ఎవరీ నారాయణ తీర్థులు? ఏమిటీ ఆయన ప్రత్యేకత ?

Sharing is Caring...

Dr.V.Rama krishna …………………………..

సంగీత ప్రపంచంతో పరిచయం ఉన్న పాత తరం వారికి  నారాయణ తీర్థుల వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈతరంలో కొంతమందికి ఈయన గురించి తెలియదు.. వారి కోసమే ఈ
ప్రత్యేక కథనం …
నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణుని లీలలను, ఆయన రూపాన్ని వర్ణించినంత మనోహరంగా మరే వాగ్గేయకారుడూ వర్ణించలేదంటే అతిశయోక్తి కాదు.

శ్రీకృష్ణ లీలా తరంగిణిలో ఎన్నో కీర్తనల ద్వారా ఆయన బృందావన కృష్ణుని నుతించారు.నారాయణ తీర్థులు (1650 – 1745) 17 వ శతాబ్దానికి చెందిన తరంగ రచయిత. ఈయన రచించిన “కృష్ణ లీలా తరంగిణి” పుణ్యకీర్తనా పుష్కరిణి.

ఇది సంస్కృత గేయ నాటకం. ఈయన రచించిన గేయాలు తరంగ విధానానికి చెందినవి. తరంగ రచనలో ఆయనకు ఆయనే సాటి. పదాలకు అన్నమయ్య, క్షేత్రయ్య ఎలాగో తరంగ రచనలో నారాయణ తీర్థుడు అలాగ.

ఈయన అసలు పేరు “తల్లావఝ్ఝల గోవింద శాస్త్రి”. తల్లి పార్వతమ్మ, తండ్రి తల్లావఝ్ఝల నీలకంఠశాస్త్రి. ఆశ్రమ స్వీకారం చేశాక నారాయణ తీర్థులుగా పేరు మార్చుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర ఉన్న కాజా గ్రామం ఈయన స్వగ్రామం. కుటుంబపెద్దలు తమిళనాడులోని తంజావూరుకు తరలిపోవడంతో తీర్థులు కూడా అక్కడే పెరిగాడు.

ఈయనది పండిత వంశం. స్వామి శివానందతీర్థ వద్ద సంగీత, సంస్కృత భాషాపరిజ్ఞానానికి శివానందతీర్థ మెరుగులు దిద్దారు.నారాయణ తీర్థుల వివాహం చిన్నవయసులో జరిగినా దానికో పెద్దకథ ఉంది. అత్తగారి ఊరు కృష్ణానదీ తీరంలోని వేదాద్రి. ఈయన భార్య పేరు రుక్మిణి. ఆమె నోము నోచుకుంటోంది రమ్మంటే బయల్దేరాడు.

దార్లో కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ కనిపించింది. ఈదడానికి సిద్ధపడ్డాడు. నదిలో వేగం పెరిగింది. చావు తప్పదనుకుని ఒక వెంట్రుక పీకి విడిచి, దాన్నే శిరోముండనంగా భావించి మానసిక సన్యాసం స్వీకరించాడు. దీన్నే ఆపత్సన్యాసం అంటారు. అనుకున్నప్రకారం ఆయన చావకపోగా వరద తోపుకు వేదాద్రికి వచ్చిపడ్డాడు.

రుక్మిణి అనుమతితో తన గురువుగారైన శివ పరమానంద తీర్థుల ఆధ్వర్యంలో యథావిధిగ సన్యాసాశ్రమం స్వీకరించి నారాయణ తీర్థులయ్యాడు. వేదాద్రి నరసింహుని ఆలయం ప్రక్కనే ఉన్న గుహలో ఆత్మజ్ఞానం కోసం పన్నెండుసంవత్సరాలు తపస్సుచేశాడు. ఆత్మజ్ఞానం కావాలంటే కాశీకి వెళ్ళమని అంతర్వాణి చెప్పింది. అది స్వామి ఆజ్ఞగాభావించి కాశీవెళ్ళాడు.

తీర్థుడికి సిద్ధయ్య అనే శిష్యుడుండేవాడు. అతనే తర్వాతికాలంలో సిద్ధేంద్రయోగిగా మారి కూచిపూడి నృత్యానికి మూలపురుషుడయ్యాడు. రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక వసారాలో పడుకుని తరంగాలు పాడుకోవడం తీర్థుడికి అలవాటు. ఆయన తన్మయంతో కళ్ళుమూసుకుని పాడుతుంటే బాలకృష్ణుడు తీర్థుడి బొజ్జమీద మృదువుగా తాండవం చేసేవాడు.

బాలకృష్ణుడు బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా లేదా అని అడిగాడు సిద్ధయ్య. అది గమనించని తీర్థుడు ఆశ్చర్యపోయాడు. బాలకృష్ణుడి తాండవమా..ఎప్పుడు రా..అడిగాడు తీర్థుడు. రాత్రిళ్ళు మీరు తరంగాలు పాడుతుంటే బాలకృష్ణుడు తాండవం చేస్తాడు…నేను రోజూ చూస్తున్నాగా” చెప్పాడు సిద్ధయ్య.

తన దౌర్భాగ్యాన్ని నిందించుకుని కన్నీరు మున్నీరయ్యాడు. ఈసారి కనబడితే మనకు జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కోమన్నాడు. అలాగే అడిగాడు సిద్ధప్ప.’ నా దర్శనం అయ్యింది కనుక నీకు ఈ జన్మలోనే..మీ గురువుగారు మాత్రం ఇంకో జన్మెత్తాలి అన్నాడు కృష్ణుడు. తరంగ రచనే తపస్సుగా తీర్థుడు భావించి 9 రకాల తాళాలు, 17 రకాల ఛందస్సులు ఉపయోగించి అమృతప్రాయమైన గీతాలు అనేకం రచించాడు.

తరంగాలలో పల్లవి, అనుపల్లవి, చరణాలు, నామ ముద్ర, జతులు ఉంటాయి. తన జీవితకాలం మొత్తమ్మీద 15 గ్రంథాలు రచించాడు. నారాయణ తీర్థుని ప్రభావంతోనే ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరిత్రం రచించినట్లు త్యాగరాజు చెప్పుకున్నాడు. భక్తిజ్ఞాన సౌందర్యాలు తరగలెత్తే కృష్ణలీలా తరంగిణి ముగించాకే రుక్మిణీ కృష్ణుల దివ్య దర్శనం లభించింది.

సంగీత, సాహిత్య, నాట్యశాస్త్రాలలో అనితరసాధ్యమైన ప్రావీణ్యం సాధించిన తీర్థుడు 95వ యేట తంజావూరుజిల్లా వరగూరులో కాలం చేశాడంటారు కానీ..తిరుపూంతురుత్తి గ్రామంలో కుదుమురుట్టి నదీ తీరంలో పెద్ద మామిడి చెట్టుకింద జీవసమాధి పొందినట్లు చెబుతారు స్థానికులు. ఇక్కడ తీర్థుడికి చిన్న మందిరం కూడా ఉంది.

ఆయన రచనలలో …

1. జయ జయ స్వామి జయ జయ2. శరణం భవ కరుణామయ3. ఏహి ముదం దేహి
4. కృష్ణం కలయసఖి సుందరం 5. ఆలోకయే శ్రీ బాలకృష్ణం ప్రసిద్ధమైనవి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!