Ramana Kontikarla …………………………………
వ్యవసాయం చేయడమంటే అంత సులభం కాదు. రైతు ఇతరుల పైన…ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. రుతుపవనాలు, బ్యాంకు రుణాలు, అతివృష్టి, అనావృష్టి… విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద, చీడ పీడలు, తెగుళ్లు వంటి అంశాల ప్రభావం రైతుపై ఉంటుంది.
ఇక పంటల యాజమాన్య పద్ధతులు… అందుకు అవసరమయ్యే సదుపాయాలు,ఇన్ ఫుట్ సబ్సిడీలు, వినూత్న హార్వెస్టింగ్ విధానాలు .. ప్రభుత్వ పాలసీలు , పంటలకు లభించే రేట్లు .. ఇలా ఎన్నోఅంశాలు రైతును ప్రభావితం చేస్తుంటాయి.
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. సమస్యల సుడిగుండంలోకి నెడుతుంటాయి. ఈ టెన్షన్లు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేసి సత్తా చాటుకున్నవారు ఉన్నారు.వారిలో పాండురంగ తవారే ఒకరు. వినూత్న శైలితో వ్యవసాయ రంగాన్ని పర్యాటక రంగంతో మిళితం చేసి విజయం సాధించిన వాడే ఈ పాండురంగ్ తవారే.
మహారాష్ట్రలోని బారామతి జిల్లా షాంగవికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించాడు 52 ఏళ్ల పాండురంగ తవారే. ఈయన చదివింది కంప్యూటర్ సైన్సైతే… ఆయన తండ్రికి మాత్రం అగ్రికల్చర్ లో డిగ్రీ చదివించాలనే ఉండేది. కానీ సరైన మార్కుల్లేక… ఆ కోర్సుకు ఎంపిక కాని పాండురంగ కంప్యూటర్ సైన్స్ఎంచుకున్నాడు.
కానీ అక్కడా అనుకున్నఫలితాలు రాలేదు. దీంతో పాండురంగ.. ఆ తర్వాత 20 ఏళ్లు పర్యాటక రంగంలో పనిచేశాడు. ఆ క్రమంలోనే… తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనిపించింది. అక్కడే తన తండ్రి కిష్టమైన వ్యవసాయం చేయాలన్న కోరిక కలిగింది. వారికి 13 ఎకరాల పొలముంది.. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇంటిపట్టున హాయిగా ఉండొచ్చన్నది పాండురంగ యోచన.
కానీ పాండురంగ భార్య వైశాలి పట్టణవాసి కావడంతో… మొదట్లో ఆమె అంత సుముఖత చూపలేదు. కానీ భర్త మాట కాదనలేక… భర్త పాండురంగతో పాటే అత్తగారి ఊరు షాంగవికి వచ్చేసింది. ఇప్పుడు పాండురంగ ఫాదర్ ఆఫ్ అగ్నిటూరిజం మ్యాన్ గా పేరు గడించడానికి… 19 ఏళ్లుగా తన భార్య తన వెంట ఉండి నడవడమే కారణమంటారు పాండురంగ తవారే.
కేవలం 32 ఏళ్ల వయస్సులో తన ఆలోచనను మార్చుకున్న పాండురంగ… ఐరోపాలో పాపులర్ అయిన అగ్రిటూరిజం భావనను ఇక్కడ కూడా అమలు చేయాలన్న ఐడియా కొచ్చేసాడు. 2002 నుంచి ఆ దిశగా అడుగులేసాడు. అయితే ఈ అగ్రిటూరిజం అనే కాన్సెప్ట్ ను తవారే ఏమంత ఆషామాషీగా ప్రారంభించలేదు. 2003లో మార్కెట్ సర్వేలు చేపట్టాడు.
అలాగే సుమారు 2 వేల 440 మంది రైతులను వ్యక్తిగతంగా కలిశాడు. చివరికి వారందరితో కలిసి… అగ్రిటూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ను ప్రారంభించాడు. తాను ఈ అగ్రిటూరిజమనే కాన్సెప్ట్ ను మొదలు పెట్టినపుడు రైతులు నమ్మకంతో ముందుకొచ్చారు కానీ వారికి ఈ విధానంపై అవగాహన లేదు. వారికి అవగాహన కల్పించడానికి కొంత కష్టపడ్డాడు.
అసలేంటీ ఈ అగ్రీటూరిజం…?
ఎప్పుడూ పట్టణాల్లో మెకానికల్ లైఫ్ గడిపే వారికి… పల్లె ప్రకృతంటే ఒకింత మమకారం. ఆ క్రమంలో వ్యవసాయ భూముల్లో చేసే పనులవంటివీ తామూ చేస్తే బాగుండనిపించేవాళ్లూ ఉంటారు. కేవలం ఈ అనుభూతి కోసం దేశంలోని పట్టణవాసులే కాకుండా… విదేశాల నుంచి వచ్చేవారూ ఉంటారు. సరిగ్గా అలాంటివారు పాండురంగ తవారే ప్రారంభించిన అగ్రి టూరిజం లో భాగంగా రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించవచ్చు.
