ఎంతైనా ఆర్కే గారు కార‌ణ‌జ‌న్ములు!!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala …………………………….

ఇంట‌ర్యూ అన‌గా అవ‌త‌లి వారిని ప్ర‌శ్న అడిగి స‌మాధానం రాబ‌ట్ట‌డం అనుకుంటే పొర‌పాటు. నువ్వ‌నుకున్న స‌మాధానం రాబ‌ట్టేలా ప్ర‌శ్న అడ‌గ‌డం … ఆ త‌ర్వాత అత‌ని మాట‌ల‌నే ప‌ట్టుకుని అత‌న్ని చుట్టేయ‌డం … ఇది స్టెయిలు. అస‌లు ఇంట‌ర్యూ కాన్సెప్టే ఇది … చాలా మందికి తెలియ‌దు.

ఈ స్టెయిలును తెలుగు మీడియాలో బాగా ప్రాక్టీసు చేసిన వారు ఎబిఎన్ ఆంధ్ర‌జ్యోతి అధినేత రాధాకృష్ణ‌. అందుకే ఆయ‌నంటే నాకు ఇష్టం. నేను ఆ కార్య‌క్ర‌మానికి అభిమానిని.ఈ మ‌ధ్య బుర్రాసాయి మాధ‌వ్ అనే ర‌చ‌యిత‌ను మ‌న ప్రియ‌త‌మ ఆర్కే ఇంట‌ర్యూ చేశారు.

స‌రే … ఆ కార్య‌క్ర‌మం పేరు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కావున ప్ర‌శ్న‌లు కాస్త చొర‌వ‌గా అడిగేస్తారాయ‌న‌. అస‌లు నాకు న‌చ్చే అంశ‌మే అది.ఏదో త‌న జీవిత విశేషాలు గ‌ట్రా గ‌ట్రా అడుగుతారు అట్టాగే త‌న సినిమా సంగ‌తులు … అక్క‌డ క‌ష్టాలు సుఖాలు అడుగుతార‌ని ఫిక్స్ అయి వ‌చ్చుంటారాయ‌న పాపం.

అయితే మా సారు … టిక్కెట్ల రేట్ల త‌గ్గింపు విష‌యంలో మీ అభిప్రాయం ఏమీ అని స్ట్రెయిట్ గా త‌న అజండా ప్ర‌శ్న‌ను సంధించేశారు. సార్ సినిమా టిక్కెట్ల రేట్లు త‌గ్గించినంత మాత్రాన ప్ర‌జ‌లు ధ‌న‌వంతులైపోరు అంటూ త‌న అభిప్రాయం చెప్ప‌బోయారు సాయిమాధ‌వ‌. చూడ‌క‌పోతే చ‌చ్చిపోరూ అని అందించారు మ‌న సారు. అవును చ‌చ్చిపోరు … అని సాయి మాధ‌వ కొన‌సాగారు. ఇది నాకు విప‌రీతంగా న‌చ్చింది.

మ‌ల్లీశ్వ‌రి సినిమాలో సుర‌భి క‌మ‌లాబాయి డైలాగు నాకెందుకులేమ్మా ఎవ‌రెట్టా పోతే నాకే … ఏదో ఆ సూర‌య్య కోడ‌లు ఇందాక సుబ్బ‌య్య కాకాహోట‌లు కాడ వెంక‌య్య కొడుకుతో స‌ర‌సాలు ఆడుతుంటే చూడ‌లేక ఏదో చెప్ప‌డానికి చూశాను త‌ప్ప నాకెందులేమ్మా … మ‌ళ్లీ నేనేదో తంపుల‌మారినంటారు. అంద‌రూ న‌న్న‌నేవాళ్లే … ఏం చేస్తాం … ఇట్టా అన‌మ‌నే దేవుడు న‌న్ను పుట్టించాడు …టైపులో సాగుతుంది … గురువుగారి వాగ్ధోర‌ణి.

ఎవ‌ర్ని ఇంట‌ర్యూలో కూచోపెట్టినా … అటుతిప్పీ ఇటు తిప్పీ … ఏపీ ప్ర‌భుత్వం చూశారూ … అన‌కుండా ఊరుకోడు కాక ఊరుకోడు … ఆ క‌మిట్మెంటు చూస్తే ముచ్చ‌టేస్తుంది. రామ్ గోపాల్ వ‌ర్మ భ‌లే దొరికాడు మొన్న … ఏదో పేర్నినానితో మాట్లాడొచ్చావ్ … నాలుగైదు ఆయ‌న అజ్ఞానం మీద జ‌గ‌న్ అన‌వ‌గాహ‌న మీదా మాట్లాడేయ్ … తొంద‌ర‌పెట్టినా వ‌ర్మ చ‌లించ‌డే. 

నేనే స్కీమ‌ర్ని నాకింకో స్కీమ‌రా అన్న‌ట్టు కోపం వ‌చ్చేసింది గురువుగారికి …ఆ విష‌యం క‌నిపెట్టిన వ‌ర్మ ఫోను చూసుకోవ‌డం మొద‌లెట్టాడు … అలా ర‌స‌వ‌త్త‌రంగా న‌డిచిందా ఎపిసోడు … ఓపెన్ హార్ట్ లో కామ‌న్ క్వ‌చ్చ‌న్స్ కొన్ని ఉంటాయి … ఎవ‌రొచ్చినా … ఏంటి మీరు అందులో డ‌బ్బులు పెట్టి నాశ‌నం అయిపోయారంట క‌దా … అన్నీ తెల్సి అలా పెట్టారు … సంపాదించ‌డం దాన్ని నిల‌బెట్టుకోవ‌డం తెలీని నీతో ఇంట‌ర్యూ చేస్తున్నాను చూశారా … నేనెంత అన్నంత‌గా సాగుతుందా చ‌ర్చ. 

ఈ సంపాద‌న ఆస్తిపాస్తుల‌కు సంబంధించిన విష‌యాలు మాట్లాడకుండా వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌డు … అంటే దాన్ని నాలాటి దుర్మార్గులు … చ‌వ‌క‌బారు వ్య‌వ‌హారం అంటారుగానీండి … త‌ప్పండి … అవ‌త‌లి వాడికి జ‌రిగింది అర్ధం చేయించి ..భ‌విష్య‌త్తులో సంపాదించ‌డానికి త‌గ్గ మోటివేష‌న్ ఇచ్చేంత‌గా అవ‌మానించి పంప‌డం మామూలు విష‌యం కాదు … దీన్ని అర్ధం చేసుకోక ఏదేదో మాట్లాడ‌తారు.

అయినా నాకెందుకులేమ్మా … ఏదో ఆ క‌ర‌ణం గారి అల్లుడు మున‌స‌బుగారి కూతురుకి చెరువొడ్డున బిందె సాయం చేస్తూన్న విష‌యం చెప్ప‌డం ఎంత త‌ప్పో నాకు మాత్రం తెలియ‌దేంటి? ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే క‌న్నా మంచి ప్రోగ్రాం తెలుగు టీవీ చ‌రిత్ర‌లో గ‌తంలో లేదు భ‌విష్య‌త్తులో రాదు … అదండీ విష‌యం మ‌ళ్లీ ట్యూబేసుకుని వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎపిసోడ్ చూడాలి ….అప్ప‌ట్లో హీరోయిన్ల మీద ఎంత ఖ‌ర్చైందో తెలుసుకోవాలి .. చాలా ప‌నుందండీ బాబూ … ఉంటా …
ఏమైనా ఆర్కే గారు కార‌ణ‌జ‌న్ములు …

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!