Thrilling experience!………………….
ఒక థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే పంబన్ రోడ్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే. రోడ్ బిడ్జి పై మనం రెండు పక్కలా సముద్రం. గోదావరి వంతెన పై ప్రయాణం చేస్తే చుట్టూ నదిని చూస్తాం. ఒక్కోసారి నది పూర్తిగా కనిపించకపోవచ్చు. ఇక్కడ అలా కాదు. సముద్రం కాబట్టి ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. సమాంతరంగా కొంచెం దూరంలో రైల్వే వంతెన. అదొక ఇంజనీరింగ్ అద్భుతం.
ఇంతకూ ఈ పంబన్ బ్రిడ్జి ఎక్కడుందంటే తమినాడులో రామేశ్వరం వెళ్లే దారిలో ఉంది. సముద్రం లోకి పిల్లర్లు వేసి ఈ వంతెన ను నిర్మించారు. ఒక గొప్ప నిర్మాణం గా చెప్పుకోవాలి. మధురై వెళితే అక్కడ నుంచి రామేశ్వరం కూడా చూసి రావచ్చు. తప్పక చూడాల్సిన క్షేత్రం అది.
దారి మధ్యలో ఈ పంబన్ రోడ్ వంతెన వస్తుంది.ఆ వంతెన మీదుగానే ప్రయాణం సాగుతుంది. సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర సముద్రం పై నిర్మించిన వంతెన మీద ప్రయాణం మధురానుభూతిని అందిస్తుంది. ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. అలాంటి థ్రిల్ సొంతం చేసుకోవాలంటే పంబన్ బ్రిడ్జి మీద ప్రయాణం చేయాల్సిందే.
రెండు పక్కలా సముద్రం ..సముద్రం పై బ్రిడ్జి ..ఆ బ్రిడ్జి మీద కారులో ప్రయాణం చేస్తూ .. సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ .. మధ్యలో ఆగి ఫోటోలు దిగటం అరుదైన అనుభవంగా గుర్తుండిపోతుంది. వంతెన కింద నుంచి సముద్రంలో అటు ఇటు తిరుగాడే నౌకలను, పడవలను కూడా చూడవచ్చు.
ఇక ఈ వంతెన గురించి చెప్పుకోవాలంటే 1988 లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ దీన్ని ప్రారంభించారు. ఈ రోడ్ బ్రిడ్జి కి అన్నై ఇందిరాగాంధీ వంతెన అని నామకరణం చేశారు. రైలు వంతెనకు సమాంతరంగా ఈ రహదారి వంతెన ను నిర్మించడం గొప్ప విషయమే.ఇది పాక్ జలసంధి,మండపం (భారత ప్రధాన భూభాగంలో ఒక ప్రదేశం),పంబన్ (రామేశ్వరం ద్వీపంలోని మత్స్యకారుల పట్టణం.) తీరాల మధ్య ఉంటుంది.


