This is how this city was born
మూడో నిజాం సికిందర్ జా తన ముప్ఫయోఏట 1803 సం.లో అధికారంలో కొచ్చి 1829 సం. చనిపోయేటంత వరకు పాలించాడు. అప్పుడు హైదరాబాదు రెసిడెంటుగా వున్న కెప్టెన్ సీడెన్ హాం హుస్సేన్ సాగర్ కి ఇవతల ఉన్న పట్టణానికి సికిందర్ జా పేరు పెట్టాలని భావించి నిజాంను అనుమతి కోరాడు.
తన పేరేగాబట్టి ఆయన వెంటనే ఫర్మానా జారీచేశాడు.ఆ విధంగా ఆయన పేరు మీద సికిందరాబాద్ ఏర్పడింది. కాలక్రమంలో సికిందరాబాద్ కి అనేక హంగులు ఏర్పడ్డాయి. పలు సంస్థలు, థియేటర్లు ,కార్యాలయాలు వెలిశాయి.పెద్ద నగరంగా మారిపోయింది.
ఆ సమయంలోనే ఆంగ్లేయులు సికింద్రాబాద్ క్లబ్ ఏర్పాటు చేశారు. సాధారణ సైనికుడి నుంచి మేజర్ జనరల్ వరకు సభ్యత్వం ఇచ్చారు. కొంతమంది భారతీయ సంపన్నులకు కూడ సభ్యత్వం ఇచ్చారు.నవాబు కుటుంబానికి సన్నిహితుడైన ఒక నవాబుకు సభ్యత్వం ఇవ్వడానికి ఎందుకో నిరాకరించారు. ఇది అవమానంగా భావించిన నవాబులు పోటీగా అప్పట్లో నిజాం క్లబ్ స్థాపించారు.
ఇక కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ ఈనాటి గాంధీ హాస్పిటల్ గా మారిపోయింది. మలేరియాక్రిమి కనిపెట్టిన డా.రొనాల్డ్ రాస్ బ్రిటిష్ ఆర్మీ డాక్టర్ గా సికింద్రాబాద్ లో పని జేసేవారు. వీరు పనిజేసిన సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వుండేది. డా.రొనాల్డ్ రాస్ గారికి నోబెల్ బహుమతి వచ్చింది.
తరువాత ఆసంస్థకు రొనాల్డ్ రాస్ పేరేపెట్టారు. అదేసమయంలో అంటే 20 వ శతాబ్దం తొలిదశకంలో సికింద్రాబాద్ కంటోన్మెంటులో జూనియర్ కమిషన్డ్ ఆఫీసరుగా సర్ విన్స్టన్ చర్చిల్ పనిజేశాడు.
ఈ చర్చిల్ Round table conference సమయంలో గాంధీ గురించి ” I dislike to see that half naked phakeer ascending the stair case of the vice – regal palace ” అన్నాడు. అన్న నాలుగేళ్ళకే బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావటం చర్చిల్ తన కళ్ళతోనే చూశాడు.
అప్పట్లో బ్రిటీషు రెసిడెంటును మీదేశం నుంచి ఏదైనా మంచి యంత్రం తెచ్చి చూపమని నిజాం కోరాడు. సైకిలుకు గాలికొట్టే పంపు తెచ్చి చూపారు. బ్రిటిషు యాజమాన్యంలో హోటల్ మాంట్ గొమారి వుండేది. ఆంగ్లేయులు వెళుతూ స్థానిక బట్లర్ కు ఇచ్చి వెళ్ళారు. అక్కడ హోటల్, బార్ నడిపారు.
ప్రఖ్యాత కవి రిచర్డ్ టెంపుల్ టన్ ఒకసారి సికింద్రాబాద్ సందర్శించి ఇక్కడి పట్టణాన్ని చూసి ముగ్ధుడైనాడు. ప్రిన్స్ఆఫ్ వేల్స్ వచ్చిన సందర్భంగా ఆల్బర్ట్ రీడింగ్ రూం స్థాపించారు. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి గుడిని సైన్యం లో మేనాలు మోసే చిన్న ఉద్యోగి సూరి అప్పయ్య కట్టించాడు. బోనాలు జరిగేది ఈ ఆలయం లోనే.
మహబూబ్ కాలేజ్ స్థాపన, నిర్వహణలో కీలక పాత్ర పోషించిన పద్మారావు మొదలియార్ పేర నేటి పద్మారావు నగర్ ఏర్పడింది. ఈ కాలేజిలో కొంతకాలం రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు పన్జేశారు. నాటి కింగ్స్ వే నేటి రాష్ట్రపతి రోడ్.. ఫ్రెంచ్ రెసిడెంట్ కోసం అబిడ్స్, కోఠీ మధ్యలోనున్న Bank street లో రుస్తుం బార్ ప్రారంభించారు. సిటీలో అదే ప్రప్రధమ బార్.ఇది హైదరాబాద్ లో ఉంది.
అప్పట్లో సికింద్రాబాద్ కు దిగుమతి చేసుకున్నవస్తువులపై కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఇచ్చారు.దీంతో వాణిజ్యం చాలా లాభదాయకంగా మారింది. రెజిమెంటల్ బజార్, జనరల్ బజార్ వంటి వివిధ కొత్త మార్కెట్లు ఏర్పడ్డాయి.
సరోజినీ నాయుడు భర్త మేజర్ గోవిందరాజులు నాయుడు సైనిక బదిలీ మీద సికింద్రాబాద్ చేరాడు. సరోజినీనాయుడు తండ్రి అఘోరనాధ్చటోపాధ్యాయ ప్రజాఉద్యమాలకు సికింద్రాబాద్లోనే నాంది పలికారు. Central university నిర్వహిస్తున్న Golden threshold భవనం సరోజినీ నాయుడి తండ్రి తన కోసం కట్టించుకున్నాడు.
ఆ భవనానికి సరోజినీ తన కావ్యం Golden Threshold పేరుపెట్టి ప్రభుత్వానికి అప్పగించారు. ఇది నాంపల్లి వద్ద ఉంది. ఆమె కుమారుడు జయసూర్య గొప్పజర్నలిస్టు. జయసూర్య మెదక్ నుంచి లోక్‌సభ సభ్యులుగా కూడా చేశారు.
ఇక కాలక్రమంలో ఆనంద్ థియేటర్, పాస్పోర్ట్ ఆఫీస్ ,చిరాన్ ఫోర్ట్ , అమెరికన్ ఎంబసీ , జనరల్ బజార్ ,జింఖానా గ్రౌండ్స్,పెరేడ్ గ్రౌండ్స్ ,గణపతి ఆలయం, మోండా మార్కెట్ , గడియారం స్థంభం , ప్యాట్నీ, ప్యారడైజ్ హోటల్,బ్లూ సీ, ఆల్ఫా , కంటోన్మెంట్, ఎయిర్పోర్ట్ ,సంగీత్ థియేటర్ వచ్చాయి.
పాపులర్ చర్చీలు ఎన్నో సికిందరాబాదు లోనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఇపుడు లేవు. సికింద్రాబాద్ 1806లో బ్రిటిష్ కంటోన్మెంట్‌గా స్థాపితమైంది.ఇది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో భాగంగా హైదరాబాద్ జంట నగరంగా ఉంది.
(ఇందులో కొంత సమాచారం జర్నలిస్టు ధర్మవరపు సీతారాం గారి వ్యాస ఆధారితం.)
—————- ‘సుమ’ పమిడిఘంటం