‘చారుకేశి’ లో చమక్కులెన్నో ??

Sharing is Caring...

Bharadwaja Rangavajhala……………………………..

బాలమురళి అనే కుర్రాడు అంటాడూ …కర్ణాలకు అంటే చెవులకు ఇంపైన సంగీతం ఏదైనా … కర్ణాటక సంగీతమేనట. జానపదం కావచ్చు, త్యాగరాయ కీర్తన కావచ్చు , రేడియోలో వచ్చే … ‘అమ్మదొంగా నిన్ను చూడకుండా’ లాంటి గీతాలు కావచ్చు … అవి మన చెవులకు ఇంపుగా అనిపించాయంటే …అది కర్ణాటక సంగీతమనే అనుకోవాలన్నమాట.

అంచేత …ఇవాళ చారుకేశి రాగం గురించి మాట్లాడుకుందాం. చారుకేశి రాగం కర్ణాటక సంగీతంలో 26వ మేళకర్త రాగం. చారుకేశి రాగంలో చేసిన పాట వింటే మనసుకు స్వాంతనగా ఉంటుందంటారు. హాయైన భావ ప్రకటనకు అద్భుతంగా ఉపయోగపడే రాగం చారుకేశి.

1958 లో వచ్చిన తమిళ ‘సారంగధర’ సినిమా కోసం జి.రామనాథన్ చారుకేశిలో స్వరపరచిన గీతం వింటే చాలు ఆ రాగం ప్రత్యేకత ఏమిటో తెలిసిపోతుంది. ‘వసంతముల్లై’ అంటూ …సౌందరరాజన్ పాడిన పాట… దానికి శివాజీ గణేశన్ అభినయం … రాజసులోచన నర్తనం భలే ఉంటుంది.సారంగధరలోని ఈ తమిళ పాట వింటుంటే ఎవరికైనా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ తెలుగు పాట గుర్తు రాకమానదు.

మణిశర్మ స్వరకల్పనలో వచ్చిన ‘కంత్రీ ‘ సినిమా కోసం వేటూరి రాసిన ‘వయస్సునామీ’ పాట ఇదే వరసలో సాగుతుంది. కావాలంటే వినండి. మణిశర్మ కంత్రీ కోసం ఈ సారంగధర గీతాన్ని వాడలేదు. అప్పటికే తమిళ్ లో విజయ్ నటించిన ఓ సినిమా కోసం వాడారు. ప్రారంభం పాత శివాజీ గణేశన్ ‘సారంగధర’ చిత్రంలో సౌందర్ రాజన్ పాడిన ఓపెనింగ్ లైన్ ను యధాతథంగా ఉంచేశారు. ఆ పాట కూడా ‘వసంతముల్లై’ అంటూనే ప్రారంభమౌతుంది.

కాకపోతే ఈ పాట రాహుల్ నంబియార్, కృష్ణమూర్తి కలసి పాడడం విశేషం. మహేష్ బాబు నటించిన తెలుగు సినిమా ‘పోకిరీ’ తమిళ రీమేకే ఈ సినిమా. చారుకేశి అంటే ‘చక్కని కురులున్న స్త్రీ’ అనే అర్ధం కూడా ఉందంటారా? నాకు పెద్దగా తెలియదు.అయితే చారుకేశి రాగంలో చేసిన పాటలు ఆహ్లాదంగా సాగుతాయనడానికి ఇంతకన్నా గొప్ప భావమేముంటుంది.

ఆత్రేయ రాసిన ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి సఖీ’ అనే పాటకు మాస్టర్ వేణు ఊరికినే చారుకేశి రాగాన్ని వాడలేదు. పాటలో ‘కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్పి ఏమార్చేవు’ లాంటి ఆహ్లాదకరమైన భావాలున్నాయి మరి. మాస్టర్ వేణు స్వరకల్పనలోనే వచ్చిన మరో చిత్రంలోనూ చారుకేశి రాగం వినిపిస్తుంది.

ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగే గీతమే. ‘ఎందుండి వచ్చేవో’…అంటూ సాగే బాలాంత్రపు రజనీకాంతరావు రచన. శాస్త్రీయ, సినీ సంగీతాల మీద విపరీతమైన పట్టున్న రజనీకాంతరావు పాట రాసేప్పుడే రాగాన్ని దృష్టిలో ఉంచుకుని ఉంటారు. బి.ఎన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న వాహినీ వారి ‘రాజమకుటం’ చిత్రం లో రాజసులోచన, ఎన్టీఆర్ ల మీద చిత్రీకరించిన ఈ పాట నిజంగానే హంటింగ్ మెలోడీ.

ఘంటసాల  స్వరకల్పన చేసిన చిత్రం విజయావారి ‘పెళ్లి చేసి చూడు’ లోనూ చారుకేశి రాగంలో చేసిన పాటొకటి ఉంది. విజయా బ్యానర్ లో రెండు యూనిట్లు ఉండేవి. ఒకటి కె.వి.రెడ్డి సారధ్యంలో సాగేది. కె.వి సినిమాలకు ఎక్కువగా ఘంటసాల,పెండ్యాల సంగీత దర్శకత్వం వహించేవారు. రెండో యూనిట్ చక్రపాణి, ఎల్వీ ప్రసాద్ ల సారధ్యంలో పనిచేసేది. ఈ టీమ్ తీసే సినిమాలకు ఎక్కువగా రాజేశ్వరరావు సంగీతం అందించేవారు.

‘పెళ్లి చేసిచూడు’ కు మాత్రం ఘంటసాల సంగీతం అందించడం విశేషం. అందులో వినిపించే ‘ఎవరో వారే’ పాట చారుకేళి లోనే స్వరపరచారు ఘంటసాల.ఇప్పుడు మనం చూసిన ‘పెళ్లి చేసి చూడు’ గీతాన్ని రూపొందించిన ఘంటసాల, పింగళి నాగేంద్రరావుల చేతుల్లోనే పురుడు పోసుకున్న మరో చారుకేశి గీతం మాయాబజార్ లో వినిపిస్తుంది. నిబ్బరమైన సన్నివేశం కోసం కూర్చిన వేదాంత గీతం ఇది.

మాధవపెద్ది వారి గాత్రంలో వినిపించే పాటలో ఆయనే స్వయంగా నటించడం మరో విశేషం. ఇంత చెప్పాక పాటేమిటో అర్ధమైపోయుంటుంది కదా…’ భళిభళిభళి దేవా’ … పాటన్నమాట. చారుకేశి రాగాన్ని కాస్త విస్తృతంగా వాడిన సంగీత దర్శకుల్లో చక్రవర్తి ఒకరు. ఎన్టీఆర్ యమగోల కోసం చక్రవర్తి చేసిన రాగమాలిక ‘ఆడవె అందాల సురభామినీ’. అందులోనూ చారుకేశి వినిపిస్తుంది.

ఇక విశ్వనాథ్ దర్శకత్వంలో క్రాంతికుమార్ తీసిన శారదలో బాధ ధ్వనించే సందర్భానికి చారుకేశిలో స్వరం కూర్చడం విశేషం. ‘వ్రేపల్లె వేచెనూ’ … అంటూ సాగుతుంది గీతం. ఇళయరాజా కాస్త అధికంగా వాడిన రాగాల్లో చారుకేశి ఒకటి. ‘తంబిక్కు ఎంద ఊరు’ అనే ఓ తమిళ సినిమా కోసం ఇళయరాజా చారుకేశిలో అద్భుతమైన గీతాన్ని కంపోజ్ చేశారు.

