Ravi Vanarasi …………….
సోషల్ మీడియాలో ‘ఫాంటసీ క్రికెట్ కింగ్’గా పేరు గాంచిన యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇబ్బందుల్లో పడ్డారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన ఇంటిపై పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కోట్ల విలువైన విలాసవంతమైన కార్లను సీజ్ చేయడమే కాకుండా, విదేశాల్లో ఆయన పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎవరీ అనురాగ్ ద్వివేది?
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లా ఖజూర్ గ్రామానికి చెందిన అనురాగ్ ద్వివేది ప్రయాణం అత్యంత నాటకీయంగా సాగింది. ఒకప్పుడు సాధారణ సైకిల్‌పై తిరిగే స్థాయి నుంచి ఇవాళ కోట్ల విలువైన లగ్జరీ కార్ల యజమానిగా ఎదిగారు. యూట్యూబ్‌లో దాదాపు 7 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను కలిగి ఉన్నారు..
అనురాగ్ క్రికెట్ మ్యాచ్ ప్రిడిక్షన్స్, ఫాంటసీ లీగ్ (Dream11 వంటివి) టిప్స్ ఇస్తూ ప్రాచుర్యం పొందారు. గత నెలలో దుబాయ్‌లోని ఒక విలాసవంతమైన క్రూయిజ్‌లో జరిగిన ఆయన వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమ బెంగాల్ పోలీసులు సిలిగురిలో నమోదు చేసిన చీటింగ్, ఫోర్జరీ, అక్రమ బెట్టింగ్ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సోను కుమార్ ఠాకూర్, విశాల్ భరద్వాజ్ అనే వ్యక్తులు టెలిగ్రామ్ ఛానళ్లు, నకిలీ బ్యాంక్ ఖాతాల ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ సిండికేట్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ సిండికేట్‌ను ప్రమోట్ చేయడంలో అనురాగ్ ద్వివేది కీలక పాత్ర పోషించారని, తన వీడియోల ద్వారా యువతను ఈ బెట్టింగ్ యాప్స్‌వైపు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది.
డిసెంబర్ 17, 18 తేదీల్లో లక్నో, ఉన్నావో, నవాబ్‌గంజ్‌లోని 9 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.అనురాగ్ ద్వివేదికి చెందిన సుమారు రూ. 4.18 కోట్ల విలువైన లంబోర్ఘిని ఉరుస్, ఒక మెర్సిడెస్ బెంచ్, ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా థార్ వంటి వాహనాలను అధికారులు సీజ్ చేశారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్మును హవాలా ద్వారా దుబాయ్‌కు తరలించి, అక్కడ స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు లభించాయి.
దీనికి సంబంధించిన కీలక పత్రాలు అధికారుల చేతికి చిక్కాయి.అనురాగ్ తన కంపెనీలు, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి భారీగా నగదును మళ్లించినట్లు గుర్తించారు. ఎటువంటి వ్యాపార సంబంధం లేకుండానే కోట్ల రూపాయలు ఈ ఖాతాల్లోకి చేరడంపై దర్యాప్తు జరుగుతోంది.
పరారీలో అనురాగ్ ద్వివేది?
ప్రస్తుతం అనురాగ్ ద్వివేది దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈడీ ఇప్పటికే ఆయనకు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారు. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.కేవలం ఫాంటసీ గేమ్స్ అని నమ్మి యువత అక్రమ బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ సొంత లాభం కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని, వీటి వెనుక భారీ అంతర్జాతీయ నెట్‌వర్క్ పనిచేస్తోందని ఈడీ చెబుతోంది. అనురాగ్ ద్వివేది కేసు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ రంగంలోని చీకటి కోణాలను బయటపెడుతోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.

