Taadi Prakash ………………………
Firebrand pathanjali’s first salvo!
చేవగల రచయిత కె. ఎన్. వై పతంజలి తొలి నవల “ఖాకీవనం” 1980 నవంబర్ లో అచ్చయింది. ఈనాడు మాసపత్రిక ‘చతుర’ లో వచ్చిన ఈ నవల పాఠకుల్ని ఆశ్చర్యపరిచింది. చతుర చకచకా అమ్ముడు పోవడంతో ఖాకీవనాన్ని మళ్ళీ ప్రింట్ చెయ్యాల్సివచ్చింది.
డిమాండ్ బాగా ఉండడంతో రెండోసారి కూడా ప్రింట్ చేశారని నాకు గుర్తు.అపుడు చతుర ఎడిటర్ చలసాని ప్రసాదరావుగారు. 1975-80…ల్లో మధ్యతరగతి జీవితాలు,ప్రేమ, కన్నీళ్ళు, సెక్సు,క్రైమ్, దెయ్యాలు, కాష్మోరాలు,క్షుద్రపూజలతో వచ్చి పడుతున్న నవలల మధ్య పతంజలి “ఖాకీవనం” బాంబ్ షెల్ లా పేలింది. రచయితలు ఉలిక్కిపడ్డారు.
అప్పటికి పతంజలి కొన్ని కథలు మాత్రమే రాసి వున్నారు. ఆయన తెచ్చిన చిన్న కథాసంకలనం పేరు “దిక్కుమాలిన కాలేజీ” (1976).మన పోలీసు వ్యవస్థ దుర్మార్గాన్ని ఉతికి ఆరేసిన తొలి నవల ‘ఖాకీవనం’. హృదయంలేని ఖాకీతనాన్ని లాగి లెంపకాయ కొట్టినట్టూ, నిరంకుశాధికార పోలీసు చట్రాన్ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పేల్చిపారేసినట్టూ అనిపిస్తుంది ఖాకీవనం చదువుతుంటే. 1952 మార్చిలో పుట్టిన పతంజలికి ఖాకీవనం రాసేనాటికి 27 ఏళ్లవయసు.’ఈనాడు’లో జర్నలిస్ట్.
*** ***
ఖాకీవనం నవల ఇలా మొదలవుతుంది “ఒరే” అని పిలిచింది కొత్త ఎస్.పీ భార్య. సుందరయ్య తుళ్ళిపడి చూసాడు. “ఇప్పుడే వస్తానని వెళ్లిన ఆ పని లంజ అదే పోత పోయినట్టుంది.ఈ దిక్కుమాలిన వూరిలో మరో ముండే దొరకలేదా మీకు? మీ అయ్యగారికి ?” దాని గుండెలమీద తన్ని తగిలేసి మరోదాన్ని తీసికిరండి…ఇదిగో చంటిది దొడ్డికి కూచున్నట్టుంది… కాస్తకడిగీ…”అని చెప్పి ఆవిడ విసవిసలాడుతూనే లోపలికి వెళ్ళిపోయింది.
సుందరయ్య కొయ్యబారిపోయాడు. చారల టోపీతో పాటు బుర్రని కూడా వీధి వరండాలోనే జాగ్రత్త చేసి రానందువల్ల, పళ్ళబిగువున కదిలి ‘అమ్మగారు’ చెప్పిన పని పూర్తిచేసి పెరటిలోంచి చుట్టూ తిరిగి వీధిలోకి వచ్చాడు.ప్రహరీగోడకు ఆనుకొనివున్న నీలగిరి చెట్టుకింద ఆర్డర్లీ కానిస్టేబుల్స్ నించొని ఉన్నారు.
సుందరయ్య అక్కడికి చేరుకున్నాడు. “ఈవిడగారికి ఒళ్లంతా కొవ్వేన్రా బాబూ.పనిమనిషి రాలేదని పిల్లముండ ముడ్డి నాచేత కడిగించింది. ఆ ఎస్.పీ. నంజికొడుకుని చెప్పుచ్చుకుని కొడితే ఆడి పెళ్ళానికి బుద్దొస్తుంది.” సుందరయ్య చాలా కోపంగా…ఎంత విసురు! ఎంత దురుసు! ఇంత మోటుగా,ఇంత ‘అమర్యాదకరంగా’ మొదలవుతుంది నవల. మొదటి రెండు మూడు పేరాలతోనే పాఠకుణ్ణి పడగొట్టేస్తాడు పతంజలి. ఈ120 పేజీల నవల ఇదే దూకుడుతో,ఖాకీల దుమ్మురేపుతూ సాగి పోతుంది.మనకి ఊపిరి సలపనివ్వదు. పోలీసు అధికార్లకి నిద్రపట్టనివ్వదు కూడా!
