ఆకట్టుకునే డిఫరెంట్ లవ్ స్టోరీ !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi…………….

ముత్యమంత ముద్దు…. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నవల థ్రిల్లర్ ఆధారంగా తీసిన సినిమా ఇది.. 1989 లో విడుదలైంది. మరో విశేషం ఏమిటంటే సినిమాకు ఆయనే ఉపోద్ఘాతం ఇచ్చారు . It’s a social fantasy movie . యండమూరి వారికి super-natural powers/మానవాతీత శక్తుల మీద మక్కువ ఎక్కువ కదా ! దానికి ట్రయల్ రన్ ఈ నవల .. ఈ సినిమా అని అనుకుంటాను.

హీరో అనుదీప్ కి  ప్రేమ మీద అపార నమ్మకం . ప్రేమను ప్రేమించి , తపస్సు చేసి , సంకల్పసిధ్ధిని సాధించవచ్చు అనే ప్రగాఢ నమ్మకం . ఆ నమ్మకంతో తాను ప్రేమించిన హీరోయిన్ కొరకు వింధ్య పర్వతాలకు వెళ్ళి ఏడేళ్లు తపస్సు చేసి సంకల్పసిధ్ధిని సాధిస్తాడు . దానికి మెస్మరిజమనో , హిప్నాటిజం అనో, కనికట్టు అనో , ఏదో ఓ పేరు కూడా పెట్టవచ్చేమో ? పెట్టుకోవచ్చేమో ?

హీరోయిన్ విద్యాధరి (సీత)కు మగవారి ప్రేమ మీద చాలా అనుమానాలు,అపనమ్మకాలు,చీదర,వగైరా వగైరా. ఆమె అనుభవాలు అలాంటివి.అందుకు తగ్గట్టుగానే ఇంటి ఓనర్ గొల్లపూడి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాలో విలన్ లాగా ఆడవాళ్ళ శరీర భాగాలను తాకుతూ  ఉంటాడు . అతనిని మించి బేవార్స్ ఆఫీసులో బాస్ సుధాకర్ . వీళ్ళందరి దెబ్బతో మగవారి ప్రేమంతా ఆడవారిని లోబరుచుకోవటానికే అని ప్రగాఢ విశ్వాసం.

ఏడేళ్ల తర్వాత వచ్చి హీరోయిన్ని ఇంప్రెస్ చేయటానికి అనుదీప్ విఫల యత్నాలు చేస్తాడు. హీరోయిన్ చేత తిరస్కరించబడతాడు .బాస్ అక్రమ వ్యాపార రహస్యాలను సంపాదించడానికి పోలీసులకు సాయం చేయబోయి తానే హత్య కేసులో ఇరుక్కుంటుంది.హీరోయిన్ కి తెలియకుండా ఆమెను రక్షించటమే కాకుండా , తానే ప్రాణాపాయంలో పడతాడు.

DSP మురళీమోహన్ హీరోయిన్ సీతకు నిజాలను చెప్పి చావు బతుకుల మధ్య ఉన్నహీరోని రక్షించుకోమని చెపుతాడు. సీత వెళ్ళేటప్పటికే తెల్ల దుప్పటి కప్పేస్తారు డాక్టర్లు.హీరోయిన్ పిలుపుకు రెస్పాండ్ అయి బతుకుతాడు. నవలలో చనిపోతాడు. సినిమాలో బతికించబడతాడు. సినిమా శుభాంతం అవుతుంది.

అనుదీప్,విద్యాధరి పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సీత ఇద్దరూ చాలా బాగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ అనుదీప్ పాత్రలో ఇమిడి పోయాడు. విద్యాధరిగా సీత ఇంకా బాగా నటించింది.ఈ రెండు పాత్రలు కాకుండా ‘అంతులేని కధ’ సినిమాలో ఫటాఫట్ జయలక్ష్మి పాత్ర వంటి పాత్ర ఒకటి ఉంటుంది. దివ్యవాణి ఆ పాత్రలో చాలా బాగా నటించింది .

