మనసుకు హత్తుకునే మూవీ !

Sharing is Caring...

Subramanyam Dogiparthi ……………………..

చాలా నవలల్ని సినిమాలుగా తీస్తుంటారు.కానీ కొన్ని మాత్రమే మనసును తాకుతాయి.అలా గుండెల్లో నిలిచిపోతాయి. ప్రముఖ రచయిత్రి  రామలక్ష్మి వ్రాసిన రావుడు అనే నవల ఆధారంగా ఈ గోరింటాకు సినిమా తీశారు. ఈ గోరింటాకు సినిమా చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చిన సినిమా డా చక్రవర్తి . ఆ సినిమా ఎలా అయితే ప్రేక్షకుల మనసుల్ని తాకుతుందో ఈ గోరింటాకు సినిమా కూడా అంతే. 

రామలక్ష్మి నవలను సినిమాకు అనుకూలంగా మార్చుకుని అద్భుతమైన డైలాగులను అందించారు దాసరి నారాయణరావు. ఆయనే డైరెక్ట్ చేసారు.ఫైటింగ్ లు, గంతులు,బూతులు వంటి మసాలాలు ఏమీ లేకుండా ప్రేక్షకులను కదలనివ్వకుండా తీసారు దాసరి. నిర్మాత మురారీ కాబట్టి సినిమా పకడ్బందీగా రూపొందింది.సినిమా రూపకల్పనలో మురారీ పాత్ర ఎక్కువగా ఉంటుంది. కథ, పాటలు, ముగింపు అన్ని అంశాలలో ఆయన ప్రమేయం ఉంటుంది. 

సినిమా అంతా విశాఖపట్నం నేపధ్యంలో తీసారు. చలం,రమాప్రభ పాత్రలతో ప్రేక్షకులను శ్రీకాకుళం యాసకు కనెక్ట్ చేసారు . శోభన్ బాబు కెరీర్లో గొప్ప సినిమా. సక్సెస్ అయిందని కాదు. చాలా చాలా బాగా నటించారు. ఎందుకు కొరగాని  తండ్రి తో గొడవపడి పట్టుదలతో చదువుకునే వ్యక్తిగా , బాధ్యత కల మనిషిగా , తనను ఆదరించిన వారిని, ఆరాధించిన వారిని ఎవరినీ అసంతృప్తికి గురిచేయకుండా తానే సతమతమయ్యే పాత్రలో హుందాగా,చక్కగా నటించారు.

ఈ సినిమాలో మనం మరచిపోలేని పాత్ర స్వప్న.ఆ పాత్రలో సుజాత నటించింది. ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా ‘గుప్పెడు మనసు’ . తమిళం , తెలుగు భాషల్లో బాలచందర్ ఒకే సారి తీసారు.ఈ సినిమా 7-9-1979 న రిలీజ్ అయింది. గోరింటాకు సినిమా 12-10-1979 న రిలీజ్ అయింది. సుజాతకు రెండు సినిమాలలోనూ మంచి పేరు వచ్చింది. అనతికాలంలోనే ఆమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.

మరో ప్రధాన పాత్రలో  ‘వక్కలంక పద్మ’ నటించింది.ఈమె నటించిన ఏకైక సినిమా ఇదే. గాయని సరళ కుమార్తె..అంతర్జాతీయ జర్నలిస్టుగా ఉన్నారిప్పుడు. తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.  డైలాగులతో సినిమాలను దట్టించే దాసరి మహానటి సావిత్రి పాత్రకు చాలా తక్కువ డైలాగులు వ్రాసారు.ఆమెకు డైలాగులు ఎందుకు ? ఆమె కళ్ళతో, పెదాలతో మాట్లాడేస్తుంది కదా ! ఈ సినిమాలో దాసరి డైలాగులు తక్కువ గా ఉంటాయి.

ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలు మరో రెండు ఉన్నాయి. అవి చలం,రమాప్రభలు నటించిన పాత్రలు. కధలో కీలకమయినవే. ఇద్దరూ శ్రీకాకుళం యాసలో తినేసారు.ఇతర పాత్రల్లో రమణమూర్తి , ప్రభాకరరెడ్డి , బేబి తులసి , వంకాయల , దేవదాస్ కనకాల , సాక్షి రంగారావు , పి జె శర్మ ప్రభృతులు నటించారు.

ఈ సినిమాకు ప్రాణం పోసిన మరో వ్యక్తి సంగీత దర్శకుడు కె వి మహదేవన్ . పాటలన్నీ హిట్టే . ముఖ్యంగా దేవులపల్లి వారు వ్రాసిన ‘గోరింట పూసింది కొమ్మ లేకుండా’ పాట. సావిత్రి నటన అద్భుతం.. పాటను బాగా చిత్రీకరించారు. మరో గొప్ప పాట ‘కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు’  ఉన్నాయి. సూపర్ హిట్ సాంగ్. వేటూరి పల్లవి రాయగా  చరణాలు ఆత్రేయ రాశారు. పేరు మాత్రం వేటూరిదే ఉంటుంది.

దేవులపల్లి వారిదే మరో పాట ‘ఎలా ఎలా దాచావు అలవికాని అనురాగం’ పాట.బాలు, సుశీలమ్మ చాలా శ్రావ్యంగా పాడారు . శ్రీశ్రీ వ్రాసిన ‘ఇలాగ వచ్చి అలాగ జొచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి’ పాటను వ్రాసారు. ఆత్రేయ వ్రాసిన ‘పాడితే శిలయైనా కరగాలి’ పాట చాలా ఆర్ద్రంగా,హృద్యంగా ఉంటుంది. ఈ పాట వక్కలంక పద్మ పై  చిత్రీకరించారు.ఆమె కూడా బాగా నటించారు. డ్యూయెట్లలో శోభన్-సుజాత,శోభన్-పద్మల  కాంబినేషన్లు చక్కగా ఉంటాయి. డ్యూయెట్ల చిత్రీకరణ కూడా బాగుంటుంది. 

ఈ సినిమా కధ మీద కోర్ట్ కేసులు కూడా నడిచాయి,ఈ కధ నాది అని ముప్పాళ్ళ రంగనాయకమ్మ రామలక్ష్మి, నిర్మాత, దర్శకుడు, పంపిణీ దారులు మీద కేసు వేసింది. తాను వ్రాసిన ‘ఇదేనా న్యాయం’ నవలను కాపీ కొట్టారని అభియోగం మోపారు. కొన్నాళ్ల తర్వాత ఈ వివాదం కోర్టు బయట పరిష్కారమైంది.

యువచిత్ర బేనరుపై ప్రముఖ నిర్మాత మురారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకత్వం అవార్డులను ఫిలింఫేర్ ఇచ్చింది. దాసరి నారాయణరావు దర్శకత్వం లోనే హిందీలో ‘మెహందీ రంగ్ లాయేగీ’ టైటిల్ తో వచ్చింది. జితేంద్ర,రేఖ,అనితారాజ్ నటించారు. బాలీవుడ్ లో కూడా హిట్ అయింది. 

మహిళలు విపరీతంగా మెచ్చిన సినిమా . An unmissable emotional , musical , neat and decent movie . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . మనసుతో మాట్లాడే సినిమా.. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!