అలుపూ సొలుపు లేకుండా మెట్లకిన్నెర మీద అతడు పలికించే గమకాలు గంధర్వ లోకంలో విహరింప జేస్తాయి అతడి చేతివేళ్ల నడుమ పలికే కిన్నెర శబ్ద తరంగాలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. అలాంటి మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య పద్మశ్రీ అవార్డుకి ఎంపిక కావడం సంతోషమే. ఈఎంపిక నూరు శాతం కరక్టే.
మొగిలయ్య ఆఖరి తరం వాయిద్య కారుడు కూడా. ఆయన ప్రతిభను గుర్తించి తెలంగాణ సర్కార్ మొదటి ఆవిర్భావ దినోత్సవం నాడు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాయిద్యం ప్రాముఖ్యతను భావితరాలకు తెలిసేలా ఎనిమిదో తరగతి లో పాఠ్యాంశం గా చేర్చింది.గుమ్మడి బుర్రల మధ్య బిగించిన తంత్రీనాదం గుండె గుండెనూ మార్దవంగా తడుముతుంది. అరుదైన వాగ్గేయకారుడుఅంతరించి పోతున్న కళకు ఒకే ఒక సాక్ష్యం మొగిలయ్య.
పెద్దజుట్టు.పంచెకట్టు..కోరమీసం..భుజం మీద మెట్ల కిన్నెర వాయిద్యం.. “ఆడా ల్యాడ్ మియాసావ్.. ఈడా ల్యాడ్ మియా సావ్”అని రాగయుక్తంగా పాడుతూ- మెట్ల కిన్నెర వాయిస్తుంటే ఎంత అర్జెంట్ పని మీద వెళ్తున్నా ఆపాట దగ్గర ఆగి పోవాల్సిందే. మీయసావ్.. మహబూబ్నగర్లో జానపద హీరో. ఉన్నోళ్లను కొట్టి, లేనోళ్లకు పెట్టే త్యాగజీవి. దోచుకున్న డబ్బును పాలమూరులో ప్రజలకోసమే ఖర్చు పెట్టాడు.
జనం కోసం బతికి అసువులు బాశాడు. అలాంటి మీయసావ్ చరిత్రను ఇప్పటికీ జనం ప్రేమతో చెప్పుకుంటారు. ఈ కథను మొగులయ్య తాతల కాలం నుంచి చెప్తున్నారు. మొదట్లో మావురాల ఎల్లమ్మ కథలు, మల్లన్న కథలు చెప్పేవారు. కానీ జనం కోసం బతికిన మీయసాబు కథను జనానికి చెప్పాలని పంథా మార్చుకున్నారు.
రాజస్థానీలు వాడే సారంగిని తలపిస్తున్న పరికరాన్ని 12 మెట్ల కిన్నెర అంటారు. దీన్ని వాయిస్తూ పాడే ఏకైక వాగ్గేయకారుడు దర్శనం మొగిలయ్య. వారసత్వంగా వచ్చిన కళకు చిట్టచివరి వారసుడు. కాలానికి అనుగుణంగా సానబెట్టిన సంప్రదాయ సంగీతకారుడు. అంతరించి పోతున్న కళారూపానికి ఏకైక ఆయువుపట్టు. పాటే జీవనాధారంగా బతుకుతున్నవాడు. తన చేతిలో ఉండే పన్నెండు మెట్ల కిన్నెరను తానే తయారు చేసుకున్నాడు.
మామూలుగా కిన్నెరకు ఒక సొరకాయ బుర్ర ఉంటుంది. కానీ మొగలయ్య మరిన్ని రాగాలు పలికించాలనుకుని 12 మెట్ల కిన్నెరను తయారు చేసుకున్నాడు. మూడు వేర్వేరు సైజు గుమ్మడి బుర్రలతో మెట్ల సంఖ్యను పెంచి, తంత్రులు బిగించాడు. సరికొత్త రాగాలకు పురుడుపోశాడు. జనాన్ని తన కథనుంచి, పాటనుంచి జారిపోకుండా ఉండేందుకు వాయిద్యం మీద ఓ పక్షిని కూడా తయారు చేశాడు.
మొగులయ్య పాటంతా రెండు జతుల నడకతో సాగుతుంది. పాటకు మధ్యలో ఊపిరి తీసుకుంటాడు. ఆ గ్యాప్లో కిన్నెర మీటుతాడు. బుర్రమీద నెమిలి ఈక తోకపిట్ట అటూ ఇటూ డ్యాన్స్ చేస్తుంటుంది! శెభాష్ అంటూ మళ్లీ పాటను ఒక ఊపులో ఎత్తుకుంటాడు.మొగిలయ్య తనువు, మనసు పాటలో లీనమైపోతుంది.
చూసే జనాలు లోకం మరిచిపోతారు. ఈ పన్నెండుమెట్ల కిన్నెర తయారు చేసినప్పటికీ మొగిలయ్య జీవితం మాత్రం సుఖంగా లేదు. పూట .. పూట ఆకలి పోరాటమే. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. అన్నట్టు త్వరలో విడుదల కాబోయే భీమ్లా నాయక్ సినిమా కోసం మొగిలయ్య ఒక పాట కూడా పాడారు. అందుకు గాను కొంత మొత్తం హీరో పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అలాగే రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి 25 వేలు ఆర్ధిక సహాయం చేశారు.