అక్కడ రైతులెలాగైతే సాగు చేస్తారో… వచ్చిన పర్యాటకులూ ఆ పనులు చేసి అనుభూతిని పొందవచ్చు. అలాగే ఆ వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు పండించిన దిగుబడులనూ కొనుక్కోని వెళ్లవచ్చు. ఇలా పర్యాటకంగా వారికి అరుదైన అనుభూతులతో పాటు సరసమైన ధరల్లో ఉత్పత్తులు దొరుకుతాయి.
దీని వల్ల మార్కెట్ కష్టాలకూ చెక్ పడుతుంది. ఇదిగో ఇలాంటి ఆలోచనలే పాండురంగ తవారేను అగ్రిటూరిజం వైపు అడుగులువేయించింది.మహేష్ బాబు హీరో గా నటించిన మహర్షి సినిమాలో ఇదే కాన్సెప్ట్ ను చూపించారు.
అయితే మొత్తం ఉమ్మడి కుటుంబంలో పుట్టిన పాండురంగ తవారే అమ్మా, నాన్నకు తప్ప.. వ్యవసాయంలో ఎవ్వరికీ పెద్దగా అనుభవం లేదు. పైగా పర్యాటక రంగంలో పనిచేస్తున్నపుడు దాచుకున్న 6 లక్షల రూపాయల సొమ్మును కూడా ఈఅగ్రీ టూరిజంలో పెట్టుబడిగా పెట్టాడు పాండురంగ. తాను రైతులను ఒప్పించి ప్రారంభించిన అగ్రిటూరిజం కాన్సెప్ట్ ని ప్రమోట్ చేయడానికి తన దగ్గరున్నదంతా ప్రకటనల కోసం ఖర్చుపెట్టాడు.
ప్రారంభంలో నిరాశే ఎదురైంది. 2005లో మొదటి కస్టమర్ నుంచి కాల్ వచ్చింది. 2006లో పాండురంగ తవారే చేపట్టిన అగ్రిటూరిజం దశ తిరిగింది. పూణే నుంచి 4 వేల మంది మహిళా సభ్యుల బృందం వచ్చిన దరిమిలా పాండురంగ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక అప్పటి నుంచీ కేవలం 18 నెలల కాలంలోనే… తన అగ్రి టూరిజం వైపు పర్యాటకులు ఆసక్తి చూపడంతో… 13 వేల మంది వారి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
కేవలం వ్యవసాయం తో వచ్చే ఆదాయం ద్వారా కుటుంబాలు నడవలేని దైన్యస్థితిలో… పాండురంగతో అనుబంధం తమ బతుకు చిత్రాన్ని మార్చేసిందంటారు భోర్ తాలూకాలోని నస్రాపూర్ కు చెందిన రైతులు. ఇప్పుడు తమ ఆదాయం ఐదు రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు వారంతా.
పాండురంగ తవారే అగ్రి టూరిజం ప్రాజెక్టు కి ఓ పర్యాటకుడిగా వెళ్లాలంటే…1500 రూపాయలు ఒక్కో టూరిస్టుకి ఖర్చవుతుంది. రెండుసార్లు సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటల భోజనం… అల్పాహారం, సాయంత్రం టీ,స్నాక్స్ తో పాటు రాత్రి పూట కూడా పొలంలో గడిపేందుకు వసతి ఇలా అన్నీసమకూరుస్తారు.
అలా.. తవారే వ్యవసాయ పర్యాటకం వైపు మళ్లితే… పచ్చని ప్రకృతి, ఎడ్లబండ్లు, ట్రాక్టర్ రైడ్, పతంగులు ఎగరేయడం, పల్లె భోజనం …సంప్రదాయ దుస్తులు, స్థానిక సంస్కృతి, జానపద పాటలు, నృత్యాల వంటివి ఆస్వాదించవచ్చు. అలాగే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆరోగ్యాన్నీ పొందొచ్చు.
అందుకే పాండురంగ తావరే అగ్రిటూరిజం కాన్సెప్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మన్ననలందుకుంటోంది. ఆయన కృషికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అలా 2008-09, 2013-14 లో రెండు జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు పాండురంగ.
అగ్రి టూరిజంపై పాండురంగ ప్రాజెక్టు ను సందర్శించడానికి… మహారాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. ఐదవ తరగతి నుంచి పదవ తరగతివిద్యార్థినీ, విద్యార్థులను ప్రతీ ఏటా క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాండురంగ అగ్రిటూరిజం ఫీల్డ్ ను సందర్శించాలని.. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకిప్పటికే ఆదేశాలు ఇచ్చింది.ఈ లెక్కన దాదాపు కోటి మంది పాఠశాలల విద్యార్థులు ఈ ఫీల్డ్స్ ను సందర్శించనున్నారు.ఇక వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకుని వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది.