అమెరికాలో కాలిఫోర్నియాకు తూర్పున ఉన్న బెరేసా సరస్సులో కూడా ప్రస్తుతం ఓ భారీ సుడిగుండమే ఏర్పడింది. దాని పేరే ‘పోర్టల్ టు హెల్. ఇప్పుడు దాన్ని చూడటానికి వేలాదిమంది క్యూ కడుతున్నారు. బెరేసా సరస్సు మీద నిర్మించిన ఓ పురాతన డ్యామ్ వర్షాలకు తరుచూ నిండుతూ ఉండేది.
దీంతో ఎక్కువైన నీటిని అధికారులు వృథాగా విడిచేవారు. రిజర్వాయర్ మధ్యలో సొరంగాన్ని నిర్మించి, డ్యామ్ లో నీటిమట్టం ఎక్కువైనప్పుడు దాని గుండా నీటిని సరఫరా చేయాలని అధికారులు భావించారు. 1950లో సరస్సు మధ్యలో భారీ సొరంగాన్ని నిర్మించారు. అవసరమైనప్పుడు తెరిచి నీటిని పంపించడం, మిగతా సమయాల్లో మూసివేసేలా ఈ నిర్మాణాన్ని చేపట్టారు.
డ్యామ్ నిండటంతో తాజాగా దాన్ని మళ్లీ తెరిచారు.ఈ సొరంగాన్ని తెరచినపుడు అది చూడటానికి సుడిగుండంలా కనిపిస్తుంది. ఈ సొరంగం 72 అడుగుల వెడల్పు, 245 అడుగుల పొడవు ఉంటుంది. సరస్సు లో నీటి మట్టం 15.5 అడుగుల కంటే ఎక్కువగా పెరిగినప్పుడు సెకనుకు దాదాపు 48,000 క్యూబిక్ అడుగుల నీటిని ఈ సొరంగం మింగేస్తుంది.