Taadi Prakash……………………………………….
2001 నవంబర్ 11న మోహన్ ఈవ్యాసం రాశాడు. చాలా ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి….
ఒకరోజుతో, ఒకసారితో అయిపోలేదది. జనరల్ పినోచెట్ గన్ చూపి చిలీని ఇరవయ్యేళ్లు నిత్యం రేప్ చేశాడు. ఈ రెండు దశాబ్దాలుగా పినోచెట్ నరమేధం అవిచ్చిన్నంగా సాగటానికి నిక్సన్ నుంచీ నేటివరకూ మారిన అమెరికన్ ప్రెసిడెంట్లు, సీఐఏ, బహుళజాతి కార్పొరేషన్లు హామీ ఇచ్చాయి. అవి పినోచెట్ చుట్టూ జీవితబీమా లాగా వంద చేతులు అడ్డుపెట్టి కాపాడుతున్నాయి. చిలీ రక్తస్రావానికి హామీనిచ్చి కాపలా వున్నాయి.
కొద్దిరోజులకే పాబ్లోనెరూడా వార్తలొచ్చాయి.
అనారోగ్యంతో మంచంపట్టిన నెరూడాని ఈ ఘోరం కలిచేసింది. మరణశయ్య మీద నుంచే ఆఖరి కవిత రాశాడు – “శిక్షించాలంటున్నా” అనే శీర్షికతో. “నిక్సన్, ఫ్రై, పినోచెట్” లను “ఇక్కడే ఈ చౌకులోనే ఉరితియ్యా” లని నెరూడా కవిత గావుకేక పెట్టింది. ( వార్తల్లో వచ్చిన ఈ కవితను మా యువకవి తెలుగు చేస్తే అచ్చు వేశాం కూడా ) అంతలోనే ఆయన మరణ వార్త. కర్ఫ్యూ లో కదిల్తే, కనిపిస్తేనే ఖతమయ్యే భీతావహం మధ్య నెరూడా అంతిమయాత్ర జరిగింది. ఇద్దరు, ముగ్గురితో మొదలైన ఈ కన్నీటి యాత్ర కొన్ని వందల మందితో ముగియటం గొప్ప ధిక్కారంగా నిలిచింది.
మన గద్దర్ లాటి చిలీ జానపద గాయకుడు, కవి విక్టర్ జారాని నేషనల్ స్టేడియంలో చిత్రహింసలు పెట్టి చంపారు. ఉద్యమకారుల్ని, అమాయక జనాన్ని పెట్టిన హింసలు, కరెంట్ షాకులు, సామూహిక అత్యాచారాలు – పుస్తకాలుగా, డాక్యుమెంటరీలుగా , సినిమాలుగా వచ్చాయి. కోస్టా గవరస్ సినిమా “మిస్సింగ్” గుర్తుందా? స్టేడియం అండర్ గ్రౌండ్ టన్నెల్ లో ఒక మనిషి బట్టలన్నీ విప్పి, వీపు మీద తుపాకీ మడమలతో కొట్టి ముందుకు తొయ్యగానే అవతల పెద్ద బాంబు పేలుడు.మిలటరీ అధికారంలో స్థిరపడి కొద్దిరోజులైన తరువాత ప్రజలంతా జైళ్లలో, ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నపుడు ఒకరోజు దేశమంతటా రేడియోలో సాల్వడార్ అలెండీ ఆఖరి ప్రసంగం ప్రసారమయింది.
సైన్యం ట్యాంకులతో, తుపాకుల్తో రేడియో స్టేషన్ ని చుట్టుముట్టేసరికే ఆ ప్రసారం చేసిన హీరో అనౌన్సర్ ఎవ్వరికీ కనిపించకుండా తప్పించుకున్నాడు. ఇలాటి సాహసాలు ఎన్నో! ఆ కాలంలో ఎంతోమంది చిలీ నుంచి పారిపోయారు. అమెరికా, యూరప్, బ్రెజిల్, అర్జెంటీనాల్లో తలదాచుకున్నారు. కానీ అక్కడ కూడా వాళ్ళ ఆచూకీ కనుక్కొని, కిరాయి హంతకులతో చంపించడానికి సీఐఏ ఎడతెగని కృషి చేసింది. పాపులర్ ఫ్రంట్ మిలిటరీ జనరల్ రెనే ష్నీడర్ హత్య ఈ వరసలోదే.
ప్రవాసం వచ్చిన అలెండీ భార్య హార్టెన్సియా బుస్సీ అలెండీ తన కూతురుతో సహా యూరప్, సోవియట్ యూనియన్ లు తిరిగింది. చిలీ కన్నీటి కథలని వినిపించింది. ఢిల్లీ, హైదరాబాద్ సభల్లో మాట్లాడింది. విజయవాడలో పెద్ద బహిరంగ సభ. అందరం కలిసి వెళ్లాం. తర్వాత ఆవిడ వెంటే గుంటూరు కూడా వెళ్లాం. చిలీ తల్లుల, భార్యల, కూతుళ్ళ కన్నీళ్ళని తడిమి చూపిందామె. సెంటిమెంటల్ గా చెప్పలేదు. గంభీరంగా వుంది. రాజకీయ స్పష్టతతో మాట్లాడింది. ఆవిడ గొంతులో విషాదాన్ని దాటిన పేద దేశాల కృతనిశ్చయం వినిపించింది.
