అమెరికా ప్రతీకారానికి 80 ఏళ్ళు !

Sharing is Caring...

Destruction with a nuclear attack……………

అమెరికా చేసిన ఆ దారుణం తలచుకుంటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 80 ఏళ్ళ క్రితం అణు బాంబులు విసిరి లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఆ పాపం ఇంకా అమెరికాను వెంటాడుతూనే ఉంది. నాటి జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు.

1945 లో సరిగ్గా ఆగస్టు ఆరు,తొమ్మిది తేదీల్లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు లు విసిరి లక్షా నలభై వేల మందిని అమెరికా బలి తీసుకుంది.ఈ అణుబాంబుల దాడిలో పసిబిడ్డలు,యువకులు,మహిళలు,వృద్ధులు నిమిషాల్లో మాడి మసి అయిపోయారు.

భవనాలు, ఇళ్ళు నేలమట్టమై పోయాయి. కర్మాగారాలు కూలిపోయాయి. క్షణాల్లో నగరాలన్నీశ్మశానాలుగా మారిపోయాయి.ఈ దాడులు జరిగి 80 ఏళ్ళు గడిచినా నాటి చేదు జ్ఞాపకాలు జపాన్ ప్రజలను వణికిస్తుంటాయి.

అణుబాంబుల వల్ల ఇప్పటికే ఆ ప్రాంతంలో పంటలు సరిగ్గా పండటం లేదు. ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాటి దాడి వలన రేడియేషన్, కాలిన గాయాలు ప్రజలకు బతికుండగానే నరకం చూపించాయి.అలాంటి భీకర విధ్వంసం నుంచి  జపాన్ కోలుకోగలిగింది అంటే అక్కడి ప్రజల… పాలకుల పట్టుదల, అంకిత భావం అని చెప్పుకోవాలి. నిజంగా అదో గొప్ప విషయమే.

1945 లో రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉంది. జపాన్ బేషరతుగా లొంగిపోవాలని లేకుంటే భారీ వినాశనం చూడాల్సి వస్తుందని  అమెరికా హెచ్చరించింది.అయితే జపాన్ ఆ బెదిరింపులకు లొంగలేదు. పట్టుదలకు పోయింది. దీంతో అమెరికా అణుబాంబు ప్రయోగించింది.

ఆ బాంబు పడగానే జపాన్ మొత్తం భూకంపం వచ్చినట్లు గజగజ వణికి పోయింది. హిరోషిమాలో ఉష్ణోగ్రత పది లక్షల సెంటీగ్రేడ్ కి చేరుకుంది. అంతటి వేడి ఫలితంగా మనుషులు క్షణాల్లో మాడి మసై పోయారు. పదమూడు కిలోమీటర్ల పరిధిలో ఈ దారుణ విధ్వంసం చోటు చేసుకుంది. అయినప్పటికీ జపాన్ లొంగుబాటును ప్రకటించలేదు.

దీంతో రెచ్చిపోయిన అమెరికా మొదటి షాక్ నుంచి తేరుకోక ముందే నాగసాకి పై మరో అణు బాంబు విసిరింది.ఆ బాంబు దెబ్బకు ఆ రెండు నగరాల్లో మొత్తం లక్షా నలభై వేల మందికి పైగా ప్రజలు, సైనికులు చనిపోయారు.తదనంతర కాలంలో మరికొందరు చనిపోయారు.

రెండోమారు దాడి జరిగాక నష్టాన్ని గుర్తించిన జపాన్ అమెరికాకు తల వంచింది.పెరల్ హార్బర్ పై దాడి జరిపామని సంబర పడిన జపాన్ కి కొంత కాలం తర్వాత అమెరికా పెను విషాదాన్ని అణుబాంబు రూపేణా అందించింది.

ఇక ‘పెరల్ హార్బర్’అనేది హవాయిలోని అమెరికన్ నౌకా స్థావరం.. జపాన్ చేసిన దాడిలో అనేక అమెరికన్ నౌకలు, విమానాలు ధ్వంసమయ్యాయి.వేలాది మంది అమెరికన్లు మరణించారు. జపాన్ జరిపిన ఆకస్మిక దాడికి అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. ఈ ప్రతీకార జ్వాలలకు  లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
నాడు అమెరికా విసిరిన న్యూక్లియర్ ఆయుధాలు అధిక మొత్తంలో రేడియేషన్ విడుదల చేశాయి.  

ఆ ప్రభావం దీర్ఘకాలం పాటు కొనసాగింది. జపాన్‌ లొంగిపోయిన తర్వాత అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలలో రెండురోజుల పాటు విజయోత్సవాలు జరుపుకున్నారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా హ్యారీ ట్రూమన్‌ ఉన్నారు. జపాన్ దాదాపు 20 ఏళ్ళ తర్వాత కొంత మేరకు కోలుకోగలిగింది.

 

————-KNM

 

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!