సమతామూర్తి కి కమర్షియల్ హంగులు !

Sharing is Caring...

సమతా మూర్తి రామానుజ స్వామిని కమర్షియల్ పరిథిలోకి తీసుకెళుతున్నారు. ఇకపై ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా టిక్కెట్ కొనాల్సిందే. ఈ ఆధ్యాత్మిక కేంద్రం కమర్షియల్ గా మారుతుందనే మాట చాలాకాలం నుంచి వినిపిస్తోంది. అదే ఇపుడు నిజమైంది.

ఈ ఆధ్యాత్మిక కేంద్రం లో 216 అడుగుల విరాట్‌ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు ఉన్నాయి. వీటి నిర్మాణానికి రూ.1,200 కోట్ల మేరకు ఖర్చు అయింది. ఈ ఆలయాలను .. విరాట్ మూర్తిని సందర్శించుకోవడానికి కనీస రుసుముని నిర్ణయించారు. పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా ఖరారు చేశారు.ఈ నిర్ణయంపై విమర్శలు వినపడుతున్నాయి.

ఈ కేంద్రంలో జనానికి ఇబ్బంది లేకుండా ..ఫుడ్ కోర్టులు, కాఫీ కేఫ్ లు , వ్యాపార దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రాంగణంలో 250 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు.. ఫీడ్ పరిశీలనకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నిర్వహించబోతున్నారు. 50 ఎకరాల్లో విస్తరించిన ఈ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు షిఫ్టుల్లో 300 మంది భద్రతా సిబ్బందిని నియమిస్తున్నారు.

క్షేత్రం లోపల లేజర్ షో.. ఫౌంటైన్లు, గార్డెన్లు, ఇతర ఆకర్షణలు ఏర్పాటు చేస్తున్నారు.క్షేత్ర ప్రాంగణంలోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర బ్యాగేజీని అనుమతించరు.టికెట్‌ కౌంటర్‌ పక్కన ప్రత్యేకంగా పెట్టె కౌంటర్లలో సెల్‌ఫోన్లు, లగేజీ, పాదరక్షలు అప్పగించాలి.వాహనాలను స్కానర్లతో తనిఖీ చేస్తారు.

ఈ ఏర్పాట్లను బట్టి చూస్తుంటే పెద్ద ఎత్తున జనం వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. భారీ ఏర్పాట్లకు ఆధ్యాత్మిక కేంద్రం నిర్వహణకు సొమ్ము అవసరం కాబట్టి ప్రవేశ రుసుము పెడుతున్నారనే వాదన కూడా వినబడుతుంది. కేంద్రం లోని సిబ్బందికి .. పూజారులకు జీతాలు భత్యాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే  కొన్ని కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం చేయించింది వ్యాపార దృక్పథంతోనే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

కాగా కొద్దీ రోజుల క్రితం జీయర్ స్వామిపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆరోపణలు గుప్పించారు. స్వామీజీ ముసుగులో చినజీయర్‌ చేస్తున్నది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమని విమర్శించారు. ముచ్చింతల్‌ పరిసరాల్లో ట్రస్ట్‌ ముసుగులో ఎన్ని వేల ఎకరాలున్నాయో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ప్రభుత్వాల అండ ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధాని, ముఖ్యమంత్రులను పిలిచారని ఆయన ఆరోపించారు. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఎందుకు ఆహ్వానించలేదని మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేస్తే.. చిన్న జీయర్ స్వామి సమానత్వ స్ఫూర్తిని పక్కన బెట్టాడని విమర్శించారు.

దళిత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో కాకుండా మోడీతో విగ్రహ ఆవిష్కరణ చేయించడం దుర్మార్గం అని కూడా అన్నారు. ఈ విమర్శలకు ట్రస్ట్ నుంచి సమాధానం వచ్చినట్టు లేదు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ తో జీయర్ స్వామికి విభేదాలు ఏర్పడిన క్రమంలో ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రభుత్వం వైపు నుంచి ఏ మేరకు సహాయ సహకారాలు లభిస్తాయో చూడాలి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!