పంచ కకారాలంటే ??

Sharing is Caring...
श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil)  …………………….. 

ద్విజులకు ఉపనయనం అనే సంస్కారం ఒకటి ఉన్నట్లుగానే ‘అమృతసంచార్’ అనేది సిక్ఖులకు చెందిన ఒక సంస్కారం. ఆ సంస్కారం రావడానికి వెనుక ఒక వ్యథాభరితమూ గొప్ప ప్రేరణదాయకమూ అయిన చరిత్ర ఉంది.మొదటినుండీ కూడా మొగల్ పాలకులు స్థానిక భారతీయుల పట్ల క్రూరమైన వైఖరిని అవలంబించారు.

ఇస్లాం మతం లోకి మారాలని తీవ్రంగా వత్తిడి చేసేవారు. వారు మారకుంటే తీవ్రమైన పన్నులను విధించేవారు. వారు తమ ప్రార్థనా మందిరాలకు పోవాలంటే వారు అధికంగా పన్నులు కట్టవలసి ఉండేది. హిందువులు బలహీనమైన ప్రాంతాలలో హిందూ స్త్రీలను అపహరించి తమ దాసీలుగా మార్చుకునేవారు. హిందూ యువకులను బలవంతంగా నపుంసకులుగా మార్చి, బానిసలుగా దూరదేశాలలో అమ్మేసేవారు.

ఈ అత్యాచారాలను అరికట్టే మార్గం చూపమని భారతీయులు గురునానక్ శిష్యులను (శిష్య అనే పదమే సిక్ఖు అని పలుకబడింది) ఆశ్రయించారు. ఈ విషయం తెలిసిన మొగల్ దర్బారు సిక్ఖు గురువుల పట్ల వైరం వహించింది. తరతరాలపాటు వారిని చిత్రహింసల పాలు చేసింది. (సిక్ఖుగురువుల చరిత్రను చదివితే మనకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి.)

ఇలా శతాబ్దాల పాటు అహింస శాంతి అనుకుంటూ అన్ని రకాల చిత్రహింసలనూ అనుభవించిన హిందూ సమాజం, దెబ్బకు దెబ్బ తీయకుంటే మనం మనుగడ కొనసాగించడం కష్టం అని భావించింది. మొగలులు హిందువులపై చేస్తున్న అత్యాచారాలను అరికట్టడానికి ఒక సైన్యాన్ని తయారు చేయవలసిందేనని గురు గోవిందుడు సంకల్పించాడు. 1699వ సంవత్సరంలో, వైశాఖి పండుగనాడు, ఆనందపూర్ సాహిబ్ లో ‘ఖల్సా పంథ్’ ను ప్రకటించాడు.

గురుగోవిందుడు వేలాది హిందువుల ముందు కత్తి దూసి, మొగలుల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు మొదటగా రక్తతర్పణం చేయగోరుతున్నాను. నరబలి ఇవ్వాలి. అందుకు సిద్ధపడే ఒక వ్యక్తి ముందుకు రండి అని ఎలుగెత్తి పిలిచాడు. ఎవరూ సాహసించారు కారు. కానీ , మూడుసార్లు అలా పిలిచేసరికి దయారామ్ అనే యువకుడు ముందుకు వచ్చాడు.

గురు గోవిందుడు, సంతోషించి అతడి భుజాలమీద చేతులు వేసి డేరా లోనికి తీసుకుపోయాడు. కాసేపటి తరువాత రక్తం కారుతున్న కత్తితో బయటకు వచ్చి, ‘ఒకరి రక్తతర్పణం చాలలేదు, మరొకరు కావాలి’ అన్నాడు. అప్పుడు మరొక యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. గురు గోవిందుడు అతనిని కూడా డేరా లోనికి తీసుకుపోయి, మరలా బయటకు వచ్చి, ‘ఇతడు రక్తతర్పణం చేసినా చాలలేదు.

మరొకరు కావాలి’ అన్నాడు. అప్పుడు మరొక యువకుడు వచ్చాడు. అలా మొత్తం గురు గోవిందుడు ఐదు సార్లు పిలిచి ఐదుగురు యువకులను డేరా లోనికి తీసుకుపోయాడు. చివరకు గురు గోవిందునితో పాటు ఆ ఐదుగురు యువకులు కూడా డేరానుండి క్షేమంగా బయటకు వచ్చారు.

