Ramana Kontikarla…………………….
బస్ కండక్టరైన శివాజీరావ్ గైక్వాడ్… తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గా ఎదిగితే అదో స్టోరీ.ఏ స్టోరీ లో పాత్ర అయినా అందులో ఒదిగిపోయే ఓ మళయాళ సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్.. నటనా రంగం నుంచి విరమణ తర్వాత ఓ క్యాబ్ డ్రైవర్ గా మారతానంటే అదొక భిన్నమైన స్టోరీ అవుతుంది.
నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ విలక్షణమైనవాడని నిరూపించుకున్నాడు ఫహాద్ ఫాజిల్. బహుశా వ్యక్తిత్వంలో అలాంటి విలక్షణత ఉండేవాళ్లే అలాంటి వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అవుతారేమో బహుశా!ఫహాద్ ఫాజిలో తన పదవీ విరమణనంతరం.. అంటే యాక్టింగ్ నుంచి విరామం తీసుకున్ననంతరం.. ఏకంగా క్యాబ్ డ్రైవర్ గా మారాలనుందని ప్రకటించేశాడు.
చాలామంది నటులు మంచి జోష్ లో ఉన్నప్పుడు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తీరులో నటిస్తూ ఉంటారు. కానీ, ఫహాద్ ఫాజిల్ మాత్రం అందుకు భిన్నం.. ఎంత త్వరత్వరగా తాను రిటైర్డ్ అయిపోతానా.. స్పెయిన్ లోని బార్సిలోనా లో రైడ్ షేర్ డ్రైవర్ గా మారిపోతానా అని వెయిట్ చేస్తున్నాడట.. ఈ విషయాన్ని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా వెబ్ పోర్టల్ తో పంచుకున్నాడు.
ప్రజలు తన నటనపై, సినిమాలపై మోజు చూపినంత కాలం మాత్రమే తాను ఫీల్డ్ లో ఉంటానని.. ఆ తర్వాత ఆట ముగిస్తానని హాయిగా బార్సిలోనా వెళ్లిపోతానంటున్నాడు ఈ నటుడు. నిజంగా అదే స్టాండ్ పైనుంటారా అన్న ప్రశ్నకు.. ఖచ్చితంగా అంటున్నారు. ఎందుకంటే, అక్కడ ప్రజారవాణా ఎంతో హాయిగా, ఫ్రెండ్లీగా కనిపించిందంటారు.
తనకు వ్యక్తిగత మనశ్శాంతి అవసరమైనప్పుడు కూడా సినిమా షోస్ చూడటం, ఏదైనా ఆటలవైపు మొగ్గడంతో పాటు.. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమంటున్నాడు ఈ నటుడు. దానివల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది అనేది ఫహాద్ ఫాజిల్ అభిప్రాయం.
ఫహాద్ ఏదో యాదృచ్ఛికంగా బార్సిలోనా కు వెళ్లి వచ్చాడు కాబట్టి.. తన మనసు అటువైపు లాగి, ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చాడనుకోలేం. ఎందుకంటే, ఫహాద్ 2020లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికతో స్పెయిన్ లో క్యాబ్ డ్రైవర్ అవుతానని చెప్పిన సందర్భాలున్నాయి.
జనాలను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తూ.. కొత్త ప్రదేశాలనూ చూస్తూ ఓ క్యాబ్ డ్రైవర్ గా పొందే అనుభూతిని ఆస్వాదించే ఒక భావన ఫహాద్ ఫాజిల్ మాటల్లో కనిపిస్తోంది. తన భార్య, నటి నజ్రియా నజీమ్ తో కూడా ఇదే విషయాన్ని పంచుకుంటే.. తానూ అందుకు సుముఖంగా తలూపింది అంటారు ఈ నటుడు.
వింటేజ్ ఫోన్ వాడుతూ వార్తల్లోకి!