ఇంతలో మరో కబురు. చిలీలో పెద్ద నాయకుడైన కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీ లూయీ కోర్వీలాన్ కొడుకు నిర్బంధంలో ఉన్నాడు. సైన్యం అతన్ని చిత్రహింసలు పెడుతోంది. యూరప్ లో, లాటిన్ అమెరికాలో అతని విడుదల కోసం ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచ వ్యాపితంగా వత్తిడి వచ్చింది. మిలిటరీ అతన్ని వదిలిపెట్టింది. పారిస్ ప్రెస్ కాన్ఫరెన్సులో ఆ టీనేజ్ కుర్రాడు తన మెడ మీదా, తొడల మీదా, వెన్ను పైనా వున్న గాయాలన్నీ చూపించాడు. రోజులతరబడి జరిగిన చిత్రహింసల గురించి వివరంగా చెప్పాడు.
పాపులర్ ఫ్రంట్ ప్రభుత్వం వు న్నపుడు అమెరికా నుంచి ఏంజెలా డేవిస్ ( నీగ్రో ఉద్యమ నాయకురాలు, కమ్యూనిస్ట్. తప్పుడు కేసులు బనాయిస్తే పోరాడి విడుదల సాధించింది ) చెల్లెలు చిలీ వచ్చింది. టీనేజ్ పిల్లల పెయింటింగ్ ఉద్యమం ప్రారంభించింది. శాంటియాగో వీధుల్లో, గోడలపైనా పంచరంగుల్లో కొత్తరకం పెయింటింగ్లు వేసి అందులో స్లోగన్లు, కవితలూ రాసింది. త్వరలోనే ఈ ఉద్యమం శాంటియాగో నుండి వాల్పరాయిజో వరకూ పాకి, చిలీ వీధులూ, గోడలూ కొత్తగా వెలిగాయి. సైన్యం అధికారంలోకి వచ్చాక ఇవన్నీ చెరపడం వాళ్ళకి పెద్ద పనయ్యింది.
ఈ సెప్టెంబర్ 11 ఘోరం ఒక్క చిలీకేనా జరిగిందీ అంటే లాటిన్ అమెరికాలో అందరికీ జరిగింది. బొలీవియా, పనామా, నికరాగ్వా, ఎల్ సాల్వడార్, మెక్సికో, గ్వాటిమాలా – ఎన్ని పేర్లు చెప్తామ్? అన్ని దేశాల్లోనూ హ్యూగో బాంజర్, ఫ్రై, సామోజో ల్లాంటి అడవి మనుషుల్ని మాన్యుఫ్యాక్చర్ చేసింది అమెరికా. అక్కడి రాగి గనుల కోసం, టెలిఫోన్ల కోసం – ఏ మల్టీ నేషనల్ కార్పొరేషన్ దేని మీద మోజు పడితే దాన్ని అందించడం కోసం ఒక్కో దేశానికీ పదీ పరకా “సెప్టెంబర్ 11” లను కూడా సప్లై చేసింది.
ఇదొక్క లాటిన్ అమెరికాకేనా అంటే ఆఫ్రికాలో అంతర్యుద్ధాలు తెచ్చి మిలియన్ల మందిని పశువుల్లా నరికింది. కాంగో ప్రజల బిడ్డ పాట్రిస్ లుముంబా తన సొంత దేశంలోనే ఐరాసా సైన్యం (అంటే అమెరికా సైన్యం) వెంటబడుతుంటే ఎక్కడెక్కడికో పారిపోయి, చివరికి పట్టుబడి, చిత్రహింసలపాలై చనిపోయాడు. ప్రెసిడెంట్ కెనెడీ వియత్నాం యుద్ధంతోను, మార్లిన్ మన్రోతోనూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కాంగో గురించి శ్రద్ధ తీసుకుని ఈ హత్యకి ఆర్డర్ చేశాడు.
పైన పశ్చిమాసియా నుంచి కింద దక్షిణాఫ్రికా వరకూ ఈ పేద దేశాలకు అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, హాలెండ్, పోర్చుగల్ లు దయతో ప్రసాదించిన “సెప్టెంబర్ 11” లు డజన్లు. పాతికేళ్ల వియత్నాం యుద్ధంలో అమెరికా అధ్యక్షులంతా వరసగా వంతులేసుకుని అందించిన మైలాయ్, సాన్ మై నరమేధాలు, హైఫాన్గ్, క్వాంగ్ట్రీ, హనోయ్ ల మీద బీ – 52 బాంబుల వానలు, మీకాంగ్ నది వెంట వరిపొలాల్లో, అరటి తోటల్లో, వెదురు వనాల్లో కక్కిన విషమంతా నిత్య “సెప్టెంబర్ 11” లనిచ్చింది.
ఈ అనాగరిక, అశ్వేత, పేద, మురికి ఖండాలని “సివిలైజ్” చేయడానికి అమెరికా అపారమైన నెత్తురు పెట్టుబడి పెట్టింది. దాని లాభంగా మొన్న ఒక్కసారి రెండు భవంతులు కూలినందుకు నాగరికత మీదే యుద్ధం మొదలయిందని గుండెలు బాదుకుంటోంది. ఇదికూడా దొంగ ఏడుపే. వియత్నాంలో అమెరికన్లు వేల సంఖ్యలో చనిపోయినా అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏనాడూ లెక్కచేయలేదు. అప్పుడు కమ్యూనిజం వంక చూపింది. మార్కెట్లు, పెత్తనం కోసం యుద్ధాలు చేయటం, మనుషుల్ని చంపడం అమెరికా ఎన్నటికీ మానుకోలేని అలవాటు. రాకరాక న్యూయార్కు కి ఒక సెప్టెంబర్ 11 వచ్చింది. కానీ మన పేద దేశాలకిలాంటివి నూటా పదకొండు.
Read it also……...ఇది మరో సెప్టెంబర్ 11 కథ . .చిలీ లో నరమేధం! (1)