Shiv Sena Crisis
శివసేన సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు.సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను ఉక్కిరిబిక్కిరి చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఆ ఇద్దరూ గుజరాత్‌లోని వడోదరలో సమావేశమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కరోనా నుంచి గవర్నర్ కోలుకున్న దరిమిలా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వమని కోరవచ్చు. బీజేపీ మద్దతుతో సర్కార్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.అదే జరిగితే శివసేన పార్టీ పూర్తిగా ఏక్ నాథ్ వశమైనట్టే. కాగా శివ సేనలో చీలికలు .. సంక్షోభాలు కొత్తేమి కాదు.
శివసేనకు 2005 లో ఎదురుదెబ్బ తగిలింది. బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడైన రాజ్ ఠాక్రే ఆ పార్టీని వీడి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. శివసేనలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని… రాజ్ విమర్శలు గుప్పించడంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే పై వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకున్న నవ నిర్మాణ్ ఆ తర్వాత క్రమంగా ఆదరణ కోల్పోయింది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అయింది. కాగా నారాయణ్ రాణే కారణంగా శివసేనలో చిన్న చీలిక వచ్చింది. బీజేపీ, శివసేన తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు… 1999లో 8నెలలు రాణే సీఎంగా పనిచేశారు.
అయితే 2003లో ఉద్దవ్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన అసమ్మతి స్వరం వినిపించారు. పార్టీ టికెట్లు, పదవులను అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దీంతో 2005లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలో ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతో కలసి మొదట కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత’ మహారాష్ట్ర స్వాభిమాన్ పక్షి’ పేరుతో సొంత పార్టీ పెట్టారు.
పెద్ద స్పందన లేకపోవడంతో 2019లో దాన్ని బీజేపీలో విలీనం చేశారు.ఆ తర్వాత ఛగన్ భుజ్ బల్ రూపంలో.. శివసేనలో తిరుగుబాటు కనిపించింది. ఎన్సీపీలో ఉన్న భుజ్ బల్.. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. శివసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న భుజబల్ బాల్ ఠాక్రేకు సన్నిహితనేత.
అయితే 1991లో ఆయన ప్లేటు ఫిరాయించారు. అప్పట్లో శాసనసభలో ప్రతిపక్షనేతగా మనోహర్ జోషి నియామకం పట్ల భుజ్ బల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే ఏడాది డిసెంబరులో తన వర్గంలోని ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్ లో చేరారు. తర్వాత కాలంలో శరద్ పవార్ కాంగ్రెస్ ను వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడంతో భుజ్ బల్ కూడా ఆయన వెంటే నడిచారు.
అలా చీలికలు ..సంక్షోభాలు శివసేన కు కొత్తేమి కాదు. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే ఏమి చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీనే పూర్తిగా లాక్కుంటాడా ? సొంత కుంపటి పెట్టుకుంటాడా అనేది తేలాల్సి ఉంది.