మాస్ ను ఆకట్టుకునేలా కథను రాసుకోవడంలో పూరీ జగన్నాధ్ దిట్ట. దాన్ని అందంగా తెరపైకి ఎక్కిస్తాడు.అలా ఆయన తీసిన చిత్రాల్లో పోకిరి కూడా ఒకటి. సూపర్ డూపర్ హిట్ సినిమా పోకిరి ఇటు మహేష్ కి,పూరీకి , హీరోయిన్ ఇలియానా కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.
మొదట ఈ సినిమాను పూరీ జగన్నాధ్ హీరో రవితేజతో తీయాలని డిసైడ్ అయ్యాడు. రవితేజ కూడా ఒకే అన్నాడు. అయితే ఇంతలోనే తమిళం లో హిట్ అయిన ఆటోగ్రాఫ్ తెలుగులో రీమేక్ చేస్తూ ఆ సినిమా నిర్మాతలు రవితేజను సంప్రదించారు. ఆ సినిమా అంటే రవితేజకు ఇష్టం.
దాంతో ఆనిర్మాతలకు ఒకే చెప్పేసాడు. దాంతో పూరీ సోనూ సూద్ అయితే ఎలాఉంటుందని ఆలోచించారు ? ఎందుకో వర్కౌట్ కాదనిపించి ఆగిపోయాడు. చాలా కాలం పోకిరి సినిమా ప్రాజెక్టు వాయిదా పడింది. అసలు ఈ సినిమాకు మొదట్లో అనుకున్న పేరు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ.
2004 నవంబర్ లో ఒకరోజు మహేష్ బాబు కి ఈ కథ మొత్తం వినిపించాడు పూరీ జగన్నాథ్. మహేష్ కి కథ బాగా నచ్చింది. అయితే చిన్న చేంజ్ అన్నాడు. సిక్కు బ్యాక్గ్రౌండ్ మార్చేయండి. పేరు కూడా మార్చండి అన్నాడు. పూరీ ఒకే అని “పోకిరి” అంటే ఎలా ఉంటుందన్నారు. “సూపర్ ప్రొసీడ్” అన్నాడు మహేష్.
ఇక ఆలస్యం చేయకుండా పూరీ రంగంలోకి దిగారు.స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకున్నాడు. హీరో మహేష్ పక్కన హీరోయిన్ కోసం ఎవరు బాగుంటారా అని వెతికారు. అయేషా టకియా,దీపికా పడుకొనే. పార్వతీ మెల్టన్ వంటి హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలన కొచ్చాయి. ఒక దశలో కంగనా పేరు దాదాపుగా ఖరారు అయింది. చివరికి ఆమె ప్లేసులో ఇలియానా సెటిల్ అయింది.
సినిమా శరవేగంతో 70 రోజుల్లో పూర్తి అయింది. పూరీ స్పీడ్ చూసి మహేష్ కంగారు పడ్డారట. సినిమా 2006 లో ఏప్రిల్ 28 న విడుదల అయ్యింది. ప్రేక్షకులకు బాగా నచ్చింది. కథనంలో వేగం సినిమాను పరుగులు దీయిస్తుంది. మాఫియా ముఠాల కథలు తెలుగులో చాలా వచ్చాయి. కథనంలో కొత్తదనం ఉండటడంతో ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. బ్రహ్మి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ .. బెగ్గర్స్ అసోసియేషన్ లీడర్ ఆలీ కామెడీ పిచ్చగా పండింది.
సినిమాలో మహేష్ కొత్త లుక్, డైలాగులు క్లిక్ అయ్యాయి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. .ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు అన్నయ్య ..బుల్లెట్ దిగిందా ?లేదా ?. ఒక్కసారి కమిట్ అయితే, నామాట నేనే వినను వంటి డైలాగ్స్ బాగా పేలాయి. ఇక అభిమానులను అలరించేలా తీసిన పాటలు కూడా హిట్ అయ్యాయి.
మణిశర్మసంగీతం సినిమాకు ప్లస్. ప్రకాష్ రాజ్ , నాజర్, షిండే ,ఆశిష్ విద్యార్థి, ఇలియానా పాత్రల్లో ఇమిడిపోయారు. పూరీ కూడా ఊహించని రీతిలో సినిమా బంపర్ హిట్ అయింది. 12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా దాదాపు 60 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇదే సినిమా తమిళం లో, హిందీలో, కన్నడంలో, బెంగాలీలో కూడా రీమేక్ అయింది. అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. సినిమా విడుదల అయి 15 ఏళ్ళు దాటింది.యూట్యూబ్ లో ఉంది చూడని వాళ్ళు చూడొచ్చు.