అల్లు స్టయిలే వేరు కదా !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala……………

హాస్య కళాకారుడిగా అల్లు స్టయిలే వేరు.. ఆయనను ఎవరూ అనుకరించలేరు. ఆయన పూర్తిపేరు అల్లు రామలింగయ్య.ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు.చూసింది చూసినట్టు అనుకరించడం రామలింగయ్య ప్రత్యేకత.

ఇలా చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తూ నవ్విస్తూ ఉండేవాడు. అలా ఓ సెలబ్రిటీ అయిపోయాడు.ఓ సారి వాళ్ల ఊళ్లో ‘భక్త ప్రహ్లాద’ నాటకం చూశాడు.బృహస్పతి గా చేస్తున్న కుర్రాడు బాగా చేయడం లేదనిపించింది వెంటనే నాటకాల కాంట్రాక్టర్ని కలిసాడు.కాంట్రాక్టరుకు మూడురూపాయలు ఎదురిచ్చి ఆ వేషం తనేసిన తపన ఉన్న కళాకారుడు  అల్లు రామలింగయ్య.

అల్లు రామలింగయ్య నాటకాలు చూసిన గరికపాటి రాజారావు సినిమాల్లోకి వస్తావా అని అడిగారు. సరే అన్నారు అల్లు.అలా ‘పుట్టిల్లు’తో తెరంగేట్రం చేశారు. అల్లుకు కళలతో పాటు నాటి స్వతంత్ర పోరాటంలో పాల్గోవడం కూడా ఇష్టమే.అలా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. విడుదలైన తర్వాత చాలా కాలానికి సినిమాల్లోకి ప్రవేశించారు.

‘పుట్టిల్లు’ తర్వాత హెచ్.ఎమ్.రెడ్డి గారి ‘వద్దంటే డబ్బు’లో నటించారు.’పుట్టిల్లు’ చిత్రం నిర్మాణకాలంలోనే కుటుంబాన్ని మద్రాసుకు మార్చారు. కుటుంబ పోషణకు చాలా కష్టాలు పడ్డాడు. నెమ్మదిగా వేషాలు పెరిగాయి.’అప్పు చేసి పప్పుకూడు’, ‘మాయాబజార్’, ‘దొంగరాముడు’, ‘మూగమనసులు’ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు వచ్చాయి.

నటుడుగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.మొదట్లో కామెడీ వేషాలే చేసినా… నెమ్మదిగా కామెడీ విలనీ కూడా చేయడం ప్రారంభించారు. ఓ టైమ్ లో విలన్ వెనకాల ఉండే ఓ తరహా గుంటనక్క లాంటి పాత్రలో అల్లు రామలింగయ్య ఎక్కువగా కనిపించేవారు. రెగ్యులర్ గా చేసే ఆ పాత్రలోనే తనదైన మార్క్ నటనతో గుర్తింపు తెచ్చుకునేవారు.

అదే తరహా పాత్రలు ఆయన చివరి దశలోనూ చేశారు. ఓ దశ లో… ప్రతి సినిమాలోనూ అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, రావుగోపాలరావులు సమిష్టి విలనీ చేసేవారు. రాఘవేందరరావు గారి ధోరణి అది. అల్లు రామలింగయ్య లో ఉన్న నటుడ్ని అద్భుతంగా వాడుకున్న దర్శకుల్లో విశ్వనాథ్ ఒకరు. ఆయన తీసిన చాలా సినిమాల్లో అల్లు డెఫినెట్ గా ఉండేవారు.

పైగా ఓ ప్రత్యేక పాత్రలో అల్లును ప్రవేశపెట్టేవారు విశ్వనాథ్. అలా చేసిన చిత్రాలే… ‘శంకరాభరణం’, ‘సప్తపది’. రెండు చిత్రాల్లోనూ విచిత్రంగా జె.వి.సోమయాజులు స్నేహితుడుగానే నటించారు అల్లు. శంకరాభరణంలో శంకరశాస్త్రి స్నేహితుడుగా అల్లు నటన చాలా హృద్యంగా ఉంటుంది.

