Subbu Rv ……………………………………………………..
“పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అనే నానుడిని నిజం చేసింది విజయవాడ ఆర్టీసీ కాలనీకి చెందిన సోమూరి వైశ్వి. ఈ చిన్నారి చిత్రకళలో రాణిస్తూ పలు బహుమతులతో పాటు పలువురు ప్రశంసలను , అవార్డులను, సత్కారాలను అందుకుంటుంది.
గంగూరు బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండవ తరగతి చదువుతూ రోజంతా తరగతిలో పుస్తకాలతో కుస్తీ పట్టి అలసిపోయి .. సాయంత్రం ఇంటికి చేరగానే తనకిష్టమైన రంగులతో ఆడుకుంటూ బొమ్మలు గీస్తుంది చిన్నారి వైశ్వి. చిత్రకళపట్ల కూతురు ఆసక్తి ని గమనించిన తల్లిదండ్రులు సోమూరి రేష్మా, శ్రీకాంత్ లు వైశ్వి ని మెరుగైన శిక్షణ కోసం “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ లో చేర్పించారు.గురువు స్ఫూర్తి శ్రీనివాస్ శిక్షణలో చిత్రకళలోని మెళకువలు నేర్చుకుంటూ పలు చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ చాటుతూ వివిధ స్థాయి పోటీల్లో రాణిస్తూ సత్కారాలను పొందుతుంది.
స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ -తెలంగాణా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు నిర్వహించిన సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ లో ప్రధమ బహుమతి సాధించింది.అలాగే ఇటీవల నిర్వహించిన సలాం ఇండియా ఆర్ట్ కాంటెస్ట్ లో కూడా ప్రధమ బహుమతిని సాధించి జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ చేతుల మీదుగా మెమొంటో అందుకుంది.
బాల్యంలోనే అబ్బురపరిచే చిత్రకళా నైపుణ్యంతో వివిధ సామాజిక అంశాలపై చిత్రాలు గీసి చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొంటూ తోటి చిన్నారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.నీటి రంగులతో బొమ్మలు గీయటమంటే చాలా ఇష్టమని, ప్రకృతి చిత్రాలతో పాటు పక్షులు, జంతువులు, దేవతామూర్తుల చిత్రాలు గీస్తుంటానని.. అలాగే కార్టూన్స్, డూడుల్ ఆర్ట్స్, పెన్సిల్ షేడింగ్, మండా లా ఆర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టమని వైశ్వి చెబుతున్నది.
తనకి పిచ్చుకలంటే చాలా ఇష్టమని… అందుకే “సేవ్ స్పారో” ఉద్యమంలో పాల్గొంటూ వాటి సంరక్షణకై తన వంతు కృషి చేస్తున్నానని…ప్రతి రోజూ ఉదయం.. సాయంత్రం ఇంటి వరండాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్డ్ హౌస్ ల దగ్గర ధాన్యపు గింజలు, నీరు ఏర్పాటు చేస్తానని బుల్లి బుల్లి మాటలతో చెబుతూ పెద్దలను సైతం ఆలోచింపజేస్తుంది.
తను గీసిన చిత్రాలు పలు పత్రికల్లో ప్రచురింపబడటం తనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నారని మునుముందు పలు సామాజిక అంశాలపై మరిన్ని చిత్రాలు గీసి త్వరలో # ఒన్ గర్ల్ ఆర్ట్ షో # నిర్వహించాలనే సంకల్పంతో సాధన చేస్తున్నానని అంటున్న చిన్నారి వైశ్వికి ఆల్ ది బెస్ట్ చెబుదామా.