రజనీకాంత్ నటించిన ఆ సినిమాలో ఆ పాటే చాలా పెద్ద హిట్టైంది. కథానాయికను ఊహిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో కథానాయకుడు రజనీకాంత్ పాడుకునే గీతం అది. ఇంతకీ ఆ కథానాయకి మన మాధవే. Kaadhalin Deepam Ondru Thambikku Entha Ooru అని యూ ట్యూబులో కొడితే ఈ పాటొచ్చేస్తుంది.

ఇళయరాజా చారుకేశిలో స్వరంకట్టిన ఓ పాట వంశీ తీసిన ‘అనుమానాస్పదం’ చిత్రంలో వినిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఇళయరాజా, వంశీ పనిచేసిన సినిమా అది. ఈ ట్యూను ఇళయరాజా కొత్తగా కూర్చినది కాదు.తనే చేసిన ఓ పాత తమిళ సినిమా పాటే. విజయకాంత్ చేసిన ‘నానే రాజు నానే మంతిరి’ అనే సినిమాలో పాట ఇది. విజయకాంత్, రాధిక అభినయించారు.ఇదే ట్యూను వంశీ ‘అనుమానాస్పదం’లో ‘ప్రతి దినం నీ దర్శనం దొరకునా’ గా మారింది.

చారుకేశి రాగంలో మాత్రమే కుదిరే అరుదైన వాతావరణాన్ని అద్భుతంగా వాడుకున్నారు ఇళయరాజా. సుమారు నాలుగున్నర దశాబ్దాల సంగీత సాగరమధనంలో అలసిన రాజా ఇటీవల చాలా సందర్భాల్లో తన ఆపాత మధురాలనుంచే కొన్ని ఆణిముత్యాలను తిరిగి కొత్తగా అందించేస్తున్నారు. ఆ సిరీస్ లో వచ్చిన పాటగానే చూశాను నేను దీన్ని.చక్రవర్తి తరహాలోనే ఇళయరాజా కూడా చారుకేశిని విషాద సన్నివేశానికీ వాడారు.

ధర్మేంద్రతో దేవర్ ఫిలింస్ వారు హిందీలో తీసిన “మా” ని తెలుగు తమిళ భాషల్లో రజనీకాంత్ తో రీమేక్ చేశారు. ఈ రీమేకులకు ఇళయరాజా సంగీతం అందించారు. హీరో తల్లి చనిపోయే సందర్భంలో వచ్చే నేపధ్య గీతాన్ని చారుకేశిలోనే స్వరపరిచారు రాజా. ‘నీవు లేని నేను మోడైన మాను’ అంటూ సాగుతుందీ గీతం. ఈ సినిమా బెజవాడ లక్ష్మీ టాకీసులో చూశామన్నమాట.

చారుకేశిలో చేసిన పాటలు బాలీవుడ్ లోనూ వినిపిస్తాయి. శంకర్ జైకిషన్ కంపోజ్ చేసిన ‘బేదర్దీ బల్మా’ పాట చారుకేశి ఛాయల్లోనే సాగుతుంది.రాజేంద్రకుమార్, సాధన నటించిన అర్జూలో మూవీ కోసం చేసిన ఈ గీతం లతామంగేష్కర్ అద్భుతంగా గానం చేశారు. చారుకేశి రాగంలో పాటలు చేసిన సంగీత దర్శకుల్లో ఎ.ఆర్.రెహ్మాన్ కూడా ఉన్నారు.

నిర్మాత ఎ.ఎమ్.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ డైరక్ట్ చేసిన ‘నీ మనసు నాకు తెలుసు’ మూవీలో ఓ ఆహ్లాద గీతం చారుకేశిలోనే సాగుతుంది. ఈ సినిమాకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. త్రిష తెలుగు ప్రేక్షకులకు కనిపించింది ఈ సినిమాతోనే. ‘ఏదో ఏదో ఏదో’ అంటూ సాగుతుంది పాట. కార్తీక్, గోపికా పూర్ణిమ పాడినట్టున్నారీ పాట.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!