వారిని డేరాలో గురుగోవిందుడు కత్తితో నరికి బలి ఇచ్చి ఉంటాడు అని భావిస్తూ ఉన్న ప్రజలందరూ వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు.అపుడు గురు గోవిందుడు చిరునవ్వు నవ్వి, ‘హిందువులలో నిస్స్వార్థంగా ఆత్మార్పణ చేయగలిగిన వారుంటేనే హిందూసమాజానికి నిజంగా విముక్తి లభిస్తుంది. లేకుంటే కసాయివాని ఎదుట తలవంచి నిలబడే గొఱ్ఱెలలాగా యావత్ హిందూసమాజం నశించిపోవలసిందే.

అందువల్ల, అటువంటి వీరులు అసలెవరైనా మనలో ఉన్నారా’ అని తెలుసుకునేందుకు  ఇలా పరీక్షించాను.ఇదుగో, సింహాలవంటి ఈ ఐదుగురు వీరయువకులు ముందుకు వచ్చారు. నేటినుండి వీరు సింహాలుగా (సింగ్ అనే పేరిట) పిలువబడతారు’ అని ప్రకటించాడు.

ఆ యువకుల పేర్లు (సింగ్ అనే బిరుదాన్ని చివర తగిలించుకున్న తరువాత) – 1 భాయి దయా సింగ్, 2 భాయి ముఖం సింగ్, 3 భాయి సాహిబ్ సింగ్, 4 భాయి ధరమ్ సింగ్, 5 భాయి హిమ్మత్ సింగ్ (వీరు గురు గోవిందునికి చాల ప్రియమైన వారు కాబట్టి, వారికి ‘పాంచ్ ప్యారే’ అని వ్యవహారం.) వీరందరూ తమ తమ అనుచరులతో పాటు పంచ కకారాలను ధరించి హిందువుల మీద అత్యాచారాలకు పూనుకునే మొగలాయీ సైన్యాలను ఎదిరిస్తారు. వారి దౌర్జన్యాలను అరి కడతారు.

పంచ కకారాలంటే –

1 కేశ్ (కత్తిరింపబడని పొడుగాటి జుట్టు) 2 కంకత్ (జుట్టును పరిశుభ్రం చేసుకొనేందుకు తగిన చెక్క దువ్వెన) 3 కర లేదా కంకన్ (కంకణం) 4 కచెరా (నూలువస్త్రం) 5 కృపాన్ (కృపాణము అంటే రెండువైపులా పదును కలిగిన కత్తి) ..ఈ సంఘటన తరువాత ప్రతి హిందు కుటుంబం తమ సంతానంలో జ్యేష్ఠపుత్రునికి ‘అమృతసంచార్’ సంస్కారాన్ని కలుగజేసి, ఖల్సాకు (సంరక్షకసైన్యానికి) పంప సాగారు.

ఆ సంస్కారం పొందిన ప్రతి వ్యక్తీ సింగ్ అని పిలువబడతారు.అమృతసంచార సంస్కారం పొందిన ప్రతివ్యక్తీ గురువిధేయుడై భగవంతుని పట్ల, గురు గ్రంథ్ సాహిబ్ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి తన జీవితాన్ని ధర్మసంరక్షణకు, ప్రజాసంరక్షణకు, ఆత్మవిముక్తికి అంకితం చేస్తాననే ప్రతిజ్ఞను స్వీకరిస్తాడు. క్షత్రియధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయటమే కాక, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని గడపటం కూడా వారి ఆశయాలు. అటువంటి సింగులను వివాహం చేసుకున్న యువతికి కౌర్ అనే బిరుదం వస్తుంది. కౌర్ అంటే యువరాణి.

@@@@@@@

ఈ రోజులలో మరలా గోవిందునివంటి గురువులు మరలా అవసరమనిపిస్తున్నారు. గురుగోవిందులు వస్తే వారి మాటలకు మరలా హిందువులలో సింహాలు జూలు విదిల్చి బయటకు వస్తాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!