Ravi Vanarasi………………
పురాణాల్లో నహుషుడు గొప్ప మహారాజు. ఎన్నో యజ్ఞయాగాదులు చేసి, అత్యంత ధర్మబద్ధుడిగా పేరు పొందినవాడు. ఇంద్రుడు వృత్రాసురుడిని వధించినప్పుడు కలిగిన బ్రహ్మహత్యా పాతకం వల్ల అదృశ్యమయ్యాడు. అప్పుడు స్వర్గలోకం నాయకుడు లేక అల్లకల్లోలమైతే, దేవతలంతా కలిసి నహుషుడిని ఇంద్ర సింహాసనంపై కూర్చోబెట్టారు.
ఒక మానవుడు ఇంద్ర పదవిని చేపట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.కానీ, ఒక్కసారి ఆ సింహాసనం ఎక్కాక నహుషుడిలో మార్పు మొదలైంది. అతని నడక మారింది.గర్వంతో భూమి ఆకాశం తనదే అన్నట్టు నడిచాడు.అతని మాట మారింది – ఆజ్ఞలు జారీ చేయడం అలవాటైంది. అతని చూపు మారింది – ఎదుటివారిని తక్కువగా చూడటం మొదలుపెట్టాడు.
అధికారం అతని నాడుల్లో మదంలా ప్రవహించింది. తనను ఇక్కడికి చేర్చిన దేవతలను, మునులను కూడా లెక్కచేయని స్థితికి చేరాడు.అదే అతని పతనానికి నాంది పలికింది.ఇంద్రసింహాసనం నహుషుడిని ఉన్నతుడిని చేయలేదు, పైగా అతని విచక్షణను తుడిచివేసింది. తనే సర్వాధికారిని అన్న భ్రమలో “నేను ఇంద్రుడిని.. నన్ను ఎవరు ఆపగలరు?” అన్న అహంకారమే అతని వినాశనానికి కారణమైంది.
అహంకారం అతని విచక్షణాజ్ఞానాన్నికోల్పోయేలా చేసింది. ఓ రోజున దేవేంద్రుడు భార్య శచీదేవి ఉద్యానవనంలో విహరిస్తూ అతని కంటపడింది. ఆమె అందచందాలకు నహుషుడు ముగ్ధుడయ్యాడు. ఆమెను సొంతం చేసుకోవాలన్న కాంక్ష కలిగిందతనిలో.
ఇంద్ర పదవిని చేపట్టిన తనకు ఇంద్రుని భార్య శచీదేవి పట్టపురాణిగా విచ్చేసి, తనను సుఖ పెట్టవలసిందేనంటూ ఆదేశించాడు.నహుషుని అధర్మవర్తనకు దేవతలందరూ కోపించారు. కానీ, ఏం చేయగలరు… తామే తీసుకొచ్చి రాజుగా మహేంద్రపదవిని కట్టబెట్టాము.. కాబట్టి కాదని ఖండించడానికి వీలు లేదు మరి. ఏం చేయాలో తోచక కలవరపడ్డారు. మహాపతివ్రత శచీదేవి కి ఈ విషయం తెలిసింది.
దేవతల గురువైన బృహస్పతిని కలుసుకుని, ఈ ముప్పు నుంచి తప్పించమని మొరపెట్టుకుంది. ఆయన ఓ ఉపాయం చెప్పాడు. నహుషుడిని ఎదిరించగల పరాక్రమవంతుడు ఎవరూ దేవతలలో లేరు కాబట్టి, అతన్ని ఎలాగైనా సరే, మునుల శాపానికి గురయ్యేలా చేయాలి అన్నాడు బృహస్పతి.. ఆయన మాటలకు ధైర్యం తెచ్చుకుంది శచీదేవి. ఓ ఉపాయం ఆలోచించింది.
