ఏపీ లో పంచాయితీ ఎన్నికలు ముందెన్నడూ లేని చిత్రమైన పరిస్థితులను తెర పైకి తెచ్చాయి. ఈ ఎన్నికలే యావత్తు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక వైపు .. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక్కరే ఒకవైపు నిలిచేలా చేశాయి. ఎన్నికలు పెట్టాల్సిందే అని కమీషనర్ .. ఇపుడు కాదు అని ప్రభుత్వం పంతాలకు పోయాయి .ఇక ఎన్నికలు నిర్వహించాల్సిన ఉద్యోగులు కూడా కరోనా టైమ్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని చేతులెత్తేశారు. కమీషనర్ కి విజ్ఞప్తి చేశారు. కనీసం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేవరకు అయినా ఎన్నికలను వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. మానవతా దృక్పధంతో ఆలోచించాలని కమీషనర్ ను అభ్యర్ధించాయి. అయితే కమీషనర్ వాటిని పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు సుప్రీం ను ఆశ్రయించాయి.
కమీషనర్ ప్రభుత్వం తో ఈ విషయమై చర్చించి ఉంటే బాగుండేది. కోర్టు ప్రభుత్వం తో చర్చించి నిర్ణయాలు తీసుకోమని చెబితే కమీషనర్ ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు చెప్పకపోయినా ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టేముందు కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నసమయంలో ఉద్యోగుల మూడ్ ఎలా ఉందొ తెలుసుకునే ప్రయత్నం కమీషనర్ చేయలేదు. చేయకపోగా కమీషనర్ నోటిఫికేషన్ జారీ చేసి … ప్రభుత్వ యంత్రాంగాన్ని తన పరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కమీషనర్ వీడియో కాన్ఫరెన్స్ పెడితే ఉన్నతాధికారులు, అధికారులు, జిల్లా కలెక్టర్లు హాజరు కాలేదు. దీంతో ఎన్నికల ఏర్పాట్ల పై చర్చలు నిలిచి పోయాయి. ఎన్నికల విధానం లో ప్రతిష్టంభన నెలకొన్నది. ముందెన్నడూ లేని పరిస్థితి ఇది. ఇలా జరగడం అవాంఛనీయమే. ఈ పరిస్థితి ఏ పరిణామాలకు దారితీస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఒక విధంగా ఉద్యోగులు సహాయ నిరాకరణ కి దిగడం కమీషనర్ కు షాకే. ఈ క్రమంలో ఇపుడు ఆయన ఏమి చేస్తారో ? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. వాస్తవానికి ఉద్యోగులు అడ్డం తిరిగితే చేసేదేమి లేదు. ఉద్యోగుల సహకారం లేనిదే ఎన్నికల ప్రాసెస్ ముందుకు నడవదు. ఇవన్నీ కమీషనర్ కి తెలియనివి కాదు. ఉద్యోగులను బెదిరిస్తే సమస్య మరింత జటిలం కావచ్చు. ఇవన్నీ అర్ధం చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు అని కమీషనర్ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఇలా హెచ్చరిక చేసే కంటే భద్రత చర్యలపై మాట్లాడదాం రండి ఉద్యోగులను పిలిస్తే బాగుండేది. ఆ పని చేయకుండా అద్దాల ఛాంబర్ లో కూర్చొని కమీషనర్ ప్రెస్ మీట్ పెట్టారు . ఇక్కడే ఆయన మరోమారు ఆక్షేపణకు గురయ్యారు. ఆయన రక్షణ ఆయన చూసుకుంటున్నారు. మా రక్షణ మాటేమిటి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనికి కమీషనర్ జవాబు ఏం చెబుతారు ? ఇక సోమవారం సుప్రీం నిర్ణయం వచ్చేవరకు పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ ఉండదు. సుప్రీం కూడా ఎన్నికలు జరగాలని చెబితే ఉద్యోగుల వైఖరి ఏమిటో అపుడే తేలుతుంది. ఇక వైసీపీ నేతలైతే కమీషనర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.
—————- KNM