DARK…….. ఈ సినిమా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కాదు .. హారర్ కాదు .. థ్రిల్లర్ !! కాకపోతే కన్ఫ్యూజ్ చేసే థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలు అంటే సహజంగా ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అలా లెక్కలు వేసుకుని ఈ సినిమా తీశారు. అక్కడక్కడా హారర్ అనిపించేలా కొన్ని సన్నివేశాలు పెట్టారు.
ఇది ఒక తమిళ సినిమా .. ‘బ్లాక్’ పేరిట గత ఏడాది విడుదలైంది. ఓటీటీ కి వచ్చేసరికి ‘డార్క్’ అని పేరు మార్చారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది. సినిమా ప్రారంభం బాగానే ఉంటుంది. డార్క్ పేరు తోనే అంతకుముందు సిరీస్ కూడా వచ్చింది. ఇక కథలోకి వెళితే…
1964లో లలిత, గణేశ్ అనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని ఫ్రెండ్ ని సహాయం అడుగుతారు.లలిత అంటే ఇష్టపడే మనోహర్ అనే ఫ్రెండ్ ఒక పథకం ప్రకారం ఆ ఇద్దరినీ ‘బీచ్ హౌస్’ కి తీసుకుని వస్తాడు. అక్కడ వాళ్ళిద్దరినీ చంపాలని అనుకుంటాడు. అయితే ఈ లోపలే ఆ ఇద్దరూ దారుణంగా హత్య కు గురవుతారు.. హంతకుడు ఎవరనేది సస్పెన్స్.
ఒకప్పుడు ఆ ‘బీచ్ హౌస్’ ఉన్న ప్రాంతంలో తర్వాత కాలంలో ఖరీదైన విల్లాలు వెలిశాయి. వాటిలో ఒక విల్లాను కొనుగోలు చేసిన వసంత్ (జీవా) అరణ్య ( ప్రియా భవాని శంకర్) ఇద్దరూ అక్కడికి వస్తారు. సిటీకి దూరంగా ఉండే ఆ విల్లాలో రెండు రోజుల పాటు సరదాగా గడపాలని ప్లాన్ చేసుకుంటారు.
అక్కడ అన్ని విల్లాలు ఖాళీగా ఉంటాయి.ఆ ప్రాంతం తమ ఏకాంతానికి అనుకూలమని భావిస్తారు.దగ్గర్లో ఉన్న సూపర్ బజార్ కి వెళ్లి వచ్చే లోగా ఒక పార్సెల్ కనిపిస్తుంది. దాన్ని ఎవరు పంపారో అర్ధంకాదు.. వసంత్,అరణ్య మాట్లాడుకుంటుండగానే వసంత్ ఫ్రెండ్ వస్తాడు. ఈ ఇద్దరూ అతగాడిని చూసి ఆశ్చర్య పోతారు. నువ్వే రమ్మన్నావని అతగాడు చెబుతాడు.
ఇక్కడి నుంచి సినిమాలో కొంత కన్ఫ్యూజన్ మొదలవుతుంది.తమని ఎవరో రహస్యంగా గమనిస్తున్నట్టుగా ఆ జంట ఫీల్ అవుతారు.అరణ్య కిటికీ లో నుంచి చూస్తే ఒక విల్లాలో లైట్స్ వెలుగుతుంటాయి. వాచ్ మెన్ కి కాల్ చేస్తే ఆ విల్లాలోకి ఎవరూ దిగలేదనే చెబుతాడు. అక్కడి కెళ్ళి చూస్తే లోపల అచ్చం తమలాగే ఉండే జంట కనిపిస్తారు.
వసంత్ కి మైండ్ బ్లాక్ అవుతుంది.ఇక అక్కడనుంచి వారికి చిత్ర,విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. బయటికి వెళ్లలేక పోతారు. అక్కడి నుంచి వాళ్లు బయటపడతారా? లేదా అనేది కథ.
2013 హాలీవుడ్ చిత్రం ‘కోహెరెన్స్’ ఈ సినిమా కథకు మూలం. చిత్రీకరణ అంతా బాగున్నప్పటికీ సామాన్య ప్రేక్షకులు గందరగోళానికి గురవుతారు.ఈ హై-కాన్సెప్ట్ థ్రిల్లర్ ను అర్ధం చేసుకోవాలంటే చాలా కీన్ గా, ఓపిగ్గా సినిమా చూడాలి. సన్నివేశాలు రిపీట్ అవుతుంటాయి. అక్కడక్కడా థ్రిల్ ఫీల్ అవుతాం.కథ వేగంగా ముందుకు కదలదు.
వసంత్ ను వసంత్ లా ఉండేవాడు వచ్చి కొడతాడు. ఎందుకు కొట్టాడో ?అదెలా సాధ్యమో అర్ధం కాదు.హీరోయిన్ అరణ్య ఎలా మాయమైందో ? ఎక్కడికెళ్లిందో ? ఎలా మళ్ళీ వచ్చిందో ? అర్ధం కాదు. కథలో 90 శాతం కేవలం రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. విల్లాల మధ్యనే జరుగుతుంది.
కథలో కొత్తదనం ఉంది కానీ అందరికి అర్ధంకాదు. కొంతమందికి కావచ్చు .. టైం లైన్ .. సూపర్ మూన్ ఎఫెక్ట్ సరిగ్గా అర్ధం కావు. జీవా – ప్రియా భవాని శంకర్ నటన ఆకట్టుకునే విధంగా సాగుతుంది. సంక్లిష్టమైన కథను సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా చెబితే బాగుండేది.
గోకుల్ బెనోయ్ కెమెరా .. సామ్ సీఎస్ అందించిన సంగీతం, బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. తమిళంలో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్, టైమ్-ట్రావెల్ మిస్టరీ అంటూ కొన్ని పత్రికలు రాశాయి.
1964 నాటి సూపర్‌మూన్ సమయంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని సినిమా ప్రారంభంలో కనిపించే మనోహర్ పాత్ర ద్వారా చివరిలో చెప్పించారు.సూపర్ మూన్ ఎఫెక్ట్ హీరో హీరోయిన్ మీదనే పడుతుందా ? అన్న సందేహం కలుగుతుంది..కొత్త దర్శకుడు సుబ్రమణి సినిమాను బాగానే తెరకెక్కించారు. అయితే అందరికి ఈ సినిమా కనెక్ట్ కాదు.