అల్లు రామలింగయ్య మాత్రమే చేయగల పాత్ర ‘యమగోల’ లో చిత్రగుప్తుడి పాత్ర..అటు యమలోకంలో కేసుల లిస్టు చదివే సీన్స్ లోనూ అలాగే భూలోకంలోకి వచ్చిన తర్వాత యముడి ముందు లౌక్యం ప్రదర్శించే సీన్స్ లోనూ అల్లు రామలింగయ్య నటన నభూతో అన్న రేంజ్ లో సాగుతుంది.
ఆ తర్వాత చాలా మంది ట్రై చేశారుగానీ…అల్లు సమీపంలోకి రాలేకపోయారు.

అల్లు నటించిన వెయ్యికి పైగా సినిమాల్లో పోషించిన పాత్రలన్నీ ఒకెత్తు…’ముత్యాలముగ్గు’లో చేసింది ఒక్కటే ఒకెత్తు. బాపు గారి సిన్మా ల్లో అల్లుకు స్పెషల్ చెయిర్ ఉండేది కదా! 

అలా ‘ముత్యాలముగ్గు’ లో ఎస్టేట్ మేనేజర్ గా పరమ దగుల్బాజీ పాత్రలో జీవించిన అల్లు రామలింగయ్య నటుడుగా మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నారు. కోతి కరిచిన తర్వాత సీన్స్ లో అల్లు నటన అసాధారణం. ఆ సీన్స్ చిత్రీకరణలో ఉన్నపుడు కొడుకు చనిపోయాడని కబురొచ్చినా…కంప్లీట్ చేసే వెళ్లారాయన. అంతటి అంకితభావం ఆయనది.

అల్లు రామలింగయ్య లో చిన్నతనం నుంచి ఓ మిమిక్రీ కళాకారుడు ఉన్నాడు. ఈ కళను ఆయన చాలా పదిలంగా కాపాడుకుంటూనే వచ్చారు. మిమిక్రీలో జిబ్రిష్ ఒక భాగం.అంటే…తమిళం మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ అందులో ఒక్క తమిళ ముక్క ఉండదు. అలాగే హిందీనో…ఇంగ్లీషో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. కానీ అందులో ఆ భాషలకు సంబంధించిన విషయం ఏమీ ఉండదు.

అల్లు వారిలో ఈ కళ ఉందనే విషయం చాలా మందికి చాలా తర్వాత తెల్సిందిగానీ…దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి చాలా కాలం క్రితమే తెల్సు. క్రాంతికుమార్ బ్యానర్ లో తను తీసిన ‘కల్పన’లో ఓ సన్నివేశం కోసం అల్లు రామలింగయ్యతో మొదటి సారి జీబ్రిష్ మాట్లాడించారు.

మళ్లీ జంధ్యాల తన ‘రెండు జళ్ల సీత’ కోసం మరోసారి జీబ్రిష్ మాట్లాడించారు. ఇందులో అల్లు రామలింగయ్య హిందీలా భ్రమింపచేస్తూ మాట్లాడతారు. దీనికో కనెక్టింగ్ డైలాగు కూడా రాశారు జంధ్యాల. మా బావ హిందీ తట్టుకోలేక…ముంబై జనాలందరూ చందాలేసుకుని మరీ ఇక్కడికి తోలేశారని అల్లు బావమరిది కారక్టర్ తో చెప్పిస్తారు.

సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు రామలింగయ్య. ఓ దశ లో నాన్నను మీ సిన్మా ల్లో పెట్టకండి. ..ఆయన కాదు అనడు కానీ ఆ వయసులో ఆయన నటించడం ద్వారా స్ట్రెయిన్ అవుతారు అనే నా బాధ. అని అల్లు అరవింద్ కొందరు దర్శకులను బతిమలాడారు కూడా.

ఈ విషయం ఎవరి ద్వారా నో రామలింగయ్య గారికి చేరింది.నన్ను అప్రోచ్ అవద్దు అని నా డైరెక్టర్లకు చెప్పడానికి నువ్వు ఎవర్రా అని కోప్పడ్డారట.అంతటితో ఆగక  ‘నా బొచ్చె లో రాయి వేయడానికి నీకేం హక్కు ఉంది?’ అని నిలదీసారట.

అలా 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక మాత్రం తీరకుండానే వెళ్లిపోయారు. రేలంగి తరువాత ‘ పద్మశ్రీ’ అందుకున్న హాస్యనటుడుగా చరిత్ర సృష్టించారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!