ఈజీ గోయింగ్ పాత్ర.జీవితం అనుభవించేందుకే అని నమ్మే చార్వాక భౌతికవాది. చార్వాకం అంటే తిను , తాగు , సుఖించు తత్వం . భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా అనే శాస్త్రం . ఇతర ప్రధాన పాత్రల్లో చెప్పుకోవలసిన పాత్రలు సీత బాస్ సుధాకర్ , సబ్ ఇనస్పెక్టర్ బ్రహ్మానందానివి. వీరిద్దరు కాకుండా రంగనాధ్ , మురళీమోహన్ , ప్రసాద్ బాబు , కాంతారావు , అన్నపూర్ణ , ఆలీ , నారాయణరావు , తదితరులు నటించారు.

ఇంటి ఓనర్ పాత్రలో గొల్లపూడి తనదైన శైలిలో సహజంగా నటించాడు ..గొల్లపూడి కి సీత క్లాస్ పీకే సన్నివేశం బాగుంటుంది. ఇక బాస్ గా సుధాకర్ బాగా చేసాడని చెప్పాలి. చాలా సన్నివేశాల్లో కళ్ళలో క్రూయల్టీ ని అద్భుతంగా చూపించాడు. సుధాకర్ ను చెప్పుతో కొట్టే సీన్, అంతకు ముందు సీతపై దొంగ అనే ముద్ర ఉద్యోగంలో నుంచి తీసేసే సీన్ బాగా వచ్చాయి.

అలాగే నారాయణరావు అక్కినేనిలా ఇమిటేట్ చేసే సన్నివేశాలు, పోలీస్ స్టేషన్ లో బ్రహ్మ్మనందం రాజేంద్రప్రసాద్ మధ్య తీసిన సీన్స్,చేయి మొలిచే సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చిన్న సైజు పోలీస్ విలన్ గా బ్రహ్మానందం బాగా చేసాడు.

హంసలేఖ సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి.బేక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంటుంది.  ఆయన అసలు పేరు గంగరాజు కన్నడ పరిశ్రమకు సంబంధించిన ఈయనకు తెలుగులో ఇదే మొదటి సినిమా అనుకుంటా . వేటూరి సాహిత్యానికి బాలసుబ్రమణ్యం , జానకమ్మలు పాడారు .

ఓ అందమా తెలుగింటి దీపమా పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . గొప్పింటి గోపమ్మా అంటూ సాగే పాట కూడా బాగుంటుంది . రాజేంద్రప్రసాద్ , సీతల మీద రెండు డ్యూయెట్లు ఉంటాయి . ఇచ్చుకో ముద్దిచ్చుకో , ప్రేమలేఖ వ్రాసా నీకంది ఉంటది అంటూ సాగుతాయి ఈ రెండు డ్యూయెట్లు . ప్రేమ లేఖ వ్రాసా పాట శ్రావ్యంగా ఉంటుంది . చిత్రీకరణ బాగుంటుంది.

నవల చదివిన వారికి సినిమా నచ్చకపోవచ్చు. నవల లో ఉన్న థ్రిల్ సినిమాలో లేదనే చెప్పుకోవాలి. నవల ను యధాతధంగా తీయడం కష్టం కాబట్టి సారాంశం మిస్ కాకుండా రవిరాజా పినిశెట్టి బాగా నే కథను తెరకెక్కించారు. 

సత్యమూర్తి పదునైన డైలాగులను అందించారు. ముఖ్యంగా సీత డైలాగులు బాగుంటాయి . సస్పెన్స్ బాగానే  ఉంటుంది . యండమూరి తన నవలకు థ్రిల్లర్ అని apt గానే పెట్టుకున్నారు . సినిమా యూట్యూబులో ఉంది . ఓ ఆఫ్ బీట్ మూవీ. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!