Subramanyam Dogiparthi………………
ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన సినిమా ఇది.. 1975 లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్ళు’ . 1970 లో విజయవాడలో విద్యార్ధిగా ఉన్న టైంలో ఆ నాటకాన్ని చూసిన యం వి రఘు మనసు పారేసుకున్నాడు.
సినిమా రంగం లోకి వచ్చాక 17 ఏళ్ళకు ఆ నాటకాన్ని సినిమా తీయాలనే కోరిక కలిగింది. అప్పటికే ఆ నాటకం రైట్స్ కొనేసిన డి రామానాయుడు దగ్గర నుండి రైట్సుని కొని అదే టైటిలుతో తెర మీదకు ఎక్కించారు . అప్పటికే గొప్ప సినిమాటోగ్రాఫర్ పేరు తెచ్చుకున్న యం వి రఘు తన మిత్రులతో కలిసి ఏడు లక్షల ఖర్చుతో ఈ ఆర్ట్ ఫిలింని తీసారు .
కెమెరాతో పాటు స్క్రీన్ ప్లే , దర్శకత్వ బాధ్యతలను కూడా తలకు ఎత్తుకున్నారు.ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే. వ్యాపారపరంగా లాభాలు రాలేదు కానీ రఘుకి కీర్తి ,యశస్సు ,పురస్కారాలు పుష్కలంగా లభించాయి.
ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డ్ తో పాటు నాలుగు నంది అవార్డులు వచ్చాయి మూడవ ఉత్తమ చిత్రం అవార్డ్ , నూతన ఉత్తమ దర్శక అవార్డ్ , గొల్లపూడికి ఉత్తమ కధా రచయిత అవార్డ్ , చిదంబరానికి ప్రత్యేక జ్యూరీ అవార్డ్ వచ్చాయి . మరెన్నో ప్రైవేట్ సంస్థల అవార్డులే కాక సినీ ఫెస్టివల్సులో ప్రదర్శితమైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
గొప్ప కధాంశం. ప్రపంచంలో కళ్ళున్న చాలామంది తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను , అక్రమాలను చూడరు,చూడడానికి విముఖత చూపిస్తారు. ఉన్న కళ్ళు మూసుకుని తామూ వాటిల్లో వాటాదారులు అవుతుంటారు. సినిమా బిగినింగ్ దృశ్యాలు అవే.
ఇలాంటి ప్రపంచంలో అయిదారు కళ్ళు లేనివారు కలిసి జీవిస్తూ ఉంటారు . వారిలో ఒక యువతి కూడా ఉంటుంది.. సామాజిక స్పృహ ఉన్న ఒక జర్నలిస్టు వాళ్ళకు కళ్ళ ఆపరేషన్ చేయించి చూపు తెప్పించాలని ప్రయత్నం చేస్తుంది . అందుకు కావలసిన అయిదు వేల రూపాయలను అందరూ చచ్చీ చెడి పోగుచేసి వారిలో ఒకరయిన శివాజీ రాజాకు చూపు తెప్పిస్తారు. చూపు వచ్చాక లోకాన్ని చూసిన అతను చెడు మార్గాలలోకి వెళతాడు.
పట్టణంలో ఉన్న ఒక మాఫియా లీడరు ముఠాలో చేరి అసాంఘిక పనులను చేస్తూ ఉంటాడు. తాగిన మైకంలో తమ అయిదుగురిలో ఒకరయిన స్త్రీని మానభంగం చేయటానికి ప్రయత్నిస్తాడు. నలుగురూ కలిసి వాడి కళ్ళు పీకేయటంతో సినిమా ముగుస్తుంది. ఇక్కడ నేను చాలా సింపుల్ గా చెప్పాను కానీ దర్శకుడు యం వి రఘు తెర మీద చాలా గొప్పగా చూపారు.కాదు..అద్భుతంగా చూపారు.
షూటింగ్ అంతా విశాఖపట్టణమే. కేబరే డాన్సులు నడిచే బార్లను చూపారు. Strip tease కూడా ఉంది. 1987-88 రోజుల్లో విశాఖపట్టణంలో కేబరే బార్లు ఉన్నట్లు నాకు ఈ సినిమా చూసేదాకా తెలియదు. బాలసుబ్రమణ్యం సంగీత దర్శకత్వం వహించగా.. పాటలన్నీ సిరివెన్నెల వారే వ్రాసారు .
‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో మంచాలింక దిగండోయ్ కొక్కొరకో’ అనే పాటను ఆయన వ్రాయటమే కాదు పాడారు కూడా . గుంతలకిడి గుంతలకిడి , చీకటోళ్ళ లోకంలో , దారిని చూపేందుకు అంటూ సాగే పాటలను బాగా చిత్రీకరించారు. బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , సిరివెన్నెల , శేష గిరీశంలు పాటల్ని పాడారు .
సీతారామ శాస్త్రి పాటకు థియేటర్లలో పెద్ద స్పందన వచ్చిందని రఘుయే ఒక సందర్భంలో చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి మరి కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. సినిమాలో శివాజీ రాజా నటుడు చిరంజీవి పిచ్చోడు . సినిమాలో ఒక నటుడికి చిరంజీవి voice over ఇచ్చారు . కళ్ళు చిదంబరంగా పాపులర్ అయిన చిదంబరానికి ఇదే మొదటి సినిమా.
అతను విశాఖపట్టణం పోర్ట్ ట్రస్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుండేవారు.బాలసుబ్రమణ్యం , సిరివెన్నెల సినిమాలో తళుక్కుమంటారు. అయిదుగురు గుడ్డివారుగా శివాజీ రాజా , కొత్తూర్తి భాస్కరరావు , బిక్షు , శ్రీనివాస్ , రాజేశ్వరిలు బ్రహ్మాండంగా నటించారు. జర్నలిస్టుగా సుధారాణి , ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు , చిట్టిబాబు , విశాఖపట్టణం లోని ఔత్సాహిక కళాకారులు చాలామంది నటించారు.
విలన్ పేరు తెలియదు.డిఫరెంటుగా నటింపచేసారు దర్శకులు . ఇ వి వి సత్యనారాయణ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు . యం వి రఘు , ఆయన మిత్రులు నిర్మాతలు . యం వి యస్ హరనాధరావు పదునైన డైలాగులను వ్రాసారు . సినిమా యూట్యూబులో ఉంది కానీ వీడియో క్వాలిటే బాగా లేదు . ఇంతకుముందు చూడనివారు వీడియో క్వాలిటీ ఎలా ఉన్నా తప్పక చూడండి . Undoubtedly an unmissable art film . ఇటీవలే ఈటీవీ విన్ లో యాడ్ చేసారని సమాచారం, అక్కడ కూడా చూడవచ్చు.