*** ***
అప్పట్లో రెండు రాష్ట్రాల్లో పోలీసులు తిరగబడ్డారు.సమ్మెకట్టారు.ప్రభుత్వాలు గడగడలాడిపోయాయి.ఈ చారిత్రాత్మక సమ్మె పతంజలి ఖాకీవనం రాయడానికి కారణం అని అనుకుంటాను. “లోయర్ కేడరంతా ఇవ్వాళ లోడుచేసిన తుపాకీలాగ పేలడానికి సిద్ధంగా ఉంది” అని రాసారు రచయిత.
*** ***
1978 ఫిబ్రవరిలో నేను విశాఖ ‘ఈనాడు’లో జాయిన్ అయినప్పుడు పతంజలి నా సీనియర్.78 చివరిలో ఆర్టిస్ట్ మోహన్ విశాఖ వచ్చాడు.నన్ను కలవడానికి ‘ఈనాడు’ ఆఫీసుకు వచ్చాడు.అప్పుడు సీతమ్మధారలో ‘ఈనాడు’ ఎదురుగా ఉండే టీకొట్టులో మోహన్ని, పతంజలికి పరిచయం చేశాను.
1979 చివరిలో కావచ్చు.పతంజలిని విజయవాడ ‘ఈనాడు’ కి పంపించారు.ఆ సంవత్సరం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ నవలల పోటీకి…అంటూ‘ఖాకీవనం’, విశాలాంధ్రలో పనిచేస్తున్న మోహన్ చేతికిచ్చారు పతంజలి. చదివి బాగా ఇంప్రెస్ అయిన మోహన్,అప్పటి పబ్లిషింగ్ హౌస్ సూపర్ బాస్ పి.సి.జోషి గారికి ఇచ్చాడు.
జోషీ, కేతు విశ్వనాథరెడ్డి,తుమ్మల వెంకట్రామయ్య గార్లు,అమర్యాదకరమైన,మొరటు భాషలో, వ్యవస్థ మీద మెరుపుదాడి లాంటి ‘ఖాకీవనం’చదివి తట్టుకోలేకపోయారు.వాళ్ళ సున్నితమైన హృదయాలు గాయపడి ఉండొచ్చు. పతంజలి నవలని తిరస్కరించారు. ఆ సంవత్సరం మొదటి బహుమతి, కేశవరెడ్డి నవల :’స్మశానం దున్నేరు’ కి దక్కింది. తర్వాత ‘చతుర’ లో వచ్చిన ఖాకీవనం, పతంజలి అనే ఫైర్ బ్రాండ్ రచయితని పరిచయం చేసింది.
*** ***
1982లో వచ్చిన ‘ఈనాడు’ తిరుపతి ఎడిషన్ కి ప్రమోషన్ మీద,విజయవాడ నుంచి పతంజలలి .. విశాఖ నుంచి నేనూ వెళ్లాం.రేణిగుంటలో పత్రికాఫీసు. నేను బాధ్యతగా పేపర్ చూసుకుంటాననే భరోసాతో, ‘ఈనాడు’ ఆఫీసులోనే,డ్యూటీ టైంలోనే పతంజలి, రెండో నవల ‘పెంపుడు జంతువులు’ రాశారు.
యాజమాన్యం అడుగులకు మడుగులొత్తే వెన్నెముకలేని జర్నలిస్టులని హేళన చేసిన పదునైన రచన అది.అప్పుడే, అక్కడే ఆయన ‘రాజుగోరు’ నవల కూడా రాశారు.ఈ రెండు నవలల రాతప్రతులకు తొలిపాఠకులం నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, నేనూ. రేణిగుంటలో చింత చెట్లకింద టీలు తాగిన సాయంకాలాలు, వెన్నెల్లో జనసంచారం లేని ఆ తార్రోడ్డు మీద నడిచిన రాత్రులూ… మాటలన్నీ పరుగెత్తించే ఈ నవలల గురించే .. జోకులన్నీ పతంజలి వాక్యాల మీదే!
Pl. Read it Also ……………….. “ఖాకీవనం” బాంబ్ షెల్ లా పేలింది ! (2)