉన్నప్పుడు… ఆమె భుజాలు కొంచెం వంగి ఉండటం, ఆమె చేతులు ముడుచుకుని ఉండటం… ఇవన్నీ ఆమె లోపల ఉన్న భయాన్ని, అభద్రతాభావాన్ని సూచిస్తాయి.
ఆపై, ఆమె ఎవరినైనా బెదిరించడానికి ప్రయత్నించినప్పుడు, ఆ కండరాలు బిగుసుకుపోవడం! బీనా తక్కువగా మాట్లాడుతుంది. కానీ, మాట్లాడిన ప్రతిసారీ బలంగా మాట్లాడుతుంది. ఆమె వాయిస్ టోన్, ముఖ్యంగా కోపంతో కూడిన పద్ధతి చాలా ప్రత్యేకమైనది. బీనా త్రిపాఠి” పాత్ర… వెబ్ సిరీస్‌లో అత్యంత ముఖ్యమైన పాత్రల్లో ఒకటి.
ఈ పాత్ర నిస్సహాయత, ఆ తర్వాత ఆమె పవర్ కోసం చేసిన పోరాటం… ఇది ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రచయిత ఆ పాత్రను మలచిన తీరు .. దర్శకులు తెరపై ఆ పాత్రను పండించిన తీరు… దర్శకులు ఆశించిన నటనను ప్రదర్శించి రసికా దుగల్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
జార్ఖండ్ లోని జంషెడ్‌పూర్ లో పుట్టిన పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) నుండి యాక్టింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు.. ప్రముఖ నటుడు ముకుల్ చద్దా (Mukul Chadda) ను 2010లో వివాహం చేసుకున్నారు. ముకుల్ చద్దా కూడా ‘ది ఆఫీస్’, ‘షేర్ని’, ‘సన్ ఫ్లవర్’ వంటి పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించారు.రసికా ఇరవై కి పైగా సినిమాలో నటించారు. ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు.
అందుకే నేను ప్రతి ఒక్కరినీ ఈ సిరీస్‌ను చూడమని సలహా ఇస్తాను. కేవలం గన్స్, యాక్షన్ మాత్రమే కాదు… ఈ పాత్రల మానసిక ప్రయాణాలు కూడా చాలా ముఖ్యం.

