చూడదగిన సినిమానే !!

Sharing is Caring...

Real Story…………………… 

‘నరివెట్ట’ అంటే తెలుగులో నక్కల వేట అని అర్ధమట. ఇదొక మలయాళ సినిమా టైటిల్. 2003లో కేరళలోని వయనాడ్ లో జరిగిన ఆదివాసీల ఉద్యమం..దాని పరిణామాలు .. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేసిన ఘటనల ఆధారంగా నిర్మించిన సినిమా. సినిమా చూసాకా పోలీసులు ఇలా కూడా చేస్తారా ? అనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ నరివెట్ట చిత్రాన్నిదర్శకుడు అనురాజ్ మనోహర్ ధైర్యంగా తెరకెక్కించారు.ప్రభుత్వం ఇస్తామన్న భూముల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేస్తారు.. కాల్పులు జరుపుతారు. ఆయా సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు.మసాలా సినిమాలు చూసే వారికి ఈ సినిమా నచ్చదు.కథ అంతా అడవిలోనే జరుగుతుంది.

కథ మొత్తం కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన పీటర్ వర్గీస్ (టొవినో థామస్) చుట్టూ తిరుగుతుంది. ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయడానికి అడవికి వెళ్లిన పోలీసు బృందాల్లో పీటర్ వర్గీస్ ఒకరు. అక్కడికి వెళ్లకుండా తప్పించుకోవాలని ట్రై చేస్తాడు.. కానీ కుదరదు. ఈ క్రమంలోనే హెడ్ కానిస్టేబుల్ బషీర్ (సూరజ్ ) పరిచయమవుతాడు. వర్గీస్ కి అన్నివిధాలా అండగా ఉంటాడు. అడవుల్లోకి వెళ్లిన తర్వాత వర్గీస్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు?

మావోయిస్టులను వెతుక్కుంటూ వెళ్లిన సూరజ్ ను డిపార్ట్మెంట్ మనుష్యులే చంపారని తెలిసినపుడు ఎలా స్పందించాడు ? ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని బయటి ప్రపంచానికి ఎలా తెలియజేశాడు అన్నది ప్రధాన కథ. మొదట్లో కాసేపు వర్గీస్ ప్రేమకథ కూడా నడుస్తుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

పెద్ద వాళ్ళను ,చిన్నపిల్లను నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. శవాలను పెద్ద గొయ్యిలో వేసి పూడ్చివేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మొదట్లో ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉన్న వర్గీస్ క్రమంగా వారికి అనుకూలంగా మారి మొత్తం వ్యవస్థనే ఎదిరించి ఓ పెద్ద కుట్రను బయటపెట్టిన తీరును దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించారు.

వర్గీస్ గా టొవినో థామస్ పాత్రలో జీవించేశాడు.సూరజ్ పాత్ర నిడివి తక్కువ. ఉన్నంతలో బాగా చేసాడు. వర్గీస్ ప్రియురాలిగా చిన్నపాత్ర అయినప్పటికీ ప్రియంవద కృష్ణన్ బాగా చేశారు. పోలీస్ అధికారి గా చేసిన చేరన్ కూడా ఆ పాత్రకు బాగా సూట్ అయ్యారు.

విజయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. జేక్స్ బిజోయ్ అందించిన బీజీఎం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్..నరివెట్ట సినిమాను మలయాళ ప్రేక్షకులు ఆదరించారు. బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రూ.30 కోట్ల వరకూ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!