ఇది మరో ఆలయం మసీదు వివాదం. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపీ మసీదు సర్వేను నిలిపివేయాలని అలహాబాద్ కొద్దీ రోజుల క్రితం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్ విచారణ జరిపిన దరిమిలా అలహాబాద్ హైకోర్టు ఈ స్టే విధించింది. వారణాసిలో కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే జ్ఞానవాపీ మసీదు ఉంది. గతంలో ఇక్కడ ఉన్న ఆలయం కూల్చి మసీదు నిర్మించారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి.
ఈ వివాదం ఈనాటిది కాదు. మసీదు నిర్మించిన ప్రాంతంలో ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని ఏప్రిల్‌లో వారణాసి కోర్టు ఆదేశించింది. వారణాసి కోర్టు తీర్పును సున్నీ వక్ఫ్ బోర్డు హైకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌ను విచారించి సర్వే నిలిపి వేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారణాసి లోని కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత జ్ఞానవాపి మసీదు ను నిర్మించారని కోర్టులో పిటీషన్ వేసిన విజయ్ శంకర్ రస్తోగి అంటున్నారు. మసీదు ఉన్న భూమి హిందువులకు చెందినదని పిటిషనర్ల వాదన. ఈ ప్రదేశం వాస్తవానికి కాశీ విశ్వనాథ్ దేవాలయానిదే అని చెబుతున్నారు. పదహారవ శతాబ్దం చివరలో నారాయణ భట్ట తోడార్ మాల్ ఈ ఆలయాన్ని నిర్మించారని అంటున్నారు. కూల్చిన ఆలయం తాలూకు అసలు గోడ ఇప్పటికీ మసీదులో ఉందని పిటీషనర్లు వాదిస్తున్నారు.
అదలా ఉంటే మరాఠా పాలకుడు మల్హర్ రావు హోల్కర్ (1693-1766) ఆ మసీదును కూల్చివేసి, అక్కడే విశ్వేశ్వర్ దేవాలయాన్ని పునర్నిర్మించాలని అనుకున్నారు.కానీ ఎందుకో నిర్మాణం జరగలేదు. ఆ తర్వాత 1780 లో ఆయన కోడలు అహల్యాబాయి హోల్కర్ మసీదు ప్రక్కనే ప్రస్తుత కాశి విశ్వనాథ్ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయానికి మసీదు కి మధ్యలో ఉన్న బావికి “జ్ఞానవాపి” (వెల్ ఆఫ్ నాలెడ్జ్) అని పేరు పెట్టారు.
స్థల వివాదం ఏర్పడిన కొత్త ల్లో మత సామరస్యం లో భాగంగా జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లిం పక్షం కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల భూమిని అప్పగించింది. జ్ఞాన్‌వాపి మసీదు ప్రక్కనే ఉన్న భూమి కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్‌కు బదిలీ చేశారు. ఇందుకు బదులుగా దేవాలయ పరిపాలన విభాగం జ్ఞాన్‌వాపి మసీదు కి 1000 చదరపు అడుగుల భూమిని ఇచ్చింది.
ఈ విషయం ఇంకా కోర్టులో ఉంది. ప్రభుత్వం కారిడార్ నిర్మిస్తోంది, వారు భూమిని సేకరించాలని కోరుతున్నారు.1700 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించే నిర్ణయాన్ని కూడా బోర్డు అంగీకరించింది. ఇది జరుగుతుండగానే వారణాసి కోర్టు మసీదు ఆర్కియాలజీ సర్వేకు అనుమతించింది. అయితే జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ హైకోర్టులో సర్వే కు అభ్యంతరం చెప్పింది. కాశ్ విశ్వనాథ్ దేవాలయం .. జ్ఞాన్వాపి మసీదు మధ్య కొనసాగుతున్న వివాదాన్ని కోర్టు విన్నది, పురావస్తు నిపుణులతో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. వారణాసి కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా సున్నీ వక్ఫ్ బోర్డు హైకోర్టును ఆశ్రయించగా స్టే మంజూరు అయింది.ఇది ఎప్పటికి తేలుతుందో ?