ఒకే జిల్లా.. కానీ పూర్తి కాలం పదవిలో కొనసాగని సీఎంలు!

Sharing is Caring...

కర్ణాటక రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని అవకాశం శివమొగ్గ జిల్లాకు దక్కింది. శివ మొగ్గ నుంచి నలుగురు నాయకులు ముఖ్యమంత్రులయ్యారు.యడియూరప్ప అయితే ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం విశేషం. ఆయనతో పాటు కడిదాల్ మంజప్ప,ఎస్. బంగారప్ప, జె.హెచ్ పటేల్ సీఎం లుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.తమాషా ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరూ కూడా పూర్తికాలం (5 ఏళ్ళు ) కొనసాగలేదు. ఏదో ఒక కారణంగా మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది.

కడిదాల్ మంజప్ప అయితే మరీ తక్కువ కాలం పదవిలో ఉన్నారు. 1956 ఆగస్టు 19 న మైసూరు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఆయన అదే ఏడాది అక్టోబర్ 31 వరకు మాత్రమే సీఎం గా ఉన్నారు. కేవలం 73 రోజులు మాత్రమే సేవలందించారు. మంజప్ప అసలు సిసలు గాంధేయ వాది .  మైసూర్ ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం స్వల్పమే అయినప్పటికీ  ప్రభుత్వ విధానాలలో మార్పులు తీసుకొచ్చారు.  సాగుదారుల హక్కుల గుర్తింపు, అద్దె చట్టం  ఇనామ్ నిర్మూలన చట్టం .. భూసంస్కరణలు తీసుకొచ్చారు.

ఆ తర్వాత కాలంలో బంగారప్ప 1990 అక్టోబర్ 17 న ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 92 నవంబర్ 19 న కాంగ్రెస్ అధిష్టానం పదవి నుంచి తప్పించింది. కావేరి అల్లర్ల ను నియంత్రించలేని నేపథ్యంలో బంగారప్ప పదవి కోల్పోయారు. తర్వాత ఒకటి రెండు పార్టీలు పెట్టారు. కొన్నాళ్ళు బీజేపీలో కూడా ఉన్నారు.

చెన్నగిరి సింగంగా పేరొందిన జె.హెచ్‌.పటేల్‌ సీనియర్ రాజకీయ నాయకుడు. రామకృష్ణ హెగ్డే .. SR బొమ్మాయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు 1994 లో జనతాదళ్ హెచ్‌డి దేవెగౌడ నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు . 1996 లో గౌడ ప్రధాని పదవికి ఎంపికయ్యాక  ఆయన వారసుడయ్యాడు.1996 మే 31 నుంచి  1999 అక్టోబరు 7 వరకు మాత్రమే పటేల్ సీఎం పదవిలో కొనసాగారు.

ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప నాలుగు సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నారు. అయితే ఏ ఒక్కసారి ఆయన పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. 2007 లో ఏడురోజులు , 2008 లో మూడు సంవత్సరాలు , 2018లో రెండ్రోజులు, 2019 జులై 26 న పదవీ బాధ్యతలు స్వీకరించి 2021 జులై 26న రాజీనామా సమర్పించారు. యడియూరప్ప ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాలేజీ రోజులనుంచి  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ తో అనుబంధం ఉన్నది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!