Suryaprakash Josyula …………….
ఆయన ఒక వాక్యంతో ప్రపంచాన్ని వెలిగించాడు… ఆ వెలుగు ఏకంగా ఆయన్నే కాల్చేసింది.లండన్ ఒకప్పుడు ఆయన వాక్యాలతో వెలిగింది. మాటలు కాదు — అవి మెరుపులు..వీధుల్లో ఆయన పేరు వినగానే మేఘాల మధ్య నక్షత్రం మెరిసినట్టుండేది.
ఆస్కార్ వైల్డ్ !ఆయన కేవలం రచయిత కాదు,తన జీవితాన్నే ఒక నాటకంగా ఆడిన మనిషి. తన చమత్కారం గాలి లాంటిది…ఎవరూ పట్టుకోలేనిది, కానీ అందరినీ తాకే శక్తి. సమాజాన్ని నవ్విస్తూ ..అదే సమాజం తనని చూసి నవ్వుతుందని ఊహించలేని మనిషి.
అందం ఆయనకు మతం.వ్యంగ్యం ఆయనకు రక్షణ.మానవ ముసుగుల వెనుక దాగిన అబద్ధాలను —
ఆయన చంద్రకాంతిలో చూపించాడు. కానీ ప్రేమ…ఆయనకు కవిత కాదు — శాపం అయ్యింది. Lord Alfred Douglas అనే వ్యక్తితో మొదలైన ప్రేమ కథ.. ఆయనకు నాశనం తెచ్చింది.
ఒకప్పుడు “జీనియస్” అని పిలిచిన పత్రికలు, ఇప్పుడు “పెర్వర్ట్” అని అరచాయి.అప్లాజ్‌లతో నిండిన థియేటర్లు — ఇప్పుడు రాళ్లతో నిండిపోయాయి.ప్రతిభకు పట్టం కట్టినవాళ్లే పనికిమాలినవాడు అని తిట్టారు.
1895. తీర్పు… “Gross Indecency.” శిక్ష… రెండు సంవత్సరాల కఠిన కారాగార వాసం…. తన నవల “Dorian Gray”లో అందం వెనుక ఉన్న పతనం వర్ణించిన మనిషి ..ఇప్పుడు తన జీవితాన్నే ఆ నవలలోని అద్దంలో చూశాడు. సిల్క్ దుస్తులు పోయి — జైలు వస్త్రాలు. నవ్వులు పోయి — గొలుసుల శబ్దం.
చమత్కారం చనిపోయింది.కానీ మనిషి — ఇంకా మిగిలిపోయాడు. పగలంతా రాళ్లు కొడతాడు. రాత్రి — నిశ్శబ్దంతో మాట్లాడుతాడు.తనలోని ఆ మేధస్సు నెమ్మదిగా అహంకారాన్ని చీల్చింది. మిగిలింది ఒక్క సత్యం: వేదన. అదే వేదన De Profundisగా మారింది.
“దుఃఖం ఉన్న చోటే పవిత్రత ఉంటుంది,” అని ఆయన వ్రాశాడు. అది లేఖ కాదు — ఆత్మ తాకిన గానం.రెండు సంవత్సరాల తర్వాత విడుదలైనప్పుడు, ఆయన స్వేచ్ఛను పొందాడు.. కానీ సమాజం ఆయనను శాశ్వతంగా బంధించింది.
పారిస్ వీధుల్లో ఒక నీడ నడుస్తోంది. ఆయన అడుగులకు ఇక చప్పట్లు లేవు. సలోన్లు, చాంపేన్, మృదువైన నవ్వులు — అన్నీ గతం. ఇప్పుడు ఆయన స్నేహితుడు ఒక్కరే — నిశ్శబ్దం. ఒక మూల కేఫ్‌లో కూర్చుని,తనలో పగిలిన అద్దంలా తేలిపోతున్నాడు.
ఎవరూ గుర్తించని ఒక పాత మనిషి. కానీ ఆయన చూపులో ఇంకా ఒక వెలుగు ఉంది. అది గర్వం కాదు, అది కవిత. ఒకప్పుడు సొగసు ఆయన భాష అయితే, ఇప్పుడు నిశ్శబ్దమే ఆయన కవిత. ఆఖరికి ఆయన ఇలా అన్నాడు —
“సత్యం ఎప్పుడూ అందంగా ఉండదు, కానీ అది మనల్ని అందంగా చేస్తుంది.”

