Abdul Rajahussain …………………..
పాతతరం పాఠకులలో ‘లల్లాదేవి’ గురించి తెలియని వారుండరు. వారిలో కూడా చాలామంది ‘లల్లాదేవి’ అంటే మహిళా రచయిత అనుకునేవారు. ఈ తరం వారిలో లల్లాదేవి గురించి కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు.
లల్లాదేవి అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు.వారిది గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డపాలెం.. ఆయన నవలలు, కథలు అన్నీ కూడా ‘లల్లాదేవి’ పేరిట ప్రచురితమైనాయి. సాహితీలోకంలో ఈయన అసలు పేరు తెలియని వాళ్ళే ఎక్కువ.
ఎవరీ లల్లాదేవి..? లల్లేశ్వరి కాశ్మీరి శైవ భక్తురాలు, కవయిత్రి….ఈమే …లల్లాదేవి..వాక్స్ అనబడే ఆధ్యాత్మిక కవిత్వ శైలికి ఈమె ఆద్యురాలు..కాశ్మీరీ సాహిత్యంలో లల్లేశ్వరిది … ఓ ప్రత్యేక అధ్యాయం.ఈమెకే అనేక పేర్లున్నాయి.. లల్లేశ్వరి, లల్లాదేవి,లల్లా ఆరిఫా,లాల్ దిద్ది.లాల్ యోగేశ్వరి..లాలీశ్వరి అనే వివిధ పేర్లతో పిలుస్తారు.
ప్రయాగ్ రాజ్ లో లల్లాదేవి దేవాలయం వుంది.భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో ఇదొకటి. ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు..కన్నడంలో కూడా లల్లాదేవి పేరుతో ఓ కవి వున్నాడు…”Aranyadalli Abhimanyu (1991) అనే కన్నడ సినిమాకు రచయితగా కూడా పనిచేశాడు.
పరుచూరి నారాయణా చార్యులు తన కలంపేరు “లల్లాదేవి” అని పెట్టుకోడానికి స్ఫూర్తి బహుశా లల్లేశ్వరి,లల్లాదేవి కావొచ్చు.ఈ రచయిత నూటాయాభైకు పైగా సాంఘిక,చారిత్రక నవలలు,వందకు పైగాకథలు,కొన్ని నాటకాలు కూడా రాశారన్న సంగతి వారి సొంతూర్లోనే చాలామందికి తెలియదంటే ఆశ్చర్యమే.
అంత లోప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు.ఓ చిన్న లూనాలో తిరిగేవారు. ఊర్లో ని ఓగుడిలో దైవ కార్యాలు నిర్వహించేవారు… రచన,దైవచింతన మినహా ఇతర వ్యాపకాలేమీలేవు. చాలామంది పబ్లిషర్లు తక్కువ మొత్తం ఇచ్చి ఆయన రచనలు ప్రచురించి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
నాలుగు అక్షరాలు రాసి తలెగరేస్తున్న కవులు,రచయితలున్న లోకంలో ఇంతగా అక్షరవృష్టి కురిపించి కూడా ఎవరికీ తెలీకుండా అనామకంగా తన పనేదో తను… చేసుకెళ్ళడం వీరికే చెల్లింది..ఏనాడూ ప్రచారం కోరుకోలేదు..పట్టణ వాసమూ ఆశించలేదు.తనకున్నదాంట్లోనే, చెరువు గట్టుకు సమీపంలో వుండే ఆ పాత..చిన్న ఇంట్లోనే నిరాడంబరంగా కాలం గడిపారు.
దాన్నే తన అక్షర క్షేత్రంగా చేసుకున్నారు..వీరికి ఓ కుమారుడు,కుమార్తె వున్నారు. ఆ మధ్య కుమారుడు చనిపోవడంతో మనోవ్యధకు గురయ్యారు.ప్రొస్టేట్ సంబంధిత సమస్యతో బాధపడ్డారు. ఈమధ్య ప్రొస్టేట్ శస్త్ర చికిత్సకూడా జరిగిందట.
ఓ కుగ్రామంలో వుండి అక్కడివారికే తెలీకుండా ఇంతగా అక్షర సేద్యం చేసిన రచయిత తెలుగు సాహిత్యం లో మరొకరు లేరనే చెప్పొచ్చు.చిత్రమేమంటే ఆయన నవలలు, కథలు అచ్చయ్యాయి.పుస్తకాలుగా వచ్చాయి.అయితే వాటి వివరాలుగానీ, కాపీలుగానీ ఆయన దగ్గరలేవు.
తెలుస్తున్న సమాచారం మేరకు 150 కి పైగా నవలలు రాశారు.వాటి వివరాలు పూర్తిగా దొరకడం లేదు. సాహిత్య పరిశోథకుడు, నా మిత్రుడు పారా అశోక్ శోధించి కొన్ని నవలల పేర్ల జాబితా సిద్ధం చేశాడు.
ఇక కథల సంఖ్య ఇతమిద్దంగా తెలీటంలేదు.కానీ కారామేస్టారి ‘కథానిలయం’లో మాత్రం ఈ రచయిత కథలు కొన్ని వున్నాయి.
వివిధ పత్రికల్లో లల్లాదేవి పేర ఎన్నోకథలు ప్రచురితమయ్యాయి…నవలలు , కథలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ లేదు.ఈ రచనలు భారతి, ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతి, జ్యోతి తదితర పత్రికలలో ప్రచురితమైనాయి.
లల్లాదేవి రాసిన ‘శ్వేత నాగు’ నవల తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించింది. వేలాది కాపీలు అమ్ముడయ్యాయి..ఈ నవల సినిమాగా కూడా వచ్చింది.ఆమ్రపాలి, మహామంత్రి తిమ్మరుసు రోషనార, శ్వేత నాగు, నాగ భైరవి, మంత్ర ముగ్ధ, చెంఘిజ్ ఖాన్, అగ్నిశిఖ. అర్ధమానవుడు, కౌగిట్లో కృష్ణమ్మ ధర్మయజ్ఞం తదితర నవలలు బాగా పాపులర్ అయ్యాయి.
ఇలా ఎన్నోచారిత్రక ప్రాధాన్యం కలిగిన…రచనలు బాగా ప్రాచుర్యం పొందాయి..ఇక వైద్య విజ్ఞానం పంచే రచనలు ఎయిడ్స్.., కామసూత్ర కూడా ప్రజాదరణ పొందాయి. ఒకే వస్తువుకు పరిమితం కాకుండా బహుముఖ ప్రతిభతో ఇది “లల్లాదేవి కాలం” అన్నట్లు విస్తృతంగా రచనలు చేశారు.
కథలు,చారిత్రక, సాంఘికనవలలు,నాటకాలు,వైజ్ఞానిక రచనలుచేసి పాఠకులకు అందించారు. లల్లాదేవి ఈ అక్టోబర్ 2 వతేదీ అర్ధరాత్రి కన్నుమూసారు.