Govardhan Gande ……………………….
Is the election not for the people?…………………….. ఎన్నికలు జనం కోసం కాదా? నాయకుల పదవుల కోసమా? తెలంగాణలో కొద్ది రోజులుగా కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న సంవాదం చూస్తుంటే ఈ ప్రశ్న తప్పక తలెత్తుంది. ఒకాయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటారు. ఇంకొకాయన ఎంపీ పదవికి రాజీనామా చేయమంటారు. చేస్తాను గాని.. అసెంబ్లీనే రద్దు చేస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాననని షరతు విధిస్తాడు.. మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కమ్మని సవాల్ విసురుతాడు.
జబ్బలు చరుచుకుంటారు. తొడలు కొట్టుకుంటాడొకాయన. గెలిచిన వాడు హీరో, ఓడిన వాడు జీరో అవుతారు అనుకుంటారు. ఈ సవాళ్లు,ప్రతి సవాళ్లు జబ్బలు చరుచుకోవడాలు, తొడలు కొట్టుకోవడాలు చూస్తుంటే ఎన్నికలు జనం కోసం కాదు,వీళ్ళ కోసమే అనిపిస్తుంది. మరి వీరి కోసమే ఎన్నికలైతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జనం ఎవరు? వారికి ఎన్నికలతో ఏమీ సంబంధం లేదా?
ప్రజలకు సంబంధమూ,పాత్ర, ప్రమేయమే లేనపుడు ఎన్నికల ప్రక్రియలో జనం ఎందుకు భాగస్వాములు కావాలి? వందల కోట్ల జనం సొమ్మును నాయకుల పదవుల కోసం ఎందుకు ఖర్చు చేయాలి? రాజ్యాంగం అలా నిర్దేశించడం లేదు.జనం కోసమే ఎన్నికల ప్రక్రియ అని చెబుతున్నది. నిర్ణీత గడువులో ఎన్నికలు తప్పని సరిగా నిర్వహించాలని నిర్దేశిస్తున్నది. తద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకొని,వారి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా రాజ్యాంగాన్ని రాసుకున్నాం.ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు . ఉద్యమాలు లేవు. అర్ధాంతర,మధ్యంతర ఎన్నికలు జరగవలసిన పరిస్థితులు లేనేలేవు.
అలాంటి పరిస్థితులు ఉంటే,ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగుతుంటే, ప్రజలు ఎన్నికలను కోరుకుంటే, మధ్యంతర ఎన్నికలు జరగ వలసిందే.కానీ పరిస్థితులు అలా లేవు కదా. అలాంటి పరిస్థితులు ఉన్నట్లు ఓ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దీన్ని ఏమని పిలుద్దాం. ఎన్నికల ప్రక్రియలో జనం పాత్రను కనీస మాత్రంగా మార్చివేసిన దుస్థితికి బాధ్యత ఎవరిది? ఎన్నికలు ఓ తంతులా మారిపోయాయి ఎందుకని ?
ఈ వ్యవస్థని ఇప్పుడు ప్రజాస్వామ్యం అని కాకుండా నాయకస్వామ్యం అని పిలుద్దామా? ప్రజాస్వామ్యానికి పట్టిన ఈ దుర్దశ పై అందరూ ఆలోచించాలి. చర్చించాలి.ఈ దుస్థితి పై బుద్ధిజీవులు మౌనం దాల్చారెందుకు? నోరు విప్పరే ?నాయకస్వామ్యంగా మారిన/మార్చిన ఈ వ్యవస్థను తిరిగి ఆచరణాత్మక ప్రజా/జనస్వామ్యంగా మార్చి “నాయకీయాన్ని” జన/ప్రజాకీయంగా మార్చే దిశలో సామాజిక బాధ్యత గలవారందరూ ఆలోచించవలసిన అనివార్య స్థితి ఇది.
తమాషా ఏమిటంటే …. ఇలా సవాళ్లు విసురుకోవడం రాజకీయాల్లో మామూలే. సవాళ్లు విసురుకున్న సందర్భాలు బోలెడు. అయితే రాజీనామా చేసి నేతలు మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగిన ఉదహరణలు పెద్దగా లేవు. కాబట్టి ఇవన్నీ ఉత్తుత్తి సవాళ్ళే అనుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇలాంటి సవాళ్లను ఎన్నోచూసారు . అసలు ఇలా సవాళ్లు కాసే వాళ్ళు సొంత డబ్బుతో ఎన్నికలు నిర్వహించుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పిస్తే బాగుంటుంది. సొంత డబ్బులు అంటే మాత్రం ఇక సవాళ్లకు దూరమవుతారు.