ఆ ఓడ శకలాలలో బిలియన్ డాలర్ల బంగారం !

Sharing is Caring...

A scramble for funds………

సముద్ర గర్భంలో మునిగిపోయిన ఓడలో ఉన్న నిధుల కోసం మూడు దేశాలు కొట్లాడుకుంటున్న కథ ఇది. 17వ శతాబ్దానికి చెందిన ఒక ఓడ పేలి  సముద్రం లో మునిగిపోయింది. ఇటీవల ధ్వంసమైన  ఆ ఓడ అవశేషాలు బయటపడ్డాయి. ఆ ఓడ శకలాలో బిలియన్ల డాలర్ల విలువైన 200 టన్నుల బంగారం, వెండి, పచ్చలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 

నీటి అడుగున నిక్షిప్తమైపోయిన నిధులను తిరిగి పొందేందుకు కొలంబియా దేశం జాతీయ మిషన్‌ను ప్రకటించింది.  కొలంబియా ప్రస్తుత అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ విషయాన్ని ప్రకటించారు. అతని పదవీకాలం 2026లో ముగుస్తుంది.  పదవీకాలం ముగిసే లోపు నిధిని స్వాధీనం చేసుకోవాలని కొలంబియా దేశం యోచిస్తోంది. 

1708లో కొలంబియాలోని కార్టజేనా ఓడరేవులో మునిగిపోయిన ఓడ స్పెయిన్‌కు చెందినదని ఓ నివేదిక వెల్లడించింది. ఈ నౌకను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించారు. ఇంతలో ఓడ పేలి మునిగిపోయింది. 1708లో పనామాలోని పోర్టోబెల్లో నుండి 14 వ్యాపార నౌకలు, మూడు స్పానిష్ యుద్ధనౌకలు ప్రయాణించాయి.

ఆ సమయంలో స్పెయిన్‌లో వారసత్వ హక్కుపై స్పెయిన్, బ్రిటన్ మధ్య యుద్ధం జరిగింది. స్పానిష్ ఓడ కనిపించిన వెంటనే బ్రిటీష్ వారు దాడిని ప్రారంభించారు. ఈ క్రమంలోనే స్పానిష్ ఓడను తగలబెట్టి పూర్తిగా నీళ్లలోకి మునిగిపోయేలా చేశారట. అందులో ఉన్న నిధి విలువ 200 బిలియన్ డాలర్లు అని అంచనా వేశారు. మునిగిపోయిన ఓడ ను  2015లో గుర్తించారు.

కొలంబియా నేవీకి చెందిన బృందం 3100 అడుగుల లోతులో నౌకను కనుగొంది. 2022లో కూడా ఓ బృందం ఓడ దగ్గరికి వెళ్లి అందులోని నిధిని ఫోటో లు తీశారు. కొలంబియా ఇప్పుడు  ఆ ఓడ నుండి బిలియన్ల డాలర్ల విలువైన నిధిని  వెలికి తీయనుంది. కొలంబియా సాంస్కృతిక శాఖ మంత్రి జువాన్ డేవిడ్ కొరియా నిధిని వెలికితీసే చర్యలు మొదలవుతాయని ప్రకటించారు.

ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని, పనిని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 
మరోవైపు ఓడ సంపదపై వివాదం కూడా తలెత్తింది. స్పెయిన్, కొలంబియా, బొలీవియాకు చెందిన ఖరా ఖరా నేషన్ అనే తెగ వారు ఓడ నిధిపై దావా వేశారు. స్పానిష్ వారి పూర్వీకులను విలువైన లోహాలను తవ్వమని బలవంతం చేశారని గిరిజన దేశం అంటోంది. 

మునిగిపోయిన ఓడలోని వెలకట్టలేని నిధిని తమ పూర్వీకులు తవ్వించారని, అందుకే దానిపై తమకే హక్కు ఉందని వాదిస్తున్నారు. అదే సమయంలో, అమెరికన్ కంపెనీ గ్లోకా మోరా కూడా నిధిని క్లెయిమ్ చేసింది. 1981లో దాన్ని కనుగొన్నామని, ఆ తర్వాత ఓడ ఎక్కడ మునిగిపోయిందో కొలంబియా ప్రభుత్వానికి చెప్పినట్టు  అమెరికా కంపెనీ చెబుతోంది. కొలంబియా ఓడ నిధిలో సగం విలువ చెల్లిస్తానని హామీ ఇచ్చిందని కంపెనీ ఆరోపించింది. మొత్తం మీద చూస్తే నిధి కారణంగా దేశాల మధ్య గొడవలు మొదలైనాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!