ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో నందాదేవి మంచు పర్వతంలో కొంత భాగం విరిగి పడింది. విరిగిన ఆ మంచు ముక్కలు కరిగిన కారణంగా నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి అక్కడి ధౌలీ గంగా నది పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా అనూహ్య రీతిలో నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రైనీ తపోవన్ గ్రామం వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ధాటికి రైనీ వద్ద ఉన్న ఆనకట్ట కొట్టుకుపోయింది. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో రుషి గంగా పవర్ ప్రాజెక్టు దెబ్బతింది. ఈ విద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతు అయ్యారు. నదీ తీరంలో ఉన్న కొన్ని గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైఅలర్ట్ ప్రకటించారు.
ప్రత్యేక రక్షక బృందాలు రంగంలోకి దిగాయి. గంగానది పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా అలకనంద ప్రాంతంలో వరదలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలకనంద ప్రవాహాన్ని నిరోధించేందుకు శ్రీనగర్, హృషికేశ్ డ్యామ్‌లను ఖాళీచేశారు. వందల మంది ఐటీబీపీ, ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మూడు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ వరదలో రెండు డ్యామ్‌లు కొట్టుకుపోయాయి. కాగా సొరంగంలో చిక్కుకున్న 16 మందిని ఇండో టిబిటన్ బోర్డర్ పోలీసులు కాపాడారు.
2013లో ఏం జరిగింది?
ఉత్తరాఖండ్ లో తరచూ ఇలాంటి వరదలు సంభవిస్తుంటాయి. 2013లో కురిసిన భారీ వర్షాలకు వేలమంది మరణించగా, ఎంతోమంది గాయపడ్డారు.అప్పట్లో ఎగువన కురిసిన భారీ వర్షాలకు కొండలలో ఉన్న నదులు పొంగి ప్రవహించాయి. కొండప్రాంతాల్లో రాళ్లు విరిగి పడ్డాయి.అప్పటి వరదల తీవ్రతకు ఇళ్లు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అనూహ్యమైన ఈ ఉత్పాతాన్ని హిమాలయన్ సునామీగా అప్పట్లో చెప్పుకున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న హిందూ ఆలయాలకు భక్తులు, టూరిస్టులు వచ్చే సీజన్ లోనే ఈ వరదలు రావడంతో అప్పట్లో వేలసంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. నాటి వరదల్లో 4వేల గ్రామాలు వరద ముప్పులో చిక్కుకోగా, లక్షమందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.