ANANTHAPUR CLOCK TOWER STORY …………….
అనంతపురం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది క్లాక్ టవర్. అనంతపురం నగరంలో ఇప్పడది ఒక చారిత్రిక ప్రదేశంగా నిలిచిపోయింది. ఈ క్లాక్ టవర్ నిర్మాణం 74 ఏళ్ళ క్రితం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరో అమరవీరుల జ్ఞాపకార్ధం గా ఈ టవర్ ను నిర్మించారు.
స్వాతంత్ర్యోద్యమ స్మారక చిహ్నమే ఈ గడియార స్థంభం. బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తుల బానిసత్వం నుంచి భారతీయులు విముక్తి పొందిన రోజున ఈ గడియార స్థంభ నిర్మాణాన్ని ప్రారంభించారు.నాలుగు ముఖాలు, అష్ట భుజాలతో 47 అడుగుల ఎత్తు ,15 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. 15 అడుగుల వెడల్పు 15వ తేదిని, అష్ట భుజాలు 8వ నెలను, 47 అడుగుల ఎత్తు 1947వ సంవత్సరాన్ని స్పుర్తించేలా దీన్ని నిర్మించడం విశేషం.
1945 లోనే జిల్లాల్లోని ప్రజలు దాదాపు రూ.30 వేలు విరాళాలు వసూలు చేసారు. అప్పట్లోనే టవర్ నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించకపోతే ఇబ్బంది పడాల్సిఉంటుందని ఆగిపోయారు. 1947లో స్వాతంత్య్రం రావడం తో మళ్ళీ అందరూ సమావేశమై టవర్ నిర్మించాలని తీర్మానించారు.
వసూలు చేసిన నిధులతోనే ఈ క్లాక్ టవర్ ను నిర్మించారు.అప్పటి జిల్లా కలెక్టర్ రాజనాల కోటేశ్వరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైనది. టవర్ క్లాక్ కు రెండు శిలా ఫలకాలను ఏర్పాటు చేశారు. ఒక దాంట్లొ ప్రారంభోత్సవ వివరాలు , మరో శిలాఫలకం పై విరాళం అందజేసిన వారి పేర్లున్నాయి.
1945 లో అప్పటి జిల్లా జడ్జి ఎం. రామచంద్ర నాయుడు నాయకత్వంలో… జ్వాలనయ్య. మేడా సుబ్బయ్య , మేడా రామయ్య,రాళ్ళపల్లి లక్ష్మీకాంతం, కల్లూరి సుబ్బారావు, పప్పూరి రామాచార్యులు,నర్సింహులు శెట్టి, తదితరులు ముందుకొచ్చిఈ నిర్మాణానికి నడుం బిగించారు. 1948 లో ఈ టవర్ నిర్మాణాన్ని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కూడా సందర్శించారు.
నిర్మాణ పనులను చూసి అభినందించారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నెహ్రు అనంత పట్టణంలోకి రాగా అక్కడ నుంచి రెండు బుల్లెట్ వాహనాలపై ఇద్దరు స్థానికులు ఎస్కార్ట్ గా ఉంటూ నెహ్రు కాన్వాయ్ ను టవర్ దగ్గరికి తీసుకొచ్చారు.
ఆ ఇద్దరిలో ఒకరు జ్వాలనయ్య. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎస్కార్ట్ గా వస్తే జ్వాలనయ్య కు నెహ్రు తో కరచాలనం ఇప్పిస్తానని చెప్పారట. అయితే నెహ్రు టవర్ ను చూసి నేరుగా పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్స్ కు వెళ్లారు. అక్కడ బహిరంగసభలో పాల్గొన్నారు. పార్టీ ప్రెసిడెంట్ కి హామీ ఇచ్చినట్టు తాను కరచాలనం ఇవ్వాల్సిన వ్యక్తుల కోసం నెహ్రు వాకబు చేశారట.
జ్వాలనయ్య అలిగి దూరంగా ఉండటం తో ఆయనను తీసుకొచ్చి నెహ్రు తో షేక్ హ్యాండ్ ఇప్పించారట. ఇక ఈ క్లాక్ టవర్ అన్ని హంగులతో 1953 లో ప్రారంభమైంది. ఈ తరహా క్లాక్ టవర్స్ దేశం మొత్తం మీద రెండే ఉన్నాయి. ఒకటి అనంత లోది కాగా రెండోది మద్రాసులోని మైలాపూర్ లో ఉన్నది. తర్వాత కాలంలో టవర్ కి మరిన్ని మెరుగులు దిద్దారు.
—————KNM