Engineering is awesome ………………
కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.దీంతో పాత బ్రిడ్జి కనుమరుగు కానుంది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి భారతీయ రైల్వే చరిత్రలో ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది.ఇది దీని ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.
దేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి
దీనిని 2025 ఏప్రిల్ 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.ఈ వంతెన మధ్యలో ఉండే ఒక భాగం (Span) నిలువుగా పైకి లేస్తుంది. పాత వంతెనలో ఈ భాగం ‘కత్తెర’ లాగా ఇరువైపులా తెరుచుకునేది (Scherzer rolling lift span), కానీ కొత్త వంతెనలో లిఫ్ట్ లాగా నిలువుగా పైకి వెళ్తుంది. దీనివల్ల పెద్ద ఓడలు వంతెన కింద నుండి సులభంగా ప్రయాణించవచ్చు.
ఈ వర్టికల్ లిఫ్ట్ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటెడ్. ఇది సెన్సార్ల ద్వారా నియంత్రించబడుతుంది, దీనివల్ల ఓడలు వచ్చినప్పుడు వంతెనను చాలా వేగంగా, సురక్షితంగా పైకి లేపవచ్చు.కొత్త వంతెనను పాత దానికంటే ఎత్తులో నిర్మించారు. దీనివల్ల సముద్రపు అలల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇది సుమారు 2.05 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
పాత వంతెనపై రైళ్లు చాలా నెమ్మదిగా (గంటకు 10-15 కిమీ) వెళ్లేవి. కొత్త వంతెనపై రైళ్లు గంటకు 80 కిమీ వేగంతో ప్రయాణించవచ్చు. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఈ వంతెనను విద్యుదీకరణకు అనుకూలంగా నిర్మించారు. భవిష్యత్తులో అవసరమైతే రెండు రైళ్లు పక్కపక్కనే వెళ్లేలా (Double Track) దీనిని రూపొందించారు.
సముద్రపు ఉప్పు నీటి వల్ల వంతెన త్వరగా పాడవకుండా ఉండటానికి, దీని నిర్మాణంలో ‘స్టెయిన్లెస్ స్టీల్’ .. ప్రత్యేకమైన ‘యాంటీ కోరోసివ్’ పెయింటింగ్‌ను ఉపయోగించారు. దీనివల్ల వంతెన జీవితకాలం 100 ఏళ్లకు పైగా ఉంటుంది. సముద్రం మధ్యలో రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగే అనుభవం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.ముఖ్యంగా వంతెన పైకి లేచే దృశ్యం ఒక అద్భుతం.
ఈ కొత్త వంతెన రామేశ్వరం ద్వీపానికి , ప్రధాన భూభాగానికి మధ్య రవాణాను మరింత సులభతరం చేయడమే కాకుండా, దక్షిణ భారతదేశంలో ఒక కీలకమైన పర్యాటక ఆకర్షణగా మారింది. కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో పాత పంబన్ రైల్వే బ్రిడ్జి ని కూల గొట్టేస్తున్నారు.
1914లో ప్రారంభించబడిన ఈ వంతెన భారతదేశంలో మొట్టమొదటి సముద్ర వంతెన, ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటి. ఇది రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే కీలక లింక్.111 ఏళ్ల నాటి పాత బ్రిడ్జిని కూల్చివేసే ప్రక్రియ జనవరి 23, 2026న ప్రారంభమైంది.
చారిత్రక ప్రాముఖ్యత దృష్ట్యా, పాత వంతెనలోని కొన్ని భాగాలను సముద్రం నుండి తొలగించి రైల్వే మ్యూజియంలో ఉంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.సముద్రంలో ఉన్న 140కి పైగా రాతి స్తంభాలను (Piers) ఇనుప గార్డర్లను భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్నారు.