జ్ఞానం వచ్చిన పిల్లవాడి నుంచి వృద్ధుల వరకూ కూడా మొబైల్ ఫోన్ లేందే రోజు గడపని రోజుల్లో.. వింటేజ్ ఫోన్ వాడుతూ కూడా ఈ మధ్య ఫహాద్ ఫాజిల్ వార్తల్లోకెక్కాడు. తాను వాడుతున్న ఫోన్ ను ఒక్కమాటలో డంబ్ ఫోన్ అని కూడా పిలుస్తారు. పూర్తిగా మొబైల్ వాడకానికి దూరంగా లేకపోయినా.. వీలైనంతమేరకు దానికి దూరంగా ఉండాలనే ప్రాక్టీస్ చేస్తున్నారు ఫహాజ్ ఫాజిల్ .
ల్యాప్ టాప్, ట్యాబ్లెట్స్ ద్వారా సమాచారాన్ని పొందే వీలున్నందున.. ఎక్కువ ఈమెయిల్ ద్వారా టచ్ లోకి వెళ్లడం తనకిష్టమంటాడు. ఆన్లైన్ లో ఉండి పరధ్యానంలోకి వెళ్లడాన్ని సహించలేనని.. అందుకే వీలైనంత ఎక్కువ మొబైల్ కు దూరమంటున్నాడు. అలా అని టెక్నాలజీని తానేం తప్పుబట్టడంలేదంటాడు ఈ నటుడు. తన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం, రాత్రి వేళల్లో హాయిగా నిద్రపోవడం వంటివన్నీ మొబైల్ కు వీలైనంత దూరంగా ఉండటం వల్ల సాధ్యం చేసుకుంటున్నా అంటారు ఫహాద్ ఫాజిల్.
ఫహాద్ దగ్గర ఉన్న ఆ వింటేజ్ ఫోన్ ఏంటి మరి..?
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎఫిన్ ఎం ముందుగా ఫహాద్ ఫాజిల్ ఫోన్ గుర్తించాడు. వెర్టు అసెంట్ టి అనే వింటేజ్ ఫోన్ ను ఫహాద్ వాడుతున్నట్టు తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారానే ఫహాద్ ఫాజిల్ వింటేజ్ ఫోన్ కథ చర్చనీయాంశమైంది. ఈ ఫోన్ 2008లో మార్కెట్ లోకి వచ్చిన ఓ ప్రీమియం ఫోన్.
టైటానియం, చేతితో కుట్టిన తోలుకవర్, సాఫైర్ క్రిస్టల్ వంటి కాంపోనెంట్స్ తో తయారుచేయబడిన ఈ వింటేజ్ ఫోన్ నాడే 5 లక్షల 54 వేల రూపాయలట. అయితే, ఈ ప్రోడక్ట్ తయారీ ఇప్పుడు ఆగిపోయినప్పటికీ.. ఆన్ లైన్ లో ఇంకా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత ధరలు 1 లక్ష నుంచి 1 లక్షా యాభైవేల వరకూ పలుకుతున్నాయి.
ఫహాద్ సినిమాలు బౌగెన్ విల్లా, వెట్టయన్, పుష్ప 2 ది రూల్ వంటి సినిమాలు సంచలనాలు సృష్టించగా.. తాజాగా వడివేలుతో కలిసి నటించిన చిత్రం మారీసన్ జూల్ 25న విడుదలైంది. ఇంకా భవిష్యత్తులో తన చేతుల్లో మళయాళ సినిమాలు వరుసగా ఉన్నాయి.
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే తెలుగు సినిమాలోనూ ఫహాద్ నటించబోతున్నాడు. ఈ నేపథ్యంలో.. ఫహాద్ పదవీ విరమణ జరిగి.. తను బార్సిలోనాలో క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ అయ్యే వరకూ ఇలాంటి క్యూరియాసిటినీ ఆ విలక్షణ నటుడు క్రియేట్ చేస్తూనే ఉంటాడు..

