ఇద్దరూ ఇద్దరే .. వాళ్ళ ఇగోలకు ప్రజలు బలైపోతున్నారు. ఎవరూ తగ్గేదిలేదు అంటున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. అటు పుతిన్ ఇటు జెలెన్‌స్కీ. చర్చలు విఫలమైన నేపథ్యంలో యుద్ధం మరికొన్నిరోజులు సాగేలా కనబడుతోంది. ఇవాళ కూడా రష్యా సేనలు దాడులు కొనసాగించాయి. ఒక్కో నగరాన్ని భూస్థాపితం చేస్తున్నాయి.
ఉక్రెయిన్ లోని మరో కీలక నగరమైన ఖార్కివ్ పై రష్యా సైనికులు బాంబులతో దాడి చేశారు. రాజధాని నగరం కీవ్ ను కూడా ఇవాళో రేపో రష్యా సైనికులు నేలమట్టం చేయవచ్చు అంటున్నారు. అక్కడక్కడ ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్న కారణంగా అనుకున్న టైములో కీవ్ ను స్వాధీనం చేసుకోలేకపోయారు.
మరోవైపు ఆర్ధిక ఆంక్షల కారణంగా ఆర్ధిక మూలాలు దెబ్బ తినే పరిస్థితి నెలకొనడంతో పుతిన్ తీవ్రమైన అసహనానికి గురవుతున్నారు. సాధారణంగా ఎంతో ఓర్పు, సహనంతో తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే పుతిన్ అధికారులపై పదేపదే మండి పడుతున్నారని వార్తలు ప్రచారంలో కొచ్చాయి. దాడులు మొదలు పెట్టి ఆరు రోజులు అవుతున్నా పురోగతి తక్కువే .. రష్యా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోలేకపోయింది.
జెలెన్‌స్కీ ఇసుమంతైనా భయపడటం లేదు. రెండు మూడు రోజులలో అందరూ లొంగిపోతారని పుతిన్ భావించగా ..అలా జరగలేదు. లక్షల కొద్ది సైన్యాన్ని మోహరింపజేసినా రోజులు గడుస్తున్నాయి. మరో పక్క విమర్శలు పెరుగుతున్నాయి. ఆంక్షలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా జెలెన్‌స్కీ తోక జాడిస్తున్న వైనం పుతిన్ కి అసలు మింగుడు పడటం లేదని అంటున్నారు.
ఎంత భయపెట్టినా జెలెన్‌స్కీ నాటోలో చేరబోమని లిఖిత పూర్వక హామీ ఇవ్వడానికి సుముఖం గా లేరు. ఈ క్రమంలో యుద్ధం మరికొన్ని రోజులు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యలో ఆపితే పరువు పోతుందని భయం. ఇక జెలెన్‌స్కీకూడా రష్యాపై పోరాటంలో పాల్గొనేందుకు తమ దేశంలోని యుద్ధ అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేస్తానని ప్రకటించారు.
ఇతర దేశాలనుంచి ఆయుధాలను సేకరించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇరు దేశాధినేతలు ఎవరికి వారు యుద్ధ ప్రణాళికలు రూపొందించుకుంటూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. అసలు ఈ యుద్ధానికి ముగింపు ఎపుడు అనే విషయానికొస్తే ఉక్రెయిన్ లోని అన్ని నగరాలను స్వాధీన పరుచుకుని రష్యా జెండాలు ఎగుర వేశాక తాత్కాలికంగా యుద్ధానికి తెర పడవచ్చు అంటున్నారు.
అప్పటి వరకు దాడులు జరుగుతూనే ఉంటాయి. అమెరికా కానీ మరొకరు కానీ రష్యాను ఎదుర్కొనే సాహసం చేయరు. అందుకే పుతిన్ ముందస్తు హెచ్చరిక చేసాడు అంటున్నారు. ఈ మొత్తం పరిణామాల్లో ఉక్రెయిన్ తో పాటు రష్యా కూడా భారీగా నష్టపోవడం అనివార్యం. యుద్ధం పూర్తి అయ్యాక కానీ ఎవరికెంత నష్టమో తేలదు.