మోసపోతున్న బ్యాంకులు !

Sharing is Caring...

Financial crimes…………….. అవును.బ్యాంకులు పదే పదే మోసపోతున్నాయి. ఆర్ధిక నేరస్తులు బ్యాంకులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. వారిని ఏమీ చేయలేక బ్యాంకులు చోద్యం చూస్తున్నాయి. సామాన్యులనైతే వేధించే బ్యాంకులు పెద్ద విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక నేరాలు రికార్డులను బద్దలు గొట్టాయని బీజేపీ నేతలు ఎద్దేవా చేసేవారు..కానీ వారే తమ హయాంలో బ్యాంకు మోసాల ఉధృతికి అడ్డుకట్ట వేయలేక పోయారు. బ్యాంకు స్కామ్ లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పాలకులు చేసిన వాగ్దానం నీటిమీద రాతలా మారింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు (నీరవ్ మోడీ), గీతాంజలి గ్రూప్ (మెహుల్ చోక్సీ), ఐడిబిఐ (ఎయిర్ సెల్ మాజీ ప్రొమోటర్ సి శివశంకరన్), పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ (పిఎంసి) బ్యాంకుల కుంభకోణాలు, అంతకు ముందు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా వంటి ఘరానా మోసగాళ్ల ఉదంతాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

ఈ అనుభవాలతో అయినా బ్యాంకులు జాగ్రత్త పడలేదు. బ్యాంకులు మోసపోతూనే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాలను తన నివేదికల్లో ప్రస్తావించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో మోసాలు 74 శాతం పెరిగాయని వెల్లడించింది. 2018-19 ఏడాదిలో కొందరు రూ.71,543 కోట్ల మేర బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.41,167 కోట్ల మేర పంగనామాలు పెట్టారు. వినియోగదారుల మోసాలను బ్యాంకులు సకాలంలో గుర్తించలేకపోతున్నాయి. అత్యధిక మార్కెట్‌ వాటా కలిగి ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా ఈ మోసాలకు గురైనాయి. తర్వాతి స్థానంలో ప్రైవేటు, విదేశీ బ్యాంకులు ఉన్నాయి. అయితే, అన్ని రకాల బ్యాంకు మోసాల్లో రుణాలకు సంబంధించిన ఎగవేతలే ఎక్కువగా ఉండడం గమనించదగిన అంశం.

కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, నగదు జమలకు సంబంధించిన మోసాలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 0.3శాతం మాత్రమే ఉన్నాయి. ఆ ఏడాదిలో ఫోర్జరీ, మోసానికి సంబంధించి 72 భారీ కేసులు నమోదయ్యాయి. రూ.లక్ష కన్నా తక్కువ విలువైన బ్యాంకు మోసాలు 0.1 శాతం ఉన్నాయి. కాగా ఆతర్వాత మళ్ళీ పెరిగాయి.ఇక 2021 ఆర్థిక సంవత్సరంలో1.38 ట్రిలియన్ల మేరకు మోసాలు జరిగాయని .. 2020 లో 1.85 ట్రిలియన్ రూపాయల మేరకు జరిగాయని ఆర్బీఐ చెబుతోంది.

మొత్తం మీద దేశంలో బ్యాంకు మోసాలు జరుగుతున్నాయని ఆర్‌బిఐ అంగీకరిస్తోంది.నివేదిక చూస్తే ఆర్థిక రంగానికి మంచి రోజులు వస్తాయా అన్న సందేహం కలగక మానదు. సీబీఐ ఇటీవల కొంతమంది రుణ ఎగవేత దారులపై కేసులు నమోదు చేసింది. ఇవన్నీ విచారించి సొమ్మును వెనక్కి తీసుకోవడానికి లేదా ఎగవేత దారులకు శిక్షలు వేయడానికి చాలాకాలమే పట్టవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!