రమణ కొంటికర్ల……………………………………………
An unselfish man………………. గంగా,భగీరథ నదుల ప్రక్షాళన కోసం మరణానికి కూడా జడవకుండా పోరాటం చేసిన యోధుడు ఆయన. ఏకంగా 112 రోజుల ఆమరణ దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు.కాన్పూర్ లో ఐఐటీ ప్రొఫెసర్ గా పని చేశారు. నిజమైన పర్యావరణ ప్రేమికుడు ఆయన. నదుల ప్రక్షాళన కోసం దీక్ష తీసుకుని పోరాటం చేశారు. ఆయనే జీ. డీ. అగర్వాల్ అలియాస్ స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్.
కాన్పూర్ ఐఐటీలో పర్యావరణ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న జీ.డీ. అగర్వాల్..2011లో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో మాత్రిసదన్ ఆశ్రమంలో సన్యాసాన్ని స్వీకరించి జ్ఞానస్వరూప్ సనంద్ స్వామిగా మారారు. మాత్రిసదన్ గంగా పరిరక్షణ కోసం 1998 నుంచి పూర్తిగా గాంధేయ మార్గంలో పోరాడింది. గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకించింది. మైనింగ్ కార్యకలాపాలను నిషేధించాలన్నదే మాత్రిసదన్ పోరాట లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా జ్ఞాన్ స్వరూప్ సనంద్ అడుగులు వేశారు.
పవిత్ర గంగాజలాలను శుద్ధి చేస్తూ… ఆనకట్టల నుంచి గంగను కాపాడేలా ఓ చట్టాన్నే తీసుకురావాలని కొట్లాడిన వ్యక్తి ఈ సనంద్. జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ ప్రాంతంలో 6500 కోట్ల రూపాయలతో నిర్మించిన మల్టీ మోడల్ వాటర్ వేస్ టెర్మినల్ తో… 485 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అలాగే హల్దియా-వారణాసి లోతట్టు జలమార్గ ప్రాజెక్ట్ మార్గ నిర్మాణం కారణంగా తాబేళ్ల ఏకైక పరిరక్షణ ప్రాంతంగా పేరుగాంచిన వారణాసి తాబేళ్ల అభయారణ్యానికీ పర్యావరణ పరంగా నష్టం చేకూరుతుందని ఆయన పోరాటం చేశారు.
గంగా మైదాన తీర ప్రాంతంలో నివశిస్తున్న ప్రజలు 2014 ఎన్నికల సమయంలో నాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని నమ్మారు. గంగానదిని ప్రక్షాళన చేస్తానన్న ఆయన మాటలు బుట్ట దాఖలై పోయాయి. ఆ గంగలో ఇప్పుడు క్రూయిజ్, కార్గో షిప్పులు నడుస్తున్న పరిస్థితి… దానివల్ల అక్కడి జీవావరణ పరిస్థితులు తింటున్నాయి. మత్స్యసంపద తమ సంపదగా ఉపాధి సాగిస్తున్నవారి జీవనోపాధి కోల్పోయిన దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు స్వామి జ్ఞానస్వరూప సనంద్.
2018 ఫిబ్రవరి నుంచి గంగా పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రాజెక్టులను ఆపేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ జ్ఞానస్వరూప సనంద్ పలు లేఖలు రాశారు. దేశ ప్రధాని మోడీని తమ్ముడు అని సంబోధిస్తూ…గంగమ్మ కొడుకుగా అభివర్ణిస్తూ … గంగా పరిరక్షణ మీ బాధ్యత అని గుర్తు చేస్తూ మూడు లేఖలు రాశారు. 2014 ఎన్నికల సమయంలో గంగా పరిరక్షణ బాధ్యత నాదే అని చెప్పి… ఇప్పుడు మీరేం చేస్తున్నారంటూ మోడీని సూటిగా ప్రశ్నించారు సనంద్.గంగను జాతీయ జలమార్గంగా ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ యోచనను తప్పుబట్టారు. అది వైవిధ్య జాతుల మనగడకు ప్రమాదమని హెచ్చరించారు. అది కేవలం కార్పోరేట్ల ప్రయోజనాల కోసమే కదా అని సూటిగా ప్రశ్నించారు.
స్వామి సనంద్ మరణం తర్వాత మోడీ నిట్టూర్పులు విడిచారు కానీ ఆ లేఖలకు జవాబు మాత్రం ఇవ్వలేదు. సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అనే ఎన్జీవో కార్యకర్త ఉజ్జవాల్ కృష్ణాని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు తర్వాత కేంద్రం స్పందించింది. 2018 జూన్ 13, జూన్ 23 తేదీల్లో ప్రొఫెసర్ అగర్వాల్ నుంచి ప్రధానికి లేఖలు అందినట్టు పీఎంవో స్వయంగా పేర్కొంది.
స్వామి జ్ఞానస్వరూప సనంద్ 112 రోజుల దీక్షతో కేంద్రానికి చెడ్డ పేరు వస్తోందని…కేంద్ర సర్కార్ ఉమాభారతి, నితిన్ గడ్కరీలను పంపింది.చివరగా 2018 అక్టోబర్ 9వ తేదీన రమేష్ పోఖ్రియాల్ వచ్చి స్వామి తో చర్చలు జరిపారు. కేంద్ర వైఖరిలో మార్పు రానంతవరకూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనన్నారు స్వామి. పోక్రియాల్ చర్చల మరుసటి రోజే ఆయన్ను మాత్రిసదన్ నుంచి రిషీకేష్ లోని ఎయిమ్స్ కి తరలించారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. చిత్తశుద్ధితో నదుల పరిరక్షణ కోసం అంతగా పోరాటం చేసిన వారు మరొకరు లేరు.