తాను ఇంద్రాణి కాబట్టి, తన భర్త సామాన్యుడిలా తన వద్దకు రాకూడదని, సప్తర్షులు మోసే పల్లకిలో తన మందిరానికి రావలసిందని కబురంపింది నహుషుడికి. కామంతో, అధికార మదంతో ఉన్న నహుషుడు ఉచితానుచితాలు ఆలోచించలేదు. అదెంత పని అనుకుని సప్తర్షులకు కబురు పంపాడు తన పల్లకిని మోసేందుకు రావలసిందంటూ…. నహుషుడి వర్తమానం విని సప్తర్షులు కోపోద్రిక్తులయ్యారు. అయినా, తమాయించుకున్నారు.
పల్లకి సిద్ధమైంది .. నహుషుడు పల్లకిలో ఆసీనుడు అయ్యాడు. సప్తర్షులు ఆ పల్లకిని మోయసాగారు. వారిలో అగస్త్యుడు కొంచెం పొట్టివాడు, బలహీనుడు కావడంతో పల్లకిని మోయడం ఆయనకు కష్టమైంది. మిగిలిన వారితో సమానంగా అడుగులు వేయలేకపోయాడు. ఫలితంగా పల్లకి కుదుపులకు లోనైంది. పల్లకి వేగం కూడా మందగించింది. కారణం తెలుసుకున్న నహుషుడు అగస్త్యుడిని కొరడాతో అదిలిస్తూ, ‘సర్ప సర్ప’ అన్నాడు. సర్ప అంటే త్వరగా నడవడమని అర్థం.
కోపించిన అగస్త్యుడు “అధికార మదంతో ఉచితానుచితాలు, ధర్మాధర్మాలు మరచిపోయిన నీవు వెంటనే సర్పంగా మారి, భూలోకంలో పడి ఉండు” అని శపించాడు. నహుషుడికి తన తప్పు తెలిసి వచ్చింది. కళ్ళకు కమ్మిన పొరలు కరిగిపోయాయి. వెంటనే అగస్త్యుడి కాళ్లమీద పడ్డాడు.తనను క్షమించి, శాప విముక్తి ప్రసాదించమని ప్రార్ధించాడు.
అప్పుడు అగస్త్యుడు “రాజా! నీవు ఒక కొలను ఒడ్డున ఉన్నబిలంలో ఉంటూ, నీళ్లు తాగడానికొచ్చిన వారిని నిర్బంధిస్తూ, కొన్ని ప్రశ్నలు అడుగు. వారిలో ఎవరైతే నీ ప్రశ్నలకు సరైన సమాధానం చెబుతారో, అప్పుడే నీకు శాపవిమోచనం కలుగుతుంది” అన్నాడు.తక్షణం నహుషుడు మహాసర్పం గా మారి భూలోకంలోని ఒక కొలను వద్ద కు చేరుకున్నాడు.
కొన్ని వేల ఏళ్ల తర్వాత ఆ కొలను వద్దకు వచ్చిన భీముడిని తన భారీ శరీరంతో చుట్టి వేసి, ఎటూ కదలకుండా బంధించి వేస్తాడు. అతన్ని వెదుక్కుంటూ వచ్చిన ధర్మరాజు, నహుషుడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడంతో శాపవిముక్తి కలుగుతుంది.
పూర్వపుణ్యం వల్లనో, ఈ జన్మలో చేసిన గొప్ప పనుల వల్లనో పదవులు వరించవచ్చు.అవన్నీ తమ గొప్పతనంగా భావించి, అహంకారంతో వ్యవహరిస్తే పతనం తప్పదని పై ఉదంతం చెబుతుంది.అధికార మదం వల్ల కలిగే పతనాన్ని మాత్రం ఒక శాశ్వత హెచ్చరికగా మిగిల్చింది.
ఇటీవల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వైద్యురాలు ధరించిన హిజాబ్‌ను పట్టుకుని కిందికి లాగిన దృశ్యం నెట్టింట వైరల్ అయ్యింది. ఆ దృశ్యం చూడగానే సామాన్యుడికి అది ఒక రాజకీయ నాయకుడి అతి ఉత్సాహంలా అనిపించవచ్చు. కానీ, లోతుగా ఆలోచించే మదికి అది ఒక వ్యక్తి చేసిన పొరపాటుగా మాత్రమే కాకుండా, పురాణ కాలం నాటి నహుషుడి అహంకారాన్ని గుర్తుచేస్తోంది.

