ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వేల సంఖ్యలో దేశం వీడి వెళ్లేందుకు పొరుగు దేశాల సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈనెల ఆరున ఒక ఉపగ్రహం తీసిన చిత్రం ద్వారా ఈ విషయం బయట పడింది. అఫ్ఘాన్-పాక్ సరిహద్దు(చమన్ బార్డర్, టోర్ఖమ్)ల వద్ద వేల మంది అఫ్ఘాన్లు ఆ దేశం లోకి ప్రవేశించేందుకు గుమికూడి ఉన్న దృశ్యాలు కనిపించాయి.
అలాగే షేర్‌ఖాన్(అఫ్ఘాన్-తజ్‌కిస్థాన్), ఇస్లాం ఖాలా(అఫ్ఘాన్-ఇరాన్) సరిహద్దుల్లోనూ పెద్ద ఎత్తున ప్రజలు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమూహాల్లో వృద్ధులు.. మహిళలు ..పిల్లలు కూడా ఉన్నారు. మానవతా దృక్పధంతో ఆయా దేశాలు అనుమతిస్తే శరణార్థులుగా అక్కడ బతకాలని వారి తాపత్రయం.
తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సమీప దేశాలకు తరలి వెళ్లారు. అప్పట్లో కొన్నాళ్ళు చూద్దాములే అని ఆగిన ప్రజలు ఇపుడు తిండి తిప్పలులేక ఇబ్బందులు పడుతున్నారు.పనులు లేక.. ఆహరం దొరక్క కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. లక్షల మంది పిల్లలు ఆహారం అందక పస్తులతో నేల రాలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
శీతాకాలం రాకముందే మిలియన్ల మంది ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక పిల్లల విషయానికొస్తే.. తక్షణ అవసరాలు తీర్చకపోతే 10 లక్షలమంది ఆకలితో మరణించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దేశంలో పేదరికం రేటు పెరిగింది.
ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐరాస మానవతా సాయంగా రూ.147 కోట్లు విడుదల చేసింది. ఆఫ్ఘన్ లో సహాయక చర్యలకు ఉపక్రమించబోతోంది.మరో రూ. 4,400 కోట్లను సమకూర్చాలని సభ్యదేశాలకు ఐరాస విజ్ఞప్తి చేసింది.అంతర్జాతీయ దేశాలు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తాలిబన్లతో ఎలా పని చేయాలా అని సభ్య దేశాలు తర్జన భర్జనలు పడుతున్నాయి.
ఫోటో కర్టసీ .. maxar technologies