బసమ్మ దోసెలు…బాబు బజ్జీలు సూపరో సూపర్ !!

Sharing is Caring...

రాయలసీమ రుచులు!!
పొద్దున్నే బసమ్మ దోసెలు… సాయంత్రం బాబు బజ్జీలు…
అనంతపూర్ జిల్లాలో అన్ని విధాలుగా వెనుకబడిన మండలం ఎల్లనూర్…
కానీ అక్కడ దొరికే దోసెలు, బజ్జీలు మరెక్కడా దొరకవంటే అతిశయోక్తి కాదు.

చిన్నప్పటి నుండీ తింటున్నా ఈ రోజుకీ విసుగు చెందక అవురావురుమని ఆరగిస్తూనే ఉంటారు మా ప్రాంత ప్రజలందరూ…
మాములుగా మావూరు లాంటి పల్లె ప్రజల మనస్తత్వం తెలిసినోన్ని కాబట్టి చెబుతాండా… మా ఊర్లల్లో వాళ్ళు వేరే టౌన్ లకి పోతే కనీసం హోటల్ మొగం గూడా చూడరు ఎవరో కొంత మంది తప్పా.. (1.ఎందుకంటే ఆ హోటళ్లలో ఏమన్నా అన్య పదార్థాలు కలిపింటారు అనే అభిప్రాయo 2.కరువు మూలంగా సంపాదించింది ఆటికాటికే సరిపోతుంది కాబట్టి)

పై వివరణ కేవలం ఎల్లనూర్ మండలం మినహాయించి మాత్రమే కానీ మా యేళ్ళనుర్కు పోతే మాత్రం పొద్దున్నే అయితే బసమ్మ హోటల్లో దోసెల రుచి చూడాల్సిందే.బసమ్మ హోటల్ నేను పుట్టిబుద్దెరిగిన కాడి నుండి చూస్తుండా. పురాతన పద్దతిలో అనగా రాత్రే దోసెపిండి రుబ్బి ఒక పెద్ద కుమ్మర కాగు నిండా పిండి తయారు చేసుకుంటారు..
పొద్దున్నే ఒక పెద్ద కుమ్మర కాగు నిండా దోసెపిండి పోసి, కట్టెల పొయ్యిమింద పురాతన దోశె పెనములో ఒక్కసారిగా పొసే దోశె పిండి పెనం నిండా పొర్లి సుర్రుమనే శబ్దం మా చెవులకు ఎప్పుడూ వినసొంపుగానే ఉంటుంది.. ఎందుకంటే ఆ వేసే దోశె మాదనే భావన మమ్మల్ని AR రెహ్మాన్ సంగీతం లోకి నెట్టేస్తుంది.

ఆ వెంటనే గనక మా చేతుల్లోకి దోశె వచ్చిందంటే మా ఆనందం అవధులు దాటి గగ్నం డాన్స్ వెయిస్తుంది. అలా జరగకపోతే( ఎక్కువ సార్లు జరగదు, ఎందుకంటే అక్కడ అంత మంది కాచుకుని కుచ్చోంటారు) టి టి టి టీయూ… అంటూ విషాద సంగీతమే.
ఎందుకంత గొప్ప అంటే దోశె నూనె లేదా నెయ్యుతో చేస్తారు, బాగా ఎర్రగా కాల్చిన దోసెలోకి పప్పులు చెనిగితనాలతో, పచ్చమేరపకాయలు వేసి మాంచి కారం దట్టించిన ఒక కూరా, ఒక బియ్యప్పిండి, ఎర్రగడ్డలుతో తయారు చేసిన మరొక సాగు, అది, యిది కొంత కొంత దోశె మధ్యలో వేసి ఇస్తారు. ఆ దోసెలో కొంత బాగం చుంచి దానితో వేడి వేడిగా ఉన్న దోశెలో వేసిన ఆ రెండు కూరలను సమానంగా దోశె మొత్తానికి పూసుకొని తింటే ఆ ఆనందమే వేరు. మధ్యలో కొంత బాగా కాలిఉన్న భాగంలో నూనె ఎక్కువగా పడివుండడం వల్ల దాన్ని లాస్ట్లో తింటే ఆ కిక్కే వేరప్పా!!
యిన్గా వాళ్ళు చేసే దోశె ఒక్క మాటలో చెప్పాలంటే నేను రాస్తున్నప్పుడు రాత మీద ధ్యాసపోగొట్టి కొద్దిసేపు ఆ రుచిని గుర్తుకు తెచ్చి నోట్లో నీళ్లు ఊరేటట్లు ఉంటుంది.
బాబు బజ్జీలు::
అలుపెరగక శ్రమిస్తారనడానికి నిదర్శనం బజ్జీలు బాబూ అన్న దంపతులు…వాళ్ళ దగ్గర లభించని స్నాక్ ఐటమ్ వుండదు.
మాకు పిల్లప్పటి నుండి బెంగుళూర్ అయ్యంగార్ బేకరీ, స్నాక్ ఐటమ్ లు, తమిళనాడొల్ల మిక్సర్, చిప్స్ తెలివు అనంతపురం పొయ్యేవరకు, తెలిసిందల్లా బాబు భజ్జిలు మాత్రమే, బాబు మిక్సర్ మాత్రమే.నేను తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో చాలా చోట్ల భజ్జిలు తిన్నా కానీ వాటిలో బాబు బజ్జిల మెరపకాయల తొటాలకు కూడా సాటి రావు.

ఎందుకు ఆ విశిష్టత అంటే
1.ఎక్కడన్నా బజ్జీలు సైజ్ రెండు చేతి వెళ్లంత ఉంటే గొప్ప..కానీ మా బాబు అన్న బజ్జి పిడికడంత ఉంటుంది
2.ఎక్కడన్నా నూనెలోంచి వేడి చేసి తీసిన బజ్జి చల్లారిన కొద్దీ సేపటికి బజ్జి పిడికెడుతో పిండితే వేళ్ళ సంధుల్లో నూనె కారడం కచ్చితంగా గమనించొచ్చు(కొన్ని సందర్భాల్లో మన యింట్లో చేసేవాటిలో కూడా), కానీ మా బాబు అన్న బజ్జిలను పిండితే ఒక్క చుక్క నూనె కూడా రాదు నాది గారెంటి.
3. బయట, పెద్ద పెద్ద హోటళ్లలో కూడా వాడిన నూనె వాడుతంటారు కానీ బాబు అన్న ఫ్రెష్ గా ఉన్న నూనె వాడుతారు..
4. మద్యనమో సాయంత్రమో బజ్జిలకు పోతే చిన్న పేపర్లో బోరుగులు, కారాయలతో పాటు 3 బజ్జీలు, వాటిపై పొడి చల్లి ఇచ్చినాడంటే మండలానికి ఏదో ఒక పని మీద వచ్చిన మా పల్లెలోల్ల ఆకలి 10 రూపాయల్లోనే మటుమాయం అంటే అర్థం చేసుకోండి.
ఈ విదంగా మా రోజును బసమ్మ హోటల్ దోసెతో ప్రారంభించి, బాబు బజ్జిలతో ముగిస్తాము…
మా ఎల్లనూర్ వస్తే మీరు తప్పక ప్రయత్నించండి.

——– మైత్రేయ మురళీకృష్ణ 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!