చార్ ధామ్ యాత్ర అంటే ?? (1)

Sharing is Caring...

చార్ ధామ్ యాత్ర  కేవలం భక్తి యాత్రే కాదు ఒకవిధంగా సాహస యాత్ర కూడా. హిమాలయాల్లో ఉన్న నాలుగు పుణ్య క్షేత్రాల సందర్శనే ఈ చార్ధామ్ యాత్ర.ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్ ,బద్రీనాథ్ వంటి క్షేత్రాలను యాత్రికులు సందర్శిస్తారు. ఆది శంకరాచార్యుల వారు సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారని అంటారు .

అప్పటి నుండి ఈ తీర్ధయాత్ర సాంప్రదాయ బద్దంగా ..  నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికులు ప్రతి ఏటా ఏప్రిల్ – మే నెలల్లో తెరిచే నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ యాత్రకు వస్తుంటారు. దీపావళి తరువాత శీతాకాలంలో ఎముకలు కొరికే చలి, మంచు కారణంగా ఈ ఆలయాలను మూసి వేస్తారు. మళ్ళీ ఏప్రిల్ నెలవరకు  వీటిని తెరవరు.

కరోానా వల్ల గత రెండేళ్లుగా ఇక్కడ ఆంక్షలున్నాయి. అందుకే తక్కువ సంఖ్యలో భక్తులు యాత్రకు  వెళ్లారు. కానీ ఈసారి ఆంక్షలను సడలించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ప్రధాన ఆలయాలకు వెళ్లే అన్ని మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సారి యాత్రలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. అలాగే ఆరోగ్య పరీక్షలు తప్పని సరి చేశారు.

ఈ యాత్రలో ముందుగా యమునోత్రిని సందర్శిస్తారు. యమునోత్రి దేవాలయం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో 3291  మీటర్ల ఎత్తులో గర్వాల్ హిమాలయాల పశ్చిమ ప్రాంతంలో ఉంది. పవిత్ర యమునా నది పుట్టిన ప్రదేశం యమునోత్రి. ఇక్కడ కొన్ని వేడి నీటి బుగ్గలు ఉంటాయి. యమునా ఆలయం వైపు పాదయాత్ర ప్రారంభించే ముందు యాత్రికులు ఈ నీటిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.

చాలా కాలం క్రితం తెహ్రీ గర్హ్వాల్ కు చెందిన మహారాజా ప్రతాప్ షా నదీ దేవత మందిరాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ నడక దారి కొన్ని చోట్ల 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఒక వైపు వందల అడుగుల ఎతైన పర్వత ప్రాంతాలు, మరో వైపు ఐదారు వందల అడుగుల లోతైన లోయ లు కనిపిస్తాయి. ఈ రెండింటి నడుమ ప్రవహించే యమునా నది అందాలను కన్నులతో చూడాల్సిందే కానీ  వర్ణించడానికి వీలు కాదు. యాత్రికులు ఇక్కడ నదీమతల్లికి పూజలు చేసి నదీ జలాన్నే తీర్థంగా తీసుకుంటారు. నదిలో పూలు, దీపం తదితరాలను వదిలి తమ మొక్కును తీర్చుకుంటారు.

యమునోత్రికి అవతల ఉత్తర కాశీలో గంగోత్రి ఉంది. ఇది గంగా దేవత యొక్క పవిత్ర నివాసం అంటారు. చార్ ధామ్ యాత్ర కొరకు యమునా మందిరం తెరిచే రోజునే ఈ ఆలయాన్ని కూడా తెరుస్తారు. ఈ ఆలయం నది ఒడ్డునే ఉంటుంది. గంగోత్రి ఆలయాన్ని నేపాల్ జనరల్ అమర్ సింగ్ థాపా నిర్మించారు.

ఈ ఆలయాన్ని  ప్రతి సంవత్సరం దీపావళి రోజు న మూసి వేస్తారు. అక్షయ తృతీయ నాడు తిరిగి తెరుస్తారు. ఆలయం మూసి వేసిన  సమయంలో హర్సిల్ సమీపంలోని ముఖ్బా గ్రామంలో దేవత విగ్రహన్నీ ఉంచుతారు.  దేవాలయం ఆచార వ్యవహారాలను పూజారి సెమ్వాల్ కుటుంబసభ్యులు పర్యవేక్షిస్తారు. ఈ పూజారులు ముఖ్బా గ్రామానికి చెందినవారు.భగీరథుడు శివుడి గురించి తపస్సు చేసి గంగను భూమి పైకి దింపిన ప్రదేశాన్నే గంగోత్రి అని అంటారు. ఇక్కడ గంగానదిని భాగీరథి పేరుతో పిలుస్తారు. పాండవులు ఇక్కడ కొన్నాళ్ళు  విశ్రాంతి తీసుకున్నారని భావిస్తారు. ఇక్కడకు వెళ్లాలంటే  యాత్రికులు  ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.ఈ ఆలయం నుండి 9 కిలోమీటర్ల దూరంలో గోముఖ్ ప్రదేశం ఉంది. ఇక్కడి హిమానీనదం గంగానది మూల స్థానంగా భావిస్తారు. దేవప్రయాగ్ లో అలకనందతో గంగా నది కలిసే ముందు వరకు కూడా ఇక్కడ గంగను భాగీరధి అని భక్తులు పిలుస్తారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!