Nirmal Akkaraju …………………………….
ఒంగోలు జిల్లా ఏర్పడి 52 ఏళ్ళు అయినా ప్రకాశం జిల్లా గా పేరు మార్చి 50 ఏళ్ళు మాత్రమే. గుంటూరులో కొంత ప్రాంతాన్ని, నెల్లూరు, కర్నూలు నుండి మరికొంత మొత్తం ప్రాంతాలను కలిపి ఒంగోలు జిల్లా పేరు ప్రకటించగానే అప్పుడు కూడా రాయలసీమ ప్రజా సమితి నాయకులు సుల్తాన్ కోర్టు గడప తొక్కారు.
అదే సందర్భంలో రాయలసీమ వాళ్ళు తమ నుంచి కోల్పోయే ప్రాంతాలను విడిచి పెట్టమని నిరసనలు చేశారు. కోర్టు కేసు కొట్టి వేయడంతో ఫిబ్రవరి 2 1970 న అప్పటి కలెక్టర్ దొరై స్వామి ఆధ్వర్యంలో ఉదయం 10:23 నిమిషాలకు విధులలో చేరారు. అదే సమయంలో కనిగిరి, కందుకూరు ప్రాంతాలకు నెల్లూరు నాయకులు ఘనమైన వీడ్కోలు పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.
మళ్ళీ 52 సంవత్సరాల తర్వాత ప్రకాశం జిల్లా ముక్కలైంది. చీరాల, అద్దంకి నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో , కందుకూరి లో కొన్ని మండలాలను నెల్లూరు లో కలిపారు. సముద్రతీరం వేరే జిల్లాకు వెళ్ళుతుండడంతో ప్రతిపాదిత ఓడరేవు కూడా జిల్లా మారిపోయుంది.చాలా సంవత్సరాలగా మార్కాపురం కేంద్రం గా జిల్లా కావాలని అక్కడి ప్రజల ఆకాంక్షగా ఉంది.
మొదట్లో అందరూ వెస్ట్ ప్రకాశం, ఈస్ట్ ప్రకాశం జిల్లాలు అవుతాయని ఊహించారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లోక్ సభ నియోజక వర్గాల వారీగా జిల్లాలు అని అందులో కొన్ని మాత్రమే మార్పులు చేర్పులు చేసింది. పేరుకు ఎనిమిది నియోజకవర్గాలతో రహదారులు కూడా సరిగా లేని అతి పెద్ద జిల్లా గా పడమర ప్రాంతం నుండి హెడ్ క్వార్టర్‌కి రావాలంటే చాలా కష్టం.
జిల్లా హెడ్ క్వార్టర్స్ తో ఏమి పని సచివాలయాలు ఉన్నాయి అనే వారికి అలాంటప్పుడు జిల్లాల ఏర్పాటుతో అస్సలు పని లేదు కదా అని సమాధానం చెప్పవచ్చు. మూడు ముక్కలతో కలిసిన ప్రకాశం మూడు ముక్కలే అయింది.
అసలు ఈ జిల్లాల విభజన గెజిట్ ను కేంద్రం ఆమోదించాలి అనే వాదన ఉంది కానీ, ఒక సారి తెలంగాణ చూస్తే,తెలంగాణ లో జిల్లాల విభజన అనేది జిల్లా విభజన చట్టం 1974 ప్రకారం జరిగింది. ఇది ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన చట్టం . అనంతరం తెలంగాణ కొనసాగించి ఆమోదించుకుంది.
కాబట్టి జిల్లాల విభజన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు,తెలంగాణ జిల్లాల విభజన కేంద్ర గెజిట్ కాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ కొన్ని వెబ్ సైట్లలో కొత్త జిల్లాల పేర్లు ఉన్నాయి . కోవిడ్ కారణం గా జరగని 2020 లో జనాభా లెక్కలు ముగిసేవరకు జిల్లాల విభజన పూర్తవదు.కాబట్టి కొన్ని మార్పులు చేర్పులతో అయినా కొత్త జిల్లాలు ఏర్పడతాయి.