కోలీవుడ్ నటి మీరా మిథున్ మళ్ళీ వార్తల్లో కెక్కింది. ఈ సారి ఆత్మహత్య చేసుకోబోతున్నా అంటూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. తమిళనాడు సీఎం స్టాలిన్, పీఎం నరేంద్ర మోడీలను టాగ్ చేసింది. నాలుగైదు సినిమాల్లో నటించిన మీరా మిథున్ నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించలేక పోయారు. అందాల పోటీలు నిర్వహిస్తూ.. రియాల్టీ షో లలో పాల్గొనేది. కాగా తన ఆత్మహత్యకు అందాల పోటీ ఆర్గనైజర్ అజిత్ రవి కారణం అని మీరా చెబుతోంది. మూడు ఏళ్ళనుంచి తనను వేధిస్తున్నాడని మీరా అంటోంది. దీనికి సంబందించిన ఆధారాలున్నాయని చెబుతోంది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరు చర్య తీసుకోలేదని వాపోతోంది.
ఇదిలా ఉంటే గతంలో ఎప్పుడూ వార్తల్లో ఉండాలని మీరా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేది. మీరా తమిళనాడులో పుట్టింది. మోడల్ గా రంగ ప్రవేశం చేసిన మీరా మిదున్ కింగ్ ఫిషర్ యాడ్స్ లో కూడా చేసింది.చెన్నై బ్యూటీ కాంటెస్ట్ లో పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 2015 లో హీరో విజయ్ నిర్వహించిన జోడీ నంబర్ 1 షో లో పాల్గొన్నది. అయితే ఆమె ప్రవర్తన నచ్చక షో జడ్జీలు ఆమెను మధ్యలోనే తొలగించారు.2016 లో మిస్ సౌత్ ఇండియా గా ఎన్నిక అయింది. ఆ తర్వాత పలు వివాదాల్లో ఇరుక్కొని ఆ కిరీటాన్ని పోగొట్టుకుంది.
నటిగా తొలి సినిమా గౌతమ్ మీనన్ తీసిన “ఎన్నై అరిందాల్ “. అందులో హీరోయిన్ త్రిష స్నేహితురాలిగా చేసింది. 8 తూటజగల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా మిదున్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో గుర్తింపు లేని పాత్రల్లో కూడా నటించింది. అయితే ఆశించిన స్థాయిలో ఆమెకు పరిశ్రమ నుంచి ప్రోత్సాహం లభించలేదు. మీరా బిగ్ బాస్ షో పాల్గొన్నప్పుడు కూడా వివాదాలు చెలరేగాయి. ఆ షో దర్శకుడు చేరన్ పై ఆరోపణలు గుప్పించింది. చివరకు ఆ షో మోడరేటర్ నటుడు కమలహాసన్ పై విమర్శలు చేసింది. చేరన్ వైఖరిని కమల్ ఖండించలేదని వ్యాఖ్యానించింది.అసలు బిగ్ బాస్ షో ఎలా నిర్వహిస్తారో చూస్తానని సవాల్ విసిరింది. బిగ్ బాస్ షో నుంచి ఆమె బయటికి వచ్చాక అవకాశాలు మరింత దూరమైనాయి.
ఈ క్రమంలోనే తమిళ పరిశ్రమ తనను పట్టించుకోవడం లేదని బాలీవుడ్ వెళ్లి సెటిల్ అవుతానని ప్రకటించింది.హిందీ సినిమాలో ఆఫర్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకుంది. ముంబయి వెళ్లి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.తనను తమిళ హీరోలు రజనీకాంత్ , విజయ్ కావాలనే తొక్కేస్తున్నారని ఆరోపణలు చేసింది. నేపోటిజం కారణంగానే సూర్య ,విజయ్ లు పరిశ్రమలో హీరోలుగా ఎదిగారని కూడా మీరా ఆరోపణలు చేశారు. అలాగే త్రిష ను టార్గెట్ చేస్తూ కూడా ఆరోపణలు చేశారు. త్రిషకు కుల పిచ్చి ఎక్కువని ,తన మేకప్ టెక్నీక్స్ ను కాపీ కొడుతోందని .. తనకు వచ్చే అవకాశాలను రాకుండా అడ్డు పడుతోందని విమర్శించింది.
అప్పట్లో కొందరు వీటిని ఖండించారు … మరికొందరు మౌనంగా ఉన్నారు. మీడియా ఈ ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వడంతో మీరా మిదున్ ఇక అదే బాటను ఎంచుకుంది. దీనిపై రజని, విజయ్ అభిమానులు మీరాపై దుమ్మెత్తిపోశారు. ట్విట్టర్ లో తిట్టిపోశారు. అదలా సాగుతుండగానే మీరా తమిళ పరిశ్రమపై మలయాళీ, క్రిష్టియన్ల ఆధిపత్యం కొనసాగుతోందని వివాదాస్పద వ్యాఖలు చేసింది. ఒక దశలో హీరో విశాల్ తన వెంటబడుతున్నాడని మిథున్ ఆరోపించింది. అంతటితో ఆగకుండా కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి తానే నంటూ ట్విట్టర్ లో రాసుకుంది. ఈ పరిణామాల పట్ల తమిళ పరిశ్రమ పెద్దలు మీరా పై కినుక వహించారు.
అందం చందం ఉండి కూడా నోటి దురుసుతో పరిశ్రమకు దూరమైంది. మీరా ఆ మధ్య సడన్ గా రూటు మార్చి కైలాసదేశం వెళ్లి నిత్యానంద సేవల్లో తరించాలని కోరిక వ్యక్తం చేసింది.