పటేల్ రొట్టె విరిగి నేతిలో పడిందా ?

Sharing is Caring...

ఎవరూ ఊహించని విధంగా భూపేంద్ర భాయ్ పటేల్ గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే ఏకంగా సీఎం కావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయన అదృష్టమల్లా ఆయన పటేల్ కావడం .. పాటీదార్ వర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయన్న ఆలోచన బీజేపీ చేయడమే.

గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తరచుగా మారుస్తుండేది.అప్పట్లో “అదీ కాంగ్రెస్ కల్చర్” అని అన్ని పార్టీలు విమర్శలు చేస్తుండేవి. విమర్శించిన వారిలో బీజేపీ నేతలు కూడా లేకపోలేదు. ఇపుడు ఆపార్టీయే తరచుగా సీఎంలను మార్చేస్తున్నది. కాంగ్రెస్ కల్చర్ ను బీజేపీ కూడా అంది పుచ్చుకుంది.పార్టీని నిలబెట్టుకోవాలి కాబట్టి అలాంటి నిర్ణయాలు సహజమే. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.

ఎవరీ భూపేంద్ర భాయ్ పటేల్ ?

మాజీ సీఎం ఆనందీబెన్ కు ఈ భూపేంద్ర పటేల్ అనుంగు శిష్యుడు.ఆనందిబెన్ నియోజకవర్గం ఘట్లోడియా నుండి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు, భూపేంద్రభాయ్ పటేల్ అహ్మదాబాద్‌లో మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. కొన్నాళ్ళు అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి నాయకత్వం వహించారు. పటేల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసారు.

పాటీదార్ సామాజిక వర్గానికి చెందిన వారు. కోవిడ్ రెండో దశ వ్యాప్తిని అరికట్టడం లో రూపాణీ వైఫల్యం చెందారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో పాటీదార్ వర్గాన్ని ప్రసన్న చేసుకోవడానికి అధిష్ఠానం భూపేంద్రను తెరపైకి తెచ్చింది. రాజకీయంగా అంత అనుభవం లేని ఈ పటేల్ అందరిని కలుపుకుపోగలరా ? ప్రభుత్వ వ్యతిరేకతను సమర్ధవంతంగా ఎదుర్కోగలరా ? అంటే కొన్నాళ్ళు పోతే గానీ చెప్పలేం. ఇదిలా ఉంటే భూపేంద్ర ఎంపికతో సీనియర్లలో అసంతృప్తి నెలకొనే అవకాశాలు కూడా లేక పోలేదు.మోడీ -షా ద్వయం తెర వెనుక నుంచి ఎలా మేనేజ్ చేయగలరో చూడాలి. బీజీపీ అనుసరించిన కుల సమీకరణల వ్యూహాన్నే కాంగ్రెస్ కూడా అమలు చేయవచ్చు. పాటీదార్ నేతను తెరపైకి తెస్తే ఓట్ల చీలిక అనివార్యమౌతోంది. పటేల్ పార్టీని గట్టెక్కించినా . లేకపోయినా ఆయన 15 నెలలు అధికారంలో ఉండొచ్చు.

మోడీ సొంత రాష్ట్రం కాబట్టి మళ్ళీ అధికారం చేజిక్కించుకొవాలని బీజేపీ అధిష్టానం తపన పడుతోంది.కాగా విజయ్ రూపాణి ని తప్పించడంపై కాంగ్రెస్ నేతలు మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. సెటైర్లు పేలుస్తున్నారు. సీఎం ను కాదు పీఎం ను మార్చాలని ట్విట్టర్ వేదికగా హోరెత్తిస్తున్నారు.గత ఆరునెలల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చారు. ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రావత్, కర్ణాటకలో యడియూరప్ప, గుజరాత్‌లో విజయ్ రూపానీ.. ఇంత మందిని మార్చి ఏం ప్రయోజనం లేదు. ముందు మార్చాల్సింది ప్రధానమంత్రిని’’ అని విమర్శలు చేస్తున్నారు. ఈ హోరు ఇక ముందు కూడా